Begin typing your search above and press return to search.

సీసీఏకి వ్యతిరేకంగా పాతబస్తీలో ముస్లింల తిరంగా ర్యాలీ!

By:  Tupaki Desk   |   10 Jan 2020 12:55 PM GMT
సీసీఏకి వ్యతిరేకంగా పాతబస్తీలో ముస్లింల తిరంగా ర్యాలీ!
X
ప్రస్తుతం దేశ వ్యాప్తంగా కేంద్రం కొత్తగా తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టం పై ఆందోళనలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ ఆందోళనలు రోజురోజుకి ఉదృతంగా మారుతున్నాయి. ఇకపోతే ఈ పౌరసత్వ సవరణ చట్టం పై హైదరాబాద్ లో కూడా పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్నారు. తాజాగా నేడు కూడా పౌరసత్వ సవరణ చట్టం కి వ్యతిరేకంగా ఒక భారీ ర్యాలీని చేపట్టారు. ఈ భారీ ర్యాలీతో హైదరాబాద్ ముస్లింలు మరోసారి వార్తల్లో ప్రముఖంగా నిలిచారు. ముస్లిం యునైటెడ్‌ యాక్షన్‌ కమిటీ ఆధ్వర్యంలో పాతబస్తీలోని మీరాలంలో శుక్రవారం మధ్యాహ్నం భారీ నిరసన ర్యాలీ చేపట్టారు. పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ), ఎన్నార్సీకి వ్యతిరేకంగా చేపట్టిన ఈ ర్యాలీకి వయోభేదం లేకుండా మహిళలు, చిన్నారులు, వృద్దులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

జాతీయ జెండాలు చేత పట్టుకొని మరోసారి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. మీరాలం ఈద్గాలో శుక్రవారం ప్రత్యేక ప్రార్థనల అనంతరం ఈ ర్యాలీ ప్రారంభమైంది. తిరంగా ర్యాలీగా పిలిస్తున్న ఈ ప్రదర్శనలో సుమారు 40 వేల మంది పాల్గొన్నట్లు సమాచారం. భారీ ర్యాలీతో పాతబస్తీ రోడ్లన్నీ కిక్కిరిసిపోయాయి. సీఏఏ, ఎన్నార్సీకి వ్యతిరేకంగా ముస్లింలు నినాదాలు చేశారు. హిందూస్థాన్ జిందాబాద్ అంటూ హోరెత్తించారు. ర్యాలీ నేపథ్యంలో అటు పోలీసులు కూడా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. హైదరాబాద్‌, సైబరాబాద్‌ కమిషనరేట్ల పరిధిలోని పోలీసు అధికారులు బందోబస్తు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ర్యాలీ సందర్భంగా ఆయా ప్రాంతాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు. ముస్లింల ర్యాలీతో పాతబస్తీ సైడ్ రోడ్లలో ట్రాఫిక్ స్తంభించిపోయింది.

హసన్‌ నగర్‌ - ఆరాంఘర్‌ - మైలార్‌ దేవ్‌ పల్లి మీదుగా శాస్త్రిపురం వరకు ఈ ర్యాలీ కొనసాగనుంది. అనంతరం అక్కడ బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఈ సభలో ఎంఐఎం అధినేత - ఎంపీ అసదుద్దీన్‌ ఓవైసీ కీలక ప్రసంగం చేయనున్నారు. పౌరసత్వ సవరణ చట్టం, ఎన్నార్సీకి వ్యతిరేకంగా మరోసారి గళం వినిపించనున్నారు. దీంతో పాటు బీజేపీ నేతలు తనపై చేస్తున్న విమర్శలకు కౌంటర్ ఇచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇటీవల సీఏఏ, ఎన్నార్సీకి వ్యతిరేకంగా ముస్లింలు ఇందిరాపార్క్ వద్ద భారీ ర్యాలీ చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ ర్యాలీకి భారీ సంఖ్యలో తరలివచ్చిన ముస్లింలు ట్యాంక్ బండ్ మీద ప్రదర్శన నిర్వహించారు. ట్యాంక్ బండ్, ఇందిరాపార్క్, ఎన్టీఆర్ స్టేడియం కిక్కిరిసిపోయాయి.