Begin typing your search above and press return to search.

తిరుపతి ఉప ఎన్నిక: బలంగా బీజేపీ.. టీడీపీకి నిధుల కొరత..?

By:  Tupaki Desk   |   30 March 2021 5:30 AM GMT
తిరుపతి ఉప ఎన్నిక: బలంగా బీజేపీ.. టీడీపీకి నిధుల కొరత..?
X
తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికకు సమయం దగ్గరపడడంతో ఇప్పుడు ఆర్థిక వనరుల అవసరం అన్ని పార్టీలకు ఏర్పడింది. అధికారంలో ఉండడంతో వైసీపీకి పెద్దగా నిధుల కొరత ఉండదన్నది అందరికీ తెలిసిన విషయమే. ఇక కేంద్రంలో అధికారంలో ఉండడం.. ఐఏఎస్ అధికారి రత్నప్రభ ఆర్థికంగానూ ఉండడంతో బీజేపీ కూడా ఖర్చుకు వెనుకాడడం లేదు. జనసేన తోడుగా ఉండడంతో ఆ పార్టీకి కలిసి వస్తోంది.

ఇక వైసీపీ, బీజేపీ-జనసేన కూటమిని ఎదుర్కోవాలంటే టీడీపీకి తలకుమించిన భారం అవుతోంది. ఆర్థిక వ్యయం విషయంలో టీడీపీ వెనుకంజలో ఉంటుందనే అభిప్రాయం చిత్తూరు జిల్లా రాజకీయాల్లో వ్యక్తమవుతోంది. ఉప ఎన్నిక ప్రచార ఖర్చును భరించడానికి పేరున్న నేతలు ఎవరూ పెద్దగా ఆసక్తి చూపట్లేదని అంటున్నారు.

టీడీపీకి బ్యాక్ బోన్ గా ఒకప్పుడు ఎంపీలు సుజనా చౌదరి, సీఎం రమేశ్, టీజీ వెంకటేశ్, నామా నాగేశ్వరరావు, మాజీ మంత్రి నారాయణ లాంటి వారు ఉండేవారు. కానీ వారంతా ఇప్పుడు వేరే పార్టీల్లోకి మారిపోయారు. ఎంపీలంతా బీజేపీలో, టీఆర్ఎస్ లో చేరిపోయారు.

ప్రస్తుతం బీజేపీకి వారంతా ఆర్థికంగా అండగా ఉన్నారు. ఎన్నికల్లో అవసరమైన ఖర్చును భరించడానికి వెనుకాడని ఆ నేతలందరూ బీజేపీలో చేరడంతో టీడీపీ కొత్తగా నిధుల కొరతను ఎదుర్కోంటోంది. తిరుపతి ఉప ఎన్నిక ఖర్చును భరించడానికి ఎవరూ ముందుకు రాని పరిస్థితి ఉందట.. ఇక తిరుపతికే చెందిన టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ ఆర్థికంగా ఆదుకోవడానికి ఆసక్తి చూపడం లేదని.. గుంటూరు నుంచి ఆయన ఎంపీగా ఉండడంతో చిత్తూరును పట్టించుకోవడం లేదట.. అలా తిరుపతి ఉప ఎన్నికల్లో టీడీపీ తరుఫున ఖర్చును భరించడానికి ఏ నేత ముందుకు రావడం లేదట.. ప్రతిపక్షంలో ఉండడంతో ఎవరూ చేతులు కాల్చుకోవడానికి సిద్ధంగా లేరట..