Begin typing your search above and press return to search.

తిరుప‌తిలో సీటు మాత్ర‌మే బీజేపీది... ఓట్లు వేసేవారుంటారా ?

By:  Tupaki Desk   |   15 March 2021 12:06 AM GMT
తిరుప‌తిలో సీటు మాత్ర‌మే బీజేపీది... ఓట్లు వేసేవారుంటారా ?
X
తిరుప‌తి పార్ల‌మెంటు స్థానానికి జ‌రుగుతున్న ఉప ఎన్నిక‌లో తామే పోటీ చేస్తామ‌ని.. త‌మ అభ్య‌ర్థే బ‌రిలోకి దిగుతార‌ని.. ప్ర‌చారం చేసి మ‌రీ ప‌ట్టుబ‌ట్టి ఇక్క‌డ పోటీకి దిగుతోంది బీజేపీ. వాస్త‌వానికి జ‌న‌సేన‌తో ఉన్న పొత్తు నేప‌థ్యంలో ఆ పార్టీ కూడా ఇక్క‌డ సీటు కోసం ఆది నుంచి ప‌ట్టుబ‌ట్టింది. అయితే.. చివ‌రి నిముషంలో ఏం జ‌రిగిందో.. ఢిల్లీ మంత్రాంగం ఫ‌లించి.. తిరుప‌తి సీటు ఇప్పుడు బీజేపీ ద‌ఖ‌లు ప‌డింది. ఇంత వ‌రకు రాష్ట్ర బీజేపీ సార‌థి.. సోము వీర్రాజు స‌క్సెస్ అయ్యార‌నే చెప్పాలి. ఆయ‌నే ఆది నుంచి కూడా ఇక్క‌డ ప‌ట్టుబ‌డుతున్నారు. ఇక్క‌డ ఎంపీని గెలిపించి.. మోడీకి కానుక‌గా ఇవ్వాల‌ని సోము అభిప్రాయ‌ప‌డుతున్న‌ట్టు తెలుస్తోంది.
ఇంత వ‌ర‌కు బాగానే ఉన్నా.. టికెట్ సంపాయించుకున్నా.. గెలుపు గుర్రం ఎక్క‌డం ఈజీయేనా ? తిరుప‌తి ప్ర‌జ‌ల నాడిని ప‌ట్టుకోవడం బీజేపీకి సాధ్య‌మ‌య్యే ప‌నేనా ? ఇదీ.. ఇప్పుడు బీజేపీ గురించి.. రాజ‌కీయ విశ్లేష‌కుల మ‌ధ్య జ‌రుగుతున్న ఆస‌క్తిక‌ర చ‌ర్చ. ప్ర‌స్తుతం రాష్ట్ర బీజేపీ నేత‌లు ఒకింత యాక్టివ్‌గానే ఉన్నారు. ముఖ్యంగా సీమ‌కు చెందిన విష్ణువ‌ర్ధ‌న్ రెడ్డి, తిరుప‌తికే చెందిన భాను ప్ర‌కాశ్ రెడ్డి వంటివారు దూకుడుగా ముందుకు సాగుతున్నారు. ఇక‌, తెలంగాణ నుంచి బండి సంజ‌య్ వంటి ఫైర్ బ్రాండ్ నాయ‌కులు కూడా రంగంలోకి దిగి .. ప్ర‌చారం చేప‌ట్టే అవ‌కాశం మెండుగా ఉంది. దీనిని ఎవ‌రూ కాద‌న‌లేరు. అయితే.. అనుకున్నంత ఈజీగా తిరుప‌తి ప్ర‌జ‌లు ఇప్పుడు బీజేపీ వైపు తొంగి చూసే ప‌రిస్థితి లేదు.

దీనికి కేంద్ర ప్ర‌భుత్వం అనుస‌రిస్తున్న వివాదాస్ప‌ద వైఖ‌రే కార‌ణంగా క‌నిపిస్తోంది. రాజ‌ధాని అమ‌రావ‌తి విష‌యంలో నిధులు ఇవ్వ‌కుండా వేధించింద‌నే అప‌వాదు.. కేంద్రంలోని మోడీ స‌ర్కారుపై బ‌లంగా ఉంది. అదే స‌మ‌యంలో ప్ర‌త్యేక హోదాను ఆయ‌న ప‌క్క‌న పెట్టేశారు. ఇది కూడా ఇక్క‌డి వారిని వేధిస్తోంది. ఇక‌, కీల‌క‌మైన అంత‌ర్జాతీయ‌ విమానాశ్ర‌యం ఏర్పాటు వంటివాటిలోనూ తిరుప‌తి వాసుల‌కు ద‌క్కింది ఏమీ లేదు. అయితే.. బీజేపీ నేత‌లు మాత్రం కేంద్రం ఇచ్చిన సొమ్ముతోనే ఇక్క‌డ అభివృద్ధి చేప‌ట్టార‌ని ప్ర‌చారం చేస్తున్నా.. వినేందుకు ఎవ‌రూ సిద్ధంగా లేక పోవ‌డం గ‌మ‌నార్హం. మ‌రో వైపు బ‌ల‌మైన వైసీపీ గాలులు త‌ట్టుకోవ‌డం మ‌రీ క‌ష్టంగా ఉంది. తాజా మునిసిప‌ల్ ఎన్నిక‌ల‌లో ఈ పార్ల‌మెంటు ప‌రిధిలోని అన్ని కార్పొరేష‌న్లు, మున్సిపాల్టీల్లో వైసీపీ గెలిస్తే.. జ‌న‌సేన‌, బీజేపీ క్యాండెట్ల‌కు డిపాజిట్లు రాలేదు.

ఈ నేప‌థ్యంలో బీజేపీ త‌మ అభ్య‌ర్థిని నిలిపిన‌ప్ప‌టికీ.. గెలుపు మాత్రం అంత ఈజీకాద‌ని.. అస‌లు అభ్య‌ర్థికి డిపాజిట్లు ద‌క్కితే బెట‌రేన‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. మ‌రి ఈ వ్య‌తిరేక‌త నుంచి బీజేపీ నేత‌లు ఎలా బ‌య‌ట ప‌డ‌తారో చూడాలి. ఇక‌, జ‌న‌సేనాని ప‌వ‌న్ కూడా ప్ర‌చారంవిష‌యంలో ఆచితూచి అడుగులు వేసే అవ‌కాశం ఉంది. రేపు బీజేపీ ఓడిపోతే.. త‌న ప్ర‌చారం ఫ‌లించ‌లేద‌నే అప‌వాదును ఆయ‌న ఎదుర్కొనాల్సి ఉంటుంది. ఇలా.. అనేక రూపాల్లో బీజేపీకి ఎదురుగాలులు వీస్తుండ‌డం గ‌మ‌నార్హం. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.