Begin typing your search above and press return to search.

క‌మ‌ల‌నాథుల్లో హాట్ టాపిక్ గా కోవింద్ వ్యాఖ్య‌లు

By:  Tupaki Desk   |   25 Oct 2017 12:25 PM GMT
క‌మ‌ల‌నాథుల్లో హాట్ టాపిక్ గా కోవింద్ వ్యాఖ్య‌లు
X
రాజ‌కీయాల‌కు.. రాజ‌కీయ ప‌క్షాల‌కు అతీతంగా ఉండే వ్య‌క్తి రాష్ట్రప‌తి. అత్యున్న‌త స్థానంలో ఉండే ఈ ప‌ద‌విలో కూర్చున్న వారి ఎంపిక రాజ‌కీయపార్టీల లెక్క‌ల‌తో ముడిప‌డి ఉండ‌టం తెలిసిందే. దీంతో.. పేరుకు రాష్ట్రప‌తి అయినా.. ఆ ప‌ద‌విలో కూర్చోబెట్టే పార్టీ లైన్‌కు త‌గ్గ‌ట్లుగా ప‌ద‌విలో ఉండే వారు వ్య‌వ‌హ‌రిస్తార‌న్న భావ‌న బ‌లంగా ఉంది. గ‌తంలో రాజ‌కీయాలు ఇప్పుడున్నంత దారుణంగా లేక‌పోవ‌టంతో.. అత్యుత్త‌మ స్థానాల్లో ఉన్న వారు స్వ‌తంత్య్రంగా వ్య‌వ‌హ‌రించే స్వేచ్ఛ ఉండేది. కానీ.. ఇప్పుడు ప‌రిస్థితి మారిపోయింది.

ప్ర‌తి మాట‌కు ఒక అర్థాన్ని వెతికే ల‌క్ష‌ణం పెరిగింది. దీంతో.. ఏ మాట మాట్లాడినా దానికో పెడార్థం తీసుకోవ‌టం.. ఉలిక్కిప‌డ‌టం ఎక్కువైంది. తాజాగా చోటు చేసుకున్న ప‌రిణామం చూస్తే ఇదే విష‌యం అర్థ‌మ‌వుతుంది. ఎవ‌రు అవున‌న్నా.. కాద‌న్నా రాష్ట్రప‌తి స్థానంలో కూర్చున్న వారు ఆచితూచి మాట్లాడాల్సిందే. ఎంత బీజేపీకి చెందిన వ్య‌క్తి అయిన‌ప్ప‌టికీ సంఘ్ భావ‌జాలాన్ని.. బీజేపీ నేత‌ల అతి మాట‌ల్ని.. కొత్త సిద్ధాంతాల్ని దేశ ప్ర‌ధ‌మ పౌరుడి హోదాలో ఉన్న వ్య‌క్తి నోట నుంచి రాలేవు. ఈ చిన్న విష‌యాన్ని గుర్తించ‌ని క‌మ‌ల‌నాథుల‌కు రాష్ట్రప‌తి కోవింద్ మాట్లాడిన మాట‌లు క‌ల‌వ‌రాన్ని రేపుతున్నాయి.

ఇంత‌కీ బీజేపీ నేత‌ల‌కు ఇబ్బందిగా మారిన కోవింద్ మాట‌ల్లోకి వెళ్లే ముందు.. బ్యాక్ గ్రౌండ్ గురించి కాస్త తెలుసుకుంటే విష‌యం ఇట్టే అర్థ‌మ‌వుతుంది. ఇప్ప‌టివ‌ర‌కూ జాతి జ‌నుల‌కు తెలిసిన చారిత్ర‌క అంశాలు.. వీరుల‌కు సంబంధించి బీజేపీ బ్యాచ్ స‌రికొత్త‌గా సూత్రీక‌రిస్తున్న సంగ‌తి తెలిసిందే. అలాంటి జాబితాలో టిప్పు సుల్తాన్ చేరారు. బ్రిటీష‌ర్ల‌కు వ్య‌తిరేకంగా పోరాడిన యోధుడిగా దేశ ప్ర‌జ‌ల మ‌దిలో నిలిస్తే.. బీజేపీ నేత‌లు మాత్రం టిప్పు సుల్తాన్‌ను ద్రోహిగా అభివ‌ర్ణించ‌టం కొంత‌కాలంగా సాగుతున్న‌దే.

మైసూర్ పాల‌కుడిగా వేలాది మంది హిందువుల‌ను.. క్రిస్టియ‌న్ల‌ను హ‌త‌మార్చాడ‌ని.. బ‌ల‌వంత‌పు మ‌త‌మార్పిళ్ల‌కు టిప్పు సుల్తాన్ పాల్ప‌డ్డాడ‌ని ఇటీవ‌ల బీజేపీ ఎమ్మెల్యే అశ్వంత్ నారాయ‌ణ్ పేర్కొన‌టం పెను దుమారాన్ని రేపింది. టిప్పు సుల్తాన్ జ‌యంతోత్స‌వాల‌కు క‌ర్ణాట‌క ప్ర‌భుత్వ ఆహ్వానాన్ని బీజేపీ తోసిపుచ్చింది కూడా. టిప్పు కార్య‌క్ర‌మం నిర్వ‌హించ‌టం సిగ్గుచేటుగా అభివ‌ర్ణించారు. టిప్పు వ్య‌తిరేక వ్యాఖ్య‌లు చేయ‌టంలో బీజేపీ రాజ‌కీయ లాభం వేరే ఉంద‌న్న మాట‌ను ప‌లువురు చెబుతారు. త్వ‌ర‌లో జ‌రిగే క‌ర్ణాట‌క అసెంబ్లీ ఎన్నిక‌ల నేప‌థ్యంలో మ‌తం ప్రాతిప‌దిక‌న చేసే వ్యాఖ్య‌లు బీజేపీకి అనుకూలంగా మారి.. ఎన్నిక‌ల్లో ప్ర‌యోజ‌నం క‌లుగుతుంద‌ని.. అందుకు టిప్పు వ్య‌తిరేక గ‌ళాన్ని వినిపిస్తున్నార‌ని బీజేపీ వ్య‌తిరేక‌పార్టీలు చెబుతున్నాయి.

ఇదిలా ఉంటే.. తాజాగా క‌ర్ణాట‌క విధాన‌సౌథ 60వ వార్షికోత్స‌వం జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మానికి హాజ‌రైన రాష్ట్రప‌తి కోవింద్‌.. టిప్పు ప్ర‌స్తావ‌న‌ను త‌న ప్ర‌సంగంలో తెచ్చారు. మైసూర్ పాల‌కుడు టిప్పు సుల్తాన్ గొప్ప యుద్ధ వీరుడ‌ని ఆయ‌న వ్యాఖ్యానించ‌టంతో పాటు.. బ్రిటిష్ పాల‌కుల‌పై పోరాడుతూ టిప్పు సుల్తాన్ వీర మ‌ర‌ణం పొందార‌న్నారు. యుద్ధంలో మైసూర్ రాకెట్ల‌కు ఆయ‌నే నాంది ప‌లికిన‌ట్లుగా కొనియాడిన కోవింద్‌.. క‌ర్ణాట‌క ప్రాంత గొప్ప‌త‌నాన్ని కీర్తించారు.

పురాత‌న జైనుల‌కు.. బౌద్ధ సంప్ర‌దాయాల‌కు క‌న్న‌డ నేల ప్ర‌సిద్ధి చెందింద‌ని.. ఆదిశంక‌రాచార్యుడు క‌ర్ణాట‌క‌లోనే శృంగేరి మ‌ఠాన్ని నెల‌కొల్పాడ‌ని.. గుల్బ‌ర్గా ప్రాంతం సూఫీ సంస్కృతికి కేంద్రంగా వెల్లివిరిసింద‌ని.. క‌ర్ణాట‌క‌లోనే బ‌స‌వాచార్య నేతృత్వంలో లింగాయ‌త్ ఉద్య‌మం పురుడు పోసుకుంద‌న్నారు.

ఇలా క‌న్న‌డ నేల గొప్ప‌త‌నాన్ని కీర్తించిన రాష్ట్రప‌తి.. భార‌తసైన్యంలో క‌ర్ణాట‌క అందిస్తున్న స‌హ‌కారాన్ని మ‌ర‌వ‌లేనిదంటూ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. సైన్యంలో ఇద్ద‌రు చీఫ్ లు.. ఫీల్డ్ మార్ష‌ల్ కేఎం క‌రియ‌ప్ప‌.. జ‌న‌ర‌ల్ కేఎస్ తిమ్మ‌య్య క‌ర్ణాట‌క బిడ్డ‌లేన‌ని గుర్తు చేశారు. ఓప‌క్క తాను ఒక‌ప్పుడు ప్రాతినిధ్యం వ‌హించిన బీజేపీ వ్య‌తిరేకిస్తున్న టిప్పు సుల్తాన్ ను కోవింద్ పొగ‌డ‌టంతో పాటు త‌న వైఖ‌రిని స్ప‌ష్టంగా వెల్ల‌డించ‌టం క‌మ‌ల‌నాథుల‌కు ఇప్పుడు కొత్త క‌ష్టంగా మారింది. టిప్పు సుల్తాన్ పై కోవింద్ వ్యాఖ్య‌లు బీజేపీ నేత‌ల‌కు ఏ మాత్రం రుచించ‌టం లేదు. రాష్ట్రప‌తి అయ్యాక కూడా బీజేపీ అధికార‌ప్ర‌తినిధిగా వ్య‌వ‌హ‌రించాల‌ని క‌మ‌ల‌నాథులు కోరుకోవ‌టం అత్యాశే అవుతుంది.