Begin typing your search above and press return to search.

పోటీకి ముందే చేతులెత్తేసిన టీడీపీ

By:  Tupaki Desk   |   3 March 2021 7:30 AM GMT
పోటీకి ముందే చేతులెత్తేసిన టీడీపీ
X
తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్లో నామినేషన్ల దశలోనే తెలుగుదేశంపార్టీ చేతులెత్తేసింది. కార్పొరేషన్లోని 50 డివిజన్లలో 24 డివిజన్లలో పార్టీ తరపున పోటీ చేయటానికి అసలు అభ్యర్ధులే లేరు. 11 డివిజన్లలో అసలు పార్టీ తరపున నామినేషన్లే వేయలేదు. ఇక మరో 13 డివిజన్లలో పార్టీ తరపున నామినేషన్లు వేసి బీఫారాలు కూడా అందించిన అభ్యర్ధులు తమ నామినేషన్లను ఉపసంహిరించుకుంటున్నట్లు ఇఫ్పటికే రిటర్నింగ్ అధికారులకు లెటర్లు ఇఛ్చేశారు.

టీడీపీ ఏ పరిస్దితుల్లో ఉందంటే రీ నామినేషన్లకు స్టేట్ ఎలక్షన్ కమీషన్ ఇచ్చిన అవకాశాన్ని కూడా పూర్తిగా సద్వినియోగం చేసుకోలేకపోయింది. తిరుపతి కార్పొరేషన్లో ఐదు డివిజన్లలో రీ నామినేషన్లు వేసేందుకు టీడీపీకి అవకాశం దక్కింది. అయితే ఇందులో మూడు చోట్ల మాత్రమే నామినేషన్లు వేసింది. మిగిలిన రెండు చోట్ల నామినేషన్లు వేయటానికి అభ్యర్ధులే దొరకలేదు. ఎంతమంది నేతలను సంప్రదించినా నామినేషన్లు వేయటానికి ఎవరూ ఆసక్తి చూపలేదు.

50 డివిజన్ల కార్పొరేషన్ లో మేయర్ పీఠం దక్కాలంటే ఏ పార్టీ అయినా 26 డివిజన్లలో గెలవాల్సిందే. అలాంటిది ఇపుడు టీడీపీ పోటీ చేస్తున్నదే 26 డివిజన్లలో. మరి వీటిల్లో ఎన్నింటిలో గెలుస్తుందంటే ఎవరు చెప్పలేకున్నారు. ఇలాంటి పరిస్దితుల్లో మేయర్ పీఠం తమదే అని టీడీపీ నేతలు చెప్పుకుంటున్నారంటేనే ఆశ్చర్యంగా ఉంది. అందరికీ తెలుసు మేయర్ పీఠం అందుకునేందుకు టీడీపీ ఆమడదూరంలో ఉందని.

జిల్లాలోని తిరుపతిలో మాత్రమే కాదు చిత్తూరు, పుంగనూరు, శ్రీకాళహస్తి, మదనపల్లి మున్సిపాలిటిల్లో కూడా దాదాపు ఇలాంటి పరిస్ధితులే కనబడుతున్నాయి. మొన్నటి పంచాయితి ఎన్నికల ఫలితాల ప్రభావం తాజా ఎన్నికలపై తీవ్రంగా పడినట్లుంది. దానికితోడు ఒకవేళ టీడీపీ తరపున గెలిచినా చేయగలిగేది ఏమీ లేదనే నిర్వేదం వల్ల కూడా పోటీ విషయంలో వెనకాడుతున్నారు. స్ధానిక ఎన్నికలంటేనే అధికారపార్టీకి అనుకూలంగా ఉంటుందన్న విషయం అందరికీ తెలిసిందే. తెలిసీ టీడీపీ కావాలనే వైసీపీని రెచ్చగొట్టి పీకలమీదకు తెచ్చుకుంది.