Begin typing your search above and press return to search.

ఆడ తోడు కోసం ఆరు జిల్లాలు తిరిగిన టైగర్

By:  Tupaki Desk   |   2 Dec 2019 8:57 AM GMT
ఆడ తోడు కోసం ఆరు జిల్లాలు తిరిగిన టైగర్
X
ప్రపంచవ్యాప్తంగా ఏవో కొన్ని దేశాలు - రాష్ట్రాలు తప్ప ప్రతి చోటా పురుషులతో పోల్చితే మహిళల సంఖ్య తగ్గిపోతోంది. ఇతర జీవరాశుల్లోనూ ఇలాంటి పరిస్థితే ఏర్పడుతున్నట్లుంది. ఆడ తోడు కోసం రెండు మగ పులులు అయిదు నెలలుగా తిరిగిన చోట తిరగకుండా ఆరు జిల్లాలు తిరగడం ఇప్పుడు అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఆడతోడు కోసం ఈ పులులు ఏకంగా 150 రోజుల పాటు 1,300 కిలోమీటర్ల దూరం తిరిగాయని అటవీ అధికారులు చెబుతున్నారు. ఇవి మహారాష్ట్ర - తెలంగాణల్లోని ఆరు జిల్లాల పరిధిలో అడవులన్నీ తిరిగేశాయట. చివరకు మహారాష్ట్రలోని బుల్డానా జిల్లాలోని ధ్యానగంగ అభయారణ్యానికి చేరి అక్కడ జోడీని కనుక్కున్నాయట.

2016లో తిపేశ్వర్ పులుల అభయారణ్యంలో మూడు పులులు జన్మించాయి. వీటికి అధికారులు సీ-1 - సీ-2 - సీ-3 అని పేర్లు పెట్టారు. వీటికి ఇప్పుడు మూడేళ్లు. ఆడ తోడును - తనకంటూ ఓ ప్రత్యేక ప్రదేశాన్ని వెతుక్కుంటూ మగ పులులైన సీ-1 - సీ-3 బయలుదేరాయి. వీటి కదలికలను పరిశీలించేందుకు అధికారులు రేడియో కాలర్లు అమర్చారు. గత జూన్ లో తిపేశ్వర్ ను దాటిన ఇవి - పంధార్ కవాడా డివిజన్ మీదుగా తెలంగాణకు చేరాయి. సీ-3 అనే పెద్దపులి - ఆదిలాబాద్ పట్టణం శివార్ల వరకూ వచ్చింది. సీ-1 అనే పులి అంబాడీ ఘాట్ - కిన్వాత్ అడవుల ద్వారా ఆదిలాబాద్ డివిజన్ కు వచ్చింది.

ఈ సంవత్సరం ఆగస్టు నుంచి సెప్టెంబర్ మధ్య అంతర్రాష్ట్ర అడవుల్లో ఎన్నో రోజులు ఉన్న ఇవి, ఇప్పుడు ధ్యానగంగ అభయారణ్యానికి చేరుకున్నాయి. వందలాది గ్రామాలను దాటిన ఇవి - మానవులపై దాడికి దిగలేదని - ఆకలి వేసినప్పుడు పశువులపై దాడులు చేశాయని అధికారులు చెబుతున్నారు.