Begin typing your search above and press return to search.

టిక్ టాక్ మ‌ళ్లీ వ‌చ్చేస్తోంది..?

By:  Tupaki Desk   |   6 July 2021 10:30 AM GMT
టిక్ టాక్ మ‌ళ్లీ వ‌చ్చేస్తోంది..?
X
'టిక్ టాక్'.. దేశంలో యూత్ ను ఒక‌ ఊపు ఊపేసిన ఈ సామాజిక మాధ్య‌మం గురించి తెలియ‌ని నెటిజ‌న్ లేనే లేరు. షార్ట్ అండ్ స్వీట్ గా ముగిసిపోయే ఈ యాప్‌.. దాదాపుగా ప్ర‌తి ఒక్క‌రినీ ఆక‌ట్టుకుంది. ఇక‌, యువ‌త‌రం గురించి చెప్పాల్సిన ప‌నేలేదు. త‌మ‌లోని టాలెంట్ ను చూపించ‌డానికి స‌రైన వేదిక దొరికిందంటూ.. టిక్ టాక్ ను విప‌రీతంగా దున్నేశారు. వ‌య‌సుతో ప‌నిలేకుండా అంద‌రూ టిక్ టాక్ లో స‌భ్యులైపోయారు.

అయితే.. ఉన్న‌ట్టుండి భార‌త ప్ర‌భుత్వం దీనిపై నిషేధం విధించింది. చైనాతో ఏర్ప‌డిన స‌రిహ‌ద్దు ఘ‌ర్ష‌ణ‌ల నేప‌థ్యంలో.. కేంద్ర ప్ర‌భుత్వం ఈ నిర్ణ‌యం తీసుకుంది. ఆ త‌ర్వాత మ‌ళ్లీ వ‌స్తుంద‌ని భావించినా.. సాధ్యం కాలేదు. అయితే.. ఇప్పుడు టిక్ టాక్ ఫ్యాన్స్ కు సంతోషాన్నిచ్చే వార్త ఒక‌టి బ‌య‌ట‌కు వచ్చింది. లేటెస్ట్ అప్డేట్ ప్ర‌కారం.. టిక్ టాక్ మ‌ళ్లీ ఇండియాలోకి వ‌చ్చే అవ‌కాశం క‌నిపిస్తోంది.

అవును.. టిక్ టాక్ ను రూపొందించిన సంస్థ బైట్ డ్యాన్స్ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. ఈ యాప్ ను అమ్మేయాల‌ని నిర్ణ‌యించింది. ఈ యాప్ కు సంబంధించిన టెక్నాల‌జీతోపాటు అత్యంత ముఖ్య‌మైన అల్గారిథ‌మ్ సైతం అమ్మేందుకు సిద్ధ‌మైంది. ఈ మేర‌కు ప్ర‌క‌ట‌న కూడా చేసింది.

దీన్ని కొనుగోలు చేసుకునే ఛాన్స్ ఉన్న దేశాల జాబితాలో భార‌త్ ను సైతం చేర్చింది. ఈ మేర‌కు ప్ర‌క‌ట‌న చేసిన బైట్ డ్యాన్స్ సంస్థ‌.. ఆస‌క్తిగ‌ల‌వారు సంప్ర‌దించాల‌ని కోరింది. అయితే.. టిక్ టాక్ పై ఉన్న క్రేజ్ దృష్ట్యా ఈ యాప్ ను కొనుగోలు చేసేందుకు చాలా కంపెనీలు పోటీ ప‌డుతున్నారు. అమెరికా నుంచి ఫ్యాష‌న్‌యాప్ గోట్‌, సింగ‌పూర్ నుంచి ట్రావెల్ బుకింగ్ వెబ్ సైట్ వీగో, త‌దిత‌ర దేశాల కంపెనీలు రేసులో స‌మాచారం.

ఇక‌, భార‌త్ విష‌యానికి వ‌స్తే ఒక‌టి క‌న్నా ఎక్కువ కంపెనీలు పోటీ ప‌డుతున్నారు. ఇండియా నుంచి ప్ర‌స్తుతం వీడియో కంటెంట్ తో నెటిజ‌న్ల‌ను ఆక‌ర్షిస్తున్న ఓ కంపెనీతోపాటు షార్ట్ న్యూస్ అందించే మ‌రో యాప్‌, ఒక ప్ర‌ముఖ న్యూస్ ఛాన‌ల్‌, ఓ ఫుడ్ అవుట్ లెట్ తోపాటు మొత్తం 12 కంపెనీలు రేసులో నిలిచిన‌ట్టు తెలుస్తోంది.

అయితే.. ఇక్క‌డే కీల‌క విష‌యంపై క్లారిటీ రావాల్సి ఉంది. టిక్ టాక్ అనేది చైనా కంపెనీ కంపెనీ కాబ‌ట్టి.. కేంద్ర ప్ర‌భుత్వం నిషేధించింది. మ‌రి, వేరే కంపెనీ దీన్ని కొనుగోలు చేసిన‌ప్పుడు దేశం మారిపోతుంది. పేరు కూడా మారొచ్చు. అప్పుడు భార‌త ప్ర‌భుత్వం దీన్ని అనుమ‌తిస్తుందా? అన్న‌ది తేలాలి. ఓకే అయితే మాత్రం.. మ‌రోసారి టిక్ టాక్ వీడియోలు ర‌చ్చ చేస్తాయ‌ని వేరే చెప్ప‌క్క‌ర్లేదు.