Begin typing your search above and press return to search.
ఎయిడ్స్ జయించిన తొలి వ్యక్తి ఇతడేనట!
By: Tupaki Desk | 12 Sep 2016 11:28 AM GMTనివారణ ఒక్కటే మార్గం - చికిత్స లేదు... అనగానే అందరికీ గుర్తొచ్చే భయంకరమైన వ్యాధి ఎయిడ్స్. ఈ వ్యాధి సోకినవారు దినదిన గండం దీర్ఘాయుష్షు అన్నట్టుగా బతుకు ఈడ్చుతూ ఉంటారు. ఒక్కసారి హెచ్.ఐ.వి. పరీక్ష తరువాత వ్యాధి నిర్దారణ అయిందంటే చాలు... శరీరంలోని రోగనిరోధక శక్తి రోజురోజుకీ తగ్గిపోతూ ఉంటుంది. రకరకాల సమస్యలు వచ్చేస్తుంటాయి. అంతకంటే ముందు మానసిక స్థైర్యం కోల్పోతారు. ఎయిడ్స్ వ్యాధి సోకినవాడు బతికి బట్టకట్టినట్టు ఇంతవరకూ చరిత్ర లేదు. కానీ, ఇతగాడు ఎయిడ్స్ జయించాడు! ఎయిడ్స్ మహమ్మారి మృత్యు కౌగిళ్ల నుంచి బయటపడ్డ తొలి వ్యక్తి ఇతడే.
ఇతని పేరు తిమోతీ రాయ్ బ్రౌన్. 1995లో తిమోతీకి ఎయిడ్స్ ఉందని వైద్యులు నిర్దారించారు. చికిత్స కోసం బెర్లిన్ వెళ్లాడు. ఎయిడ్స్ నివారణలో భాగంగా జరుగుతున్న పరిశోధనల్లో తిమోతీపై వైద్యులు చాలా ప్రయోగాలు చేశారు. స్టెమ్ సెల్ ప్లాంటేషన్ అనే పద్ధతిని అనుసరించి తిమోతీకి చికిత్స కొన్నాళ్లు చేశారు. 2007 నుంచి ఇదే పద్ధతితో చికిత్స చేసుకుంటూ వచ్చారు. మొత్తానికి ఈ పద్ధతి కొన్ని పాజిటివ్ రిజల్ట్స్ ఇచ్చింది. తిమోతీ శరీరంలో సీడీ 4 కౌంట్ గణనీయంగా పెరిగింది. ఇది రోగ నిరోధక శక్తి పెరగడానికి ఎంతగానో దోహదపడింది. రెట్రో వైరల్ థెరఫీతో సహా పలు విధానాల్లో తిమోతీకి కొన్నేళ్లుగా చికిత్సలు చేశామని వైద్యులు చెప్పారు. కొన్నాళ్ల తరువాత అతడి శరీరంలో హెచ్.ఐ.వి. వైరస్ కనుమరుగు అయిపోయిందని బెర్లిన్ వైద్యులు ప్రకటించారు. తిమోతీకి చేసిన వైద్యం మంచి ఫలితాలను ఇవ్వడంతో అతడు ఎయిడ్స్ మహమ్మారి నుంచి బయటపడ్డాడు. దీంతో ఎయిడ్స్ జయించిన తొలి వ్యక్తిగా తిమోతీ పేరు ఇప్పుడు మార్మోగుతోంది.