Begin typing your search above and press return to search.

ఇది విన్నారా.. 500 పులులు పెరిగాయట

By:  Tupaki Desk   |   12 April 2016 7:53 AM GMT
ఇది విన్నారా.. 500 పులులు పెరిగాయట
X
ఎప్పుడూ పులుల సంఖ్య తగ్గిపోతుందని వార్తలు వినడమే తప్ప.. వాటి సంఖ్య పెరిగిందన్న వార్తలు చాలా అరుదు. గత రెండు దశాబ్దాల్లో ఇలాంటి వార్త ఎక్కడా వినలేదు. ఐతే గత ఐదేళ్లలో మాత్రం అనూహ్యంగా పులుల సంఖ్య పెరిగింది. మన దేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా పులుల సంఖ్య గణనీయంగా వృద్ది చెందిందన్న వార్త జంతు ప్రేమికుల్ని సంతోష పెడుతోంది.

2010లో ప్రపంచవ్యాప్తంగా ఉన్న పులుల సంఖ్య 3200 కాగా.. ఈ ఏడాది ఆ సంఖ్య 3890కి చేరుకుంది. అంటే సుమారు 22 శాతం పులుల జనాభా పెరిగిందన్నమాట. ప్రపంచవ్యాప్తంగా 690 పులులు పెరిగితే భారత్ లోనే వాటి సంఖ్య 500 ఉండటం విశేషం. ప్రపంచంలో అత్యధికంగా పులుల్ని కలిగిన దేశం భారతే అన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం భారత్ లో పులుల సంఖ్య దాదాపు 2500 ఉండొచ్చని అంచనా. భారత్ తో పాటు రష్యా-నేపాల్-భూటాన్ దేశాల్లో సైతం పులుల సంఖ్య పెరిగింది.

పులుల సంరక్షణ విషయంలో గత కొన్నేళ్లలో భారత్ అనేక జాగ్రత్తలు తీసుకుంది. పులుల్ని వేటాడే వారికి కఠిన శిక్షలు పడేలా చట్టాలు తెచ్చింది. అలాగే పులుల సంరక్షణ కోసం భారీగా ఖర్చు పెట్టింది. సినీ సెలబ్రెటీలతో ప్రచారం చేయించింది. గట్టి భద్రతా ఏర్పాట్లు చేసింది. ఈ ఏడాది పులుల సంరక్షణ ప్రాజెక్టుకు 380 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ చెప్పడం విశేషం.