Begin typing your search above and press return to search.

విలీన ఎమ్మెల్యేలకు కొత్త క‌ష్టం.. సెక్యురిటీ రెట్టింపు!

By:  Tupaki Desk   |   14 Jun 2019 5:30 PM GMT
విలీన ఎమ్మెల్యేలకు కొత్త క‌ష్టం.. సెక్యురిటీ రెట్టింపు!
X
కొన్నిసార్లు అంతే.. చిన్న విష‌య‌మైనా చిలికి చిలికి గాలివాన‌లా మారుతుంది. గ‌తంలో ఎంత‌మంది ఎన్ని పార్టీల నుంచి ఎంత‌మంది నేత‌లు జంప్ కాలేదు. మిగిలిన రాష్ట్రాల సంగ‌తి ప‌క్క‌న పెట్టేసి.. ఐదేళ్ల క్రితం ఏర్ప‌డిన తెలంగాణ‌లో ఇప్ప‌టివ‌ర‌కూ జంపింగ్స్ ఎన్నో చూశాం. ఎప్పుడూ లేనంత ర‌చ్చ తాజాగా డ‌జ‌ను మంత్రి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టీఆర్ ఎస్ లో విలీన‌మైన వ్య‌వ‌హారం ఇప్పుడో పెద్ద దుమారంగా మారింది.

ఏమాత్రం ఊహించ‌ని రీతిలో విలీన ఎమ్మెల్యేల మీద.. వారిని చేర్చుకున్న టీఆర్ ఎస్ మీద భారీ ఎత్తున విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. ఇదిలా ఉంటే.. గురువారం ఏపీ అసెంబ్లీలో ఆ రాష్ట్ర సీఎం జ‌గ‌న్ పార్టీ ఫిరాయింపుల మీద చేసిన ప్ర‌క‌ట‌న చూసిన త‌ర్వాత‌.. ఈ బుద్ధి మా సీఎంకు ఎక్క‌డికి పోయిందంటూ ప‌లువురు తెలంగాణ నేత‌లు తిట్టి పోస్తున్నారు. అంతేకాదు.. విలీన ఎమ్మెల్యేల తీరుపై వారు ప్రాతినిధ్యం వ‌హిస్తున్న నియోజ‌క‌వ‌ర్గాల్లో వ్య‌తిరేక‌త నిండుగా ఉన్న‌ట్లుగా చెబుతున్నారు. దీంతో.. ఏదో ప‌వ‌ర్ అనుభ‌వించొచ్చ‌ని ఫీలైన డ‌జ‌ను మంది విలీన ఎమ్మెల్యేలకు గుండెలు అదిరిపోతున్నాయ‌ట‌. ఎప్పుడేం జ‌రుగుతుందో అర్థం కాక‌.. బ‌య‌ట‌కు వ‌చ్చేందుకు ఇష్ట‌ప‌డ‌టం లేద‌ట‌. అధికార పార్టీలోకి చేరితే.. ఇక త‌మ‌కు తిరుగు ఉండ‌ద‌నుకున్న వారికి.. అందుకు భిన్న‌మైన ప‌రిస్థితులు చోటు చేసుకోవ‌టం ఒక ప‌ట్టాన జీర్ణం కావ‌ట్లేదంటున్నారు.

ఇదంతా ఒక ఎత్తు అయితే.. విలీన ఎమ్మెల్యేల విష‌యంలో భ‌ద్ర‌త‌ను క‌ట్టుదిట్టం చేయాల‌ని ప్ర‌భుత్వం భావిస్తోంద‌ట‌. మొత్తం 12 మంది ఎమ్మెల్యేల్లో ఇద్ద‌రు ఎమ్మెల్యేల‌కు భ‌ద్ర‌తను డ‌బుల్ చేశారు. తాండూరు.. కొల్లాపూర్ ఎమ్మెల్యేల‌పై ఆయా నియోజ‌క‌వ‌ర్గాల్లో వ్య‌తిరేక‌త తీవ్రంగా ఉంద‌ని.. వారిపై దాడులు చేసే అవ‌కాశం ఉంద‌న్న‌ట్లు చెబుతున్నారు. దీంతో.. వారికి భ‌ద్ర‌త‌ను రెట్టింపు చేశారు. ఇప్ప‌టివ‌ర‌కూ ఎప్పుడు లేనంత ఎక్కువ‌గా ఫిరాయింపు ఎమ్మెల్యేల‌పై ప్ర‌జ‌ల్లో వ్య‌తిరేక‌త వ్య‌క్తం కావ‌టం విశేషం.