Begin typing your search above and press return to search.

కేసీఆర్ రంగంలోకి దిగాల్సిన టైమొచ్చేసినట్లే

By:  Tupaki Desk   |   19 Jun 2020 1:30 PM GMT
కేసీఆర్ రంగంలోకి దిగాల్సిన టైమొచ్చేసినట్లే
X
మాయదారి రోగ తీవ్రతను ముందుగా పసిగట్టిన అతి కొద్ది ముఖ్యమంత్రుల్లో తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్ ఒకరు. అందరి కంటే ముందే లాక్ డౌన్ ప్రకటించిన ఆయన.. తెలంగాణలో రోగ తీవ్రత పెరగకుండా కట్టడి చేయటంలో సక్సెస్ అయ్యారన్న పేరును సొంతం చేసుకున్నారు. అలాంటి ఆయనకు కొద్దిరోజులుగా ఇబ్బందికర పరిస్థితులు చోటు చేసుకుంటున్నాయి. మహమ్మారి తీవ్రత అంతకంతకూ పెరగటమే కాదు.. సర్కారుకు సవాలు విసిరే స్థాయికి వెళ్లిందన్న మాటను తాజాగా విడుదల చేసిన బులిటెన్ స్పష్టం చేస్తోంది.

గడిచిన వారం రోజులుగా అంతకంతకూ పెరుగుతున్న పాజిటివ్ కేసులు.. గురువారం కొత్త రికార్డును క్రియేట్ చేశాయి. ఒక్కరోజులోనే 352 కేసులు నమోదయ్యాయి. జీహెచ్ఎంసీ పరిధిలోనే 302 కేసులు నమోదు కావటం కలకలం రేపుతోంది. రాష్ట్రం మొత్తమ్మీదా 352 కేసులు నమోదు కాగా.. తొంభైశాతం కేసులు హైదరాబాద్ మహానగరంలోనే చోటు చేసుకోవటం గమనార్హం. మొన్నటివరకూ నిర్దారణ పరీక్షలు ఆచితూచి నిర్వహిస్తున్న దానికి బదులుగా.. గడిచిన రెండు రోజులుగా అనుమానితులందరికి పరీక్షలు నిర్వహిస్తున్నారు.

ఈ కారణంతోనే పాజిటివ్ కేసులు ఎక్కువగా నమోదవుతున్నట్లు చెబుతున్నారు. తాజా పాజిటివ్ లతో కలిపి రాష్ట్రం మొత్తమ్మీదా కేసుల సంఖ్య 6027 కాగా.. ఇప్పటివరకూ 3301 మంది డిశ్చార్జి అయ్యారు. మొత్తంగా 2531 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటివరకూ 195 మంది మరణించారు. ఏమైనా.. పెరుగుతున్న కేసుల తీవ్రత చూసిన తర్వాత.. సీఎం కేసీఆర్ తరచూ ఫాంహౌస్ కు వెళ్లటాన్ని తగ్గించాల్సిన అవసరం ఉందన్న మాట వినిపిస్తోంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రగతిభవన్ లోనే ఉండిపోయి.. వరుస సమీక్షలతో పాటు.. కేసుల వ్యాప్తికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. రానున్న రోజుల్లో చేపట్టాల్సిన చర్యల మీద మరింత ఫోకస్ చేయాల్సిన అవసరం ఉందన్న మాట వినిపిస్తోంది.