Begin typing your search above and press return to search.

టీటీడీ కీల‌క నిర్ణ‌యం: 11 నుంచి ద‌ర్శ‌నం.. పిల్ల‌లు - వృద్ధుల‌కు నో ఎంట్రీ

By:  Tupaki Desk   |   5 Jun 2020 9:10 AM GMT
టీటీడీ కీల‌క నిర్ణ‌యం: 11 నుంచి ద‌ర్శ‌నం.. పిల్ల‌లు - వృద్ధుల‌కు నో ఎంట్రీ
X
వైర‌స్ వ్యాప్తి నేప‌థ్యంలో విధించిన లాక్‌డౌన్‌తో ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని తిరుమ‌ల దేవ‌స్థానం కూడా భ‌క్తుల‌కు అందుబాటులో లేదు. దాదాపు రెండున్న‌ర నెల‌లుగా ఆల‌యానికి ద‌ర్శ‌నాలు నిలిపివేసిన విష‌యం తెలిసిందే. ప్ర‌స్తుతం ఆల‌యాల‌కు ఆంక్ష‌లు మిన‌హాయింపులు ఇవ్వ‌డంతో తిరిగి భ‌క్తుల‌కు అందుబాటులోకి రానుంది. తిరుమ‌ల‌లో వేంక‌టేశ్వ‌ర స్వామి ద‌ర్శ‌నం 11వ తేదీ నుంచి ఉంటుంద‌ని తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం ప్ర‌క‌టించింది. అయితే ద‌ర్శ‌న స‌మ‌యంలో పాటించాల్సిన జాగ్ర‌త్త‌లు, నియ‌మ‌నిబంధ‌న‌లు వంటి వాటిపై మార్గ‌ద‌ర్శ‌కాలు రూపొందించింది. తిరుమ‌ల‌లో వృద్ధులు, చిన్నారుల‌కు ప్ర‌వేశం లేద‌ని వెల్ల‌డించింది.

భ‌క్తుల‌కు ద‌ర్శ‌నం విష‌యంలో 8 - 9 - 10 తేదీల్లో మూడు రోజుల పాటు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు ట్రయల్ రన్‌ను నిర్వహించనున్నారు. టీటీడీ ఉద్యోగులు, వారి కుటుంబసభ్యులు, తిరుమల స్థానికులతో ఈ ట్రయల్ రన్‌ను నిర్వహిస్తారు. భక్తుల సంఖ్యను నిర్ధారించడానికి ట్రయల్ రన్ సందర్భంగా క్యూ కాంప్లెక్సులు, వసతి గదుల కేటాయింపులు, భౌతిక దూరం పాటించడం.. వంటి అంశాల్లో తలెత్తే లోటుపాట్లు గుర్తించి సరి చేసుకుంటారు. ఒకరోజులో ఎంత మందికి దర్శనాన్ని కల్పించాల‌నే విష‌య‌మై స్ప‌ష్ట‌త రానుంది. దీనికి గంట సమయాన్ని ప్రాతిపదికగా తీసుకోనున్నారు.

వైరస్ వ్యాప్తి క‌ట్ట‌డికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా ఒక గంటలో ఎంతమందికి దర్శనం కల్పించవ‌చ్చో అంచ‌నా వేసుకుని ఒక రోజులో పూర్తిస్థాయిలో భక్తుల సంఖ్యను అనుమ‌తించాల‌నే విష‌య‌మై నిర్ణ‌యం తీసుకోనున్నారు. అయితే ద‌ర్శ‌నాల‌ను కేవ‌లం ఆన్‌లైన్‌లో ద్వారా మాత్ర‌మే అనుమ‌తించే అవ‌కాశం ఉంది. దర్శనానికి అవసరమైన టికెట్లను బుక్ చేసుకున్న వారికి మాత్రమే కొండపైకి అనుమతి ఇస్తామని టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి స్పష్టం చేశారు. అయితే ఆన్‌లైన్‌లో టికెట్లను బుక్ చేసుకోవడం సాధ్యం కాని భక్తుల కోసం తిరుపతిలో ఓ రిజిస్ట్రేషన్ సెంటర్‌ను ఏర్పాటు చేస్తామని, అక్కడ టికెట్లను కొనుగోలు చేసుకోవచ్చని వివ‌రించారు.

అయితే తిరుమ‌ల‌కు వ‌చ్చేవారు ఏ రాష్ట్రం నుంచి వచ్చే భక్తులు ఆయా రాష్ట్ర ప్రభుత్వాల నుంచి తప్పనిసరిగా అనుమతిని తీసుకోవాల‌ని నిబంధ‌న విధించారు. అలాంటి వారికే మాత్ర‌మే అనుమ‌తి ఇస్తామ‌ని స్ప‌ష్టం చేస్తున్నారు. అయితే తిరుమ‌ల‌లో కేవ‌లం ద‌ర్శ‌నం మాత్ర‌మే అనుమ‌తిస్తున్న‌ట్లు మిగ‌తా కార్య‌క్ర‌మాలు ఉండ‌వ‌ని టీటీడీ నిర్ణ‌యించింది. ఈ సంద‌ర్భంగా కల్యాణకట్ట తాత్కాలికంగా మూసివేస్తున్న‌ట్లు తెలిపారు. పరిస్థితులు కుదుట పడిన తరువాతే పునరుద్ధరించ‌నున్నారు.

ద‌ర్శ‌నానికి వ‌చ్చిన భ‌క్తులు క్యూ లైన్లలో త‌ప్ప‌నిస‌రిగా భౌతిక దూరం పాటించాల‌ని టీటీడీ సూచిస్తోంది. ఈ క్ర‌మంలోనే వృద్ధులు - పిల్లలకు ప్ర‌వేశం లేద‌ని - 65 ఏళ్లు పైబ‌డిన వారు, పదేళ్ల లోపు పిల్లలకు దర్శనానికి అనుమతి ఇవ్వమని టీటీడీ చైర్మ‌న్ వైవీ సుబ్బారెడ్డి స్పష్టంచేశారు. దీనికి అనుగుణంగా ఆన్‌లైన్ టికెట్లను జారీ సాఫ్ట్‌వేర్‌లో మార్పులు చేసినట్లు తెలిపారు.