Begin typing your search above and press return to search.

ఓవైసీపై కేసు..కేసీఆర్‌ కు చెంప‌పెట్టు

By:  Tupaki Desk   |   3 Aug 2019 3:54 AM
ఓవైసీపై కేసు..కేసీఆర్‌ కు చెంప‌పెట్టు
X
మజ్లిస్ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీపై కేసు న‌మోదు అయింది. పోలీసులు లేకుంటే 15 నిమిషాల్లో 100 కోట్ల హిందువులను చంపేస్తానని చెప్పిన తన ఈ వ్యాఖ్యలతో బీజేపీ, ఆరెస్సెస్ భయపడ్డాయని కరీంనగర్లో నిర్వహించిన ముస్లింల ఆత్మీయ సమ్మేళనంలో ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగ‌తి తెలిసిందే. దీనిపై బీజేపీ నేత‌లు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే, వారు కేసు న‌మోదు చేయ‌లేదు. దీంతో కోర్టును ఆశ్ర‌యించ‌గా..తాజాగా కేసు న‌మోదు అయింది.

మజ్లిస్ మతతత్వ పార్టీ కానే కాదని పేర్కొంటూ త‌న‌పై విమ‌ర్శ‌లు చేసే వారే మ‌త‌తత్వ నేత‌ల‌ని అన్నారు. అన్నారు. ఎంఐఎంను మతతత్వ పార్టీ అని దుష్ప్రచారం చేస్తున్నవాళ్లంతా గాడ్సే వారసులేనని అన్నారు. సమాజం భయపడేవాడినే భయపెడుతుందని ఆయన అన్నారు. తమకు రాజ్యాంగం మీద ఎంతో గౌరవం ఉందని, దేశంలో మతతత్వ శక్తులు పెరుగుతున్నాయని ఆందోళన చెందేకంటే.. మనలోని లోపాలు గుర్తించాలని అన్నారు. తాను మెప్పు పొందేందుకు కాదని, అవగాహన పెంచేందుకే కరీంనగర్‌ కు వచ్చానన్నారు. కాగా, అక్బ‌ర్ వ్యాఖ్య‌ల‌పై మండిపడ్డ బీజేపీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే వారు కేసు న‌మోదు చేయ‌లేదు. దీంతో జిల్లా బీజేపీ నేతలు కరీంనగర్ కోర్టులో పిటిషన్ వేశారు. అక్బరుద్దీన్ చేసిన వ్యాఖ్యల వీడియోను కూడా ఆధారంగా సమర్పించారు. ఆధారాలను సమర్పించిన న్యాయమూర్తి కేసు నమోదు చేయాలని పోలీసులను ఆదేశించారు.

కోర్టు ఆదేశాల‌ను పాటిస్తూ పోలీసులు కేసు న‌మోదు చేశారు. అనుచిత వ్యాఖ్యలు చేసిన అక్బరుద్దీన్‌ పై ఐపీసీ 153 ఏ, 153 బీ, 506, సీఆర్పీసీ 156 (3) కింద కేసు నమోదు చేశారు. దీని కింద ఆయనకు నోటీసులు ఇవ్వ‌నున్నారు. విచారణకు హాజరుకాకుంటే అదుపులోకి తీసుకుంటారు. న్యాయస్థానం ఆదేశాలతో 24 గంటల్లోపే పోలీసులు కేసు నమోదు చేయ‌డం గ‌మ‌నార్హం.

కాగా, ఈ ఎపిసోడ్‌పై బీజేపీ స్పందించింది. కరీంనగర్లో మత విద్వేషాలను రెచ్చగొట్టే ప్రసంగాలు చేసిన మజ్లిస్ నేత అక్బరుద్దీన్ ఒవైసీపై కేసు పెట్టాలని కోర్టు ఆదేశించడం సీఎం కేసీఆర్‌కు చెంపపెట్టులాంటిదని బీజేపీ సీనియర్ నేత ఎన్.ఇంద్రసేనారెడ్డి అన్నారు. ఇదిలాఉండ‌గా, తాను రెచ్చగొట్టేలా వ్యాఖ్యానించలేదని అక్బ‌రుద్దీన్ ఓ ప‌త్రికా ప్ర‌క‌ట‌న‌లో వెల్ల‌డించారు. ఒక వర్గాన్ని కించపరచలేదని తన వ్యాఖ్యలను సమర్థించుకున్నాడు. తన వ్యాఖ్యలను కొందరు వక్రీకరించారని పేర్కొన్నారు.