Begin typing your search above and press return to search.

ఉత్తరాఖండ్ సీఎంగా తిరథ్ సింగ్ రావత్ .. త్రివేంద్ర సింగ్ రాజీనామాకి కారణం ఏమిటంటే ?

By:  Tupaki Desk   |   10 March 2021 8:30 AM GMT
ఉత్తరాఖండ్ సీఎంగా తిరథ్ సింగ్ రావత్ .. త్రివేంద్ర సింగ్ రాజీనామాకి కారణం ఏమిటంటే ?
X
ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్ రావత్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన విష‌యం తెలిసిందే. బీజేపీ అధిష్ఠానం సూచ‌న‌ల మేర‌కే ఆయ‌న రాజీనామా చేశారు. దీంతో సీఎం పదవి రేసులో ఉన్నారంటూ ప‌లువురి పేర్లు విన‌ప‌డ్డాయి. ఇప్ప‌టికే కేంద్ర, రాష్ట్ర మంత్రుల హోదాలో ఉన్న నేతల పేర్లను బీజేపీ పరిశీలించింది. ఫైనల్ గా ఉత్తరాఖండ్ సీఎం కుర్చీలో బీజేపీ ఎంపీ తిరథ్ సింగ్ రావత్ కూర్చున్నారు. ఆయన్ను సీఎంగా ఎన్నుకుంటూ పార్టీ వర్గాలు బుధవారం నిర్ణయం తీసుకున్నాయి. 56 ఏళ్ల తిరథ్ సింగ్ రావత్..2013-15 మధ్య ఉత్తరాఖండ్‌లో పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహించారు. గతంలో రాష్ట్ర ఎమ్మెల్యేగా కూడా పనిచేశారు. కేంద్ర మంత్రి రమేష్ ఫోఖ్రియాల్ నిషాంక్, ఉత్తరాఖండ్ రాష్ట్ర మంత్రి ధన్ సింగ్ రావత్‌ తదితరుల పేర్లను పరిశీలించిన అనంతరం సీఎం పదవిని తిరథ్ ‌కు బీజేపీ అధిష్టానం అవకాశం ఇచ్చింది.

ఇదిలా ఉంటే .. అయన రాజీనామా అనంతరం మీడియా తో మాట్లాడుతున్న సమయంలో రాజీనామాకు కారణం ఏమిటని అడిగితే.. ఆ ప్రశ్నకు సమాధానం దిల్లీలో లభిస్తుందని త్రివేంద్రసింగ్ చెప్పారు. ఆయన సీఎం పదవి నుంచి తప్పుకుంటారని కొద్ది రోజులుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మార్చి ఎనిమిదో తేదీన గారాసాయిన్‌ లో మహిళా దినోత్సవంలో పాల్గొనాల్సిన సీఎం త్రివేంద్ర సింగ్ రావత్ హుటాహుటిన దేశ రాజధాని దిల్లీకి వెళ్లారు. ఉత్తరాఖండ్ నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్న పార్లమెంటు సభ్యుడు అనిల్ బులానిని, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జె.పి.నడ్డాను ఆయన కలిశారు. దీంతో రాష్ట్రంలో ముఖ్యమంత్రిని మారుస్తున్నారనే ఊహాగానాలు ఊపందుకున్నాయి. సీఎం కు వ్యతిరేకంగా కొందరు నేతలు ఢిల్లీలో బీజేపీ అధిష్టానం వద్ద పెద్ద ఎత్తున ఫిర్యాదులు చేశారు. ఈ క్రమంలో కొందరు మంత్రులు కూడా సీఎం రావత్‌ కు వ్యతిరేకంగా చక్రం తిప్పారు. ఈ క్రమంలో రాష్ట్రంలో పరిస్థితి గురించి వాకబు చేసేందుకు ఢిల్లీ పెద్దలు ఉత్తరాఖండ్ ‌కు ఒక టీమ్‌ను పంపారు. ఆ టీమ్ రాష్ట్రంలో పరిస్థితిని పరిశీలించి రిపోర్టు ఇచ్చింది. ఆ తర్వాత ఢిల్లీ అధిష్టానం రావత్‌ను పిలిపించి మాట్లాడింది. ఢిల్లీ వెళ్లి వచ్చిన రావత్ మంగళవారం గవర్నర్ ‌కు రాజీనామా లేఖను సమర్పించారు. ఉత్తరాఖండ్‌లో 70 అసెంబ్లీ స్థానాలు ఉండగా.. 2017 ఎన్నికల్లో 57 స్థానాల్లో బీజేపీ గెలవగా.. కాంగ్రెస్ పార్టీ 11 సీట్లకే పరిమితమైంది. సీఎంగా త్రివేంద్ర సింగ్ రావత్ బాధ్యతలు చేపట్టారు. 2000 సంవత్సరంలో ఏర్పడిన ఉత్తరాఖండ్‌ కు పదో సీఎం ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్.