Begin typing your search above and press return to search.

గురుమూర్తి మెజారిటీపై భారీగా బెట్టింగులు .. మినిమం ఎంతంటే ?

By:  Tupaki Desk   |   30 March 2021 1:30 PM GMT
గురుమూర్తి మెజారిటీపై భారీగా బెట్టింగులు .. మినిమం ఎంతంటే ?
X
బెట్టింగులు .. గతంలో క్రికెట్ కి మాత్రమే పరిమితం అయ్యేది. కానీ, ఈ మధ్య కాలంలో అది రాజకీయాలకి కూడా పాకింది. 2019 లో ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో పలు నియోజకవర్గాల్లో ఆ అభ్యర్థికే మెజారిటీ వస్తుంది అంటూ భారీగా బెట్టింగులు జరిగాయి. కొన్ని సందర్భాల్లో విజయం పై బెట్టింగులు వేస్తుంటారు ..మరికొన్ని సందర్భాల్లో ఆ అభ్యర్థి కి వచ్చే మెజారిటీ ఓట్ల పై బెట్టింగులు పెడుతుంటారు. ఇక‌, ఇప్పుడు ఇదే త‌ర‌హాలో తిరుప‌తి ఉప ఎన్నిక‌లో వైసీపీ త‌ర‌ఫున పోటీ చేస్తున్న డాక్ట‌ర్ గురుమూర్తి మెజారిటీపై కూడా బెట్టింగుల ప‌ర్వం జోరందుకుంద‌ని కొందరు పరిశీలకులు అంటున్నారు. బెట్టింగ్ కట్టే వారిలో చాలామంది వైసీపీ అభిమానులే ఉన్నారట.

ప్ర‌స్తుతం తిరుప‌తిలోని ఏ ఒక్క హోట‌ల్ కూడా ఖాళీ లేదట. దాదాపు 50 మంది వ‌ర‌కు బెట్టింగు రాయుళ్ల త‌ర‌ఫున ప‌రిశీల‌కులు అక్క‌డ మ‌కాం వేసి, ఎన్నిక‌ల స‌ర‌ళిని ప‌రిశీలిస్తున్నారు. అసలు ఒక ఉప ఎన్నిక‌కు సంబంధించి ఇంత ఊపు ఎందుకు వ‌చ్చింది అంటే.. సీఎం జ‌గ‌న్ చేసిన ప్ర‌క‌ట‌నే కార‌ణ‌మ‌ని చెప్తున్నారు. ఈ మద్యే తిరుపతి ఉపఎన్నిక పై పార్టీ నేత‌ల‌తో భేటీ అయిన సీఎం జ‌గ‌న్ , తిరుపతిలో గెలుపు కాద‌ని, దేశం మొత్తం తిరుప‌తి వైపు చూసేలా తిరుప‌తి గురించి చ‌ర్చించుకునేలా చేయాల‌ని పార్టీ నాయ‌కుల‌కు దిశానిర్దేశం చేశారు. గ‌త ఎన్నిక‌ల్లో ఇక్క‌డ నుంచి గెలిచిన బ‌ల్లి దుర్గా ప్ర‌సాద‌రావు 2 ల‌క్ష‌ల పైచిలుకు ఓట్ల మెజారిటీతో విజ‌యం అందుకున్నారు. ఇక‌, ఇప్పుడు మాత్రం ఈ మెజారిటీ డ‌బుల్ కావాల‌నేది జ‌గ‌న్ వ్యూహంగానే ఉంది.

ఈ నేప‌థ్యంలో జ‌గ‌న్ దిశానిర్దేశం త‌ర్వాత‌, అనూహ్యంగా తిరుప‌తి పార్ల‌మెంటు పోరు పై బెట్టింగ్ రాయుళ్ల క‌న్నుప‌డింది. ఇక్క‌డ మెజారిటీ జ‌గ‌న్ కోరుకుంటున్న‌ట్టు 4 ల‌క్ష‌లు దాటుతుంద‌ని కొంద‌రు భావిస్తున్నారు. మ‌రికొంద‌రు 4 లక్షలు ఏకంగా 5 ల‌క్ష‌ల మెజారిటీ ఖాయ‌మ‌ని చర్చించుకుంటున్నారు. ఈ నేప‌థ్యంలోనే ఎవ‌రికి తోచిన‌ట్టు వారు బెట్టింగులు క‌డుతుండ‌డం గ‌మ‌నార్హం. అయితే చూడాలి మరి విజయం ఎవరిని వరిస్తుంది , ఎంత మెజారిటీ వస్తుందో. ఇదిలా ఉంటే .. తిరుపతి లోకసభ ఉప ఎన్నిక పై ప్రస్తుతం అన్ని పార్టీలు కూడా దృష్టి కేంద్రీకరించాయి. ప్రచారానికి తక్కువ సమయం ఉండటంతో అన్ని పార్టీలు కూడా ఊహకందని రీతిలో ప్రచారం చేస్తూ ఓటర్లని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇక ఈ ఉపఎన్నికల్లో వైసీపీ నుంచి గురుమూర్తి, పనబాక లక్ష్మి టీడీపీ నుంచి పోటీ చేస్తుండగా, బిజెపి – జనసేన ఉమ్మడి అభ్యర్థిగా రత్నప్రభ కాంగ్రెస్ నుంచి చింతా మోహన్ పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే.