Begin typing your search above and press return to search.

తిరుమలలో పులులు - ఎలుగుబంట్ల సంచారం

By:  Tupaki Desk   |   25 March 2020 4:50 AM GMT
తిరుమలలో పులులు - ఎలుగుబంట్ల సంచారం
X
కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచం స్తంభించింది. దేశవ్యాప్తంగా ప్రధాన గుళ్లు - గోపురాలు కూడా మూసివేశారు. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవారి ఆలయం కూడా మూతబడింది. కేవలం అర్చకులు మాత్రమే ఉండి స్వామివారి కైంకర్యాలకు ఇబ్బందులు రాకుండా చూసుకుంటున్నారు. తిరుపతి నుండి తిరుమలకు నిత్యం చీమ చిటుక్కుమన్నా రాలని భక్త జనం ఉంటారు. ఇప్పుడు కరోనా కారణంగా రోడ్లన్నీ ఖాళీగా ఉన్నాయి.

తిరుమలలో జనసంచారం లేకపోవడంతో పులులు, ఎలుగుబంట్లు వంటి జంతు సంచారం పెరిగింది. రాత్రి సమయాల్లో చిరుతలు - ఎలుగులు రోడ్ల మీద సంచరిస్తున్నాయి. సోమవారం రాత్రి లింక్ రోడ్డు - కళ్యాణ వేదిక - ముల్లగుంటలో చిరుతలు సంచరించాయి. నారాయణగిరి ఉద్యానవనం వద్ద ఎలుగుబంటి సంచరించింది. ఈ మేరకు అధికారులు వెల్లడించారు.

రాత్రి సమయంలో ఘాట్ రోడ్డులో టీటీడీ అధికారులు వాహనాలను కూడా నిలిపివేశారు. స్థానికులు ఇళ్లకు పరిమితం కావాలని సూచించారు. చిరుత - ఎలుగుబంట్లు తిరుగుతుండటంతో స్థానికులు జాగ్రత్త పడుతున్నారు. శేషాచలం కొండల్లోని తిరుమల తిరుపతి దేవస్థానాల పరిధిలో 2,280 హెక్టార్ల అటవీ ప్రాంతం ఉంది. 25 చ.అ. కిలో మీటర్ల మేర అటవీ ప్రాంతం ఎన్నో రకాల జంతువులతో కలిగి ఉంటుంది.

ముఖ్యంగా పులులు - చిరుతలు - ఏనుగులు - పిల్లులు - ముళ్లపందులు - జింకలు ఉంటాయి. ప్రతి ఏడాది వేసవి కాలంలో కొన్ని జంతువులు అడవుల నుండి బయటకు వస్తుంటాయని టీటీడీ అధికారులు చెబుతున్నారు. వేసవి కాలంలో తాగునీటి కోసం రోడ్ల మీదకు వస్తాయని - ముల్లగుంట - కళ్యాణ వేదిక పరిసరాల్లో కనిపిస్తాయని చెబుతున్నారు.

అటవీ ప్రాంతం కావడంతో సాధారణ సమయంలోను రాత్రి 11 నుండి వేకువజామున 4 గంటల వరకు బైక్‌ లకు - రాత్రి 12 నుండి 2 గంటల వరకు మిగతా వాహనాలకు అనుమతి ఉండదు. ఇప్పుడు కరోనా నేపథ్యంలో వైకుంఠ దారిలో భక్తులు లేకపోవడంతో ఆ ప్రాంతాలకు పులులు, ఎలుగుబంట్లు వస్తున్నాయి. స్థానికులు ఇళ్లకే పరిమితం కావాలని అధికారులు - పోలీసులు - టీటీడీ ఫారెస్ట్ రేంజర్లు సూచిస్తున్నారు.