Begin typing your search above and press return to search.

ఉపఎన్నికలో చేతులెత్తేసిన బీజేపీ - జనసేన

By:  Tupaki Desk   |   6 April 2021 3:47 AM GMT
ఉపఎన్నికలో చేతులెత్తేసిన బీజేపీ - జనసేన
X
అవును తిరుపతి లోక్ సభ ఉపఎన్నికలో పోలింగ్ కు ఇంకా చాలా రోజులుండగానే మిత్రపక్షాలు చేతులెత్తేశాయి. అర్జంటుగా తిరుపతి ఉపఎన్నిక ప్రక్రియను రద్దు చేయాలని బీజేపీ+జనసేన నేతలు కేంద్ర ఎన్నికల కమీషన్ను కలిసి విజ్ఞప్తి చేయటమే విచిత్రంగా ఉంది. ఎన్నికల పవిత్రతను కాపాడటానికి ఉపఎన్నికను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేయటమే ఆశ్చర్యంగా ఉంది.

ఇంతకీ ఉపఎన్నికను ఎందుకు రద్దుచేయాలంటే పరిషత్ ఎన్నికలు పూర్తియిన తర్వాత మళ్ళీ ఫ్రెష్ గా లోక్ సభ ఉపఎన్నికలకు నోటిఫికేషన్ ఇవ్వాలని సూచించారు. బీజేపీ రాజ్యసభ ఎంపిలు వైఎస్ చౌదరి- సీఎం రమేష్- జీవీఎల్ నరసింహారావు - ఇన్చార్జి సునీల్ దేవధర్+జనసేన అగ్రనేత నాదెండ్ల మనోహర్ అండ్ కో కేంద్ర ప్రధాన ఎన్నికల కమీషనర్ సునీల్ అరోరాను కలిసి విజ్ఞప్తి చేయటమే విచిత్రంగా ఉంది. లోక్ సభ ఉపఎన్నిక ముందు పరిషత్ ఎన్నికలు నిర్వహించటం ద్వారా స్టేట్ ఎలక్షన్ కమీషన్ అధికారపార్టీకి లాభం చేయాలని ప్రయత్నిస్తోందని వీరు ఆరోపించారు.

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే పరిషత్ ఎన్నికలకు నోటిఫికేషన్ వచ్చింది ఏప్రిల్ 1వ తేదీ. నోటిఫికేషన్ జారీ అవ్వగానే అభ్యంతరాలుంటే చెప్పాల్సిన నేతలు ఇన్ని రోజుల తర్వాత ఫిర్యాదు చేయటమే ఆశ్చర్యంగా ఉంది. రాష్ట్ర ఎన్నికల కమీషనర్ ప్రవర్తనా నియమావళి పేరుతో బీజేపీ+జనసేన నేతలను ఇబ్బందులకు గురిచేస్తున్నారట. ఏ విధంగా ఇబ్బందులు గురిచేస్తున్నారనే విషయాన్ని చెప్పలేదు.

ఇక్కడ అసలు విషయం ఏమిటంటే లోక్ సభ పరిధిలో బీజేపీ+జనసేన నేతలను పట్టించుకుంటున్న జనాలు లేరు. పోటీచేస్తున్న బీజేపీ అభ్యర్ధి రత్నప్రభకు అసలు డిపాజిట్ వస్తుందా అనే డౌటు అందరిలోను పెరిగిపోతోంది. తమను జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఏదో ఉద్ధరించేస్తాడన్నది కేవలం భ్రమలన్న విషయం కమలనాదులకే అర్ధమైపోయింది. దాంతో డిపాజిట్ కూడా తెచ్చుకోలేకపోతే పరువుపోతుందనే టెన్షన్ మొదలైపోయింది.

అన్నింటికీ మించి మొన్నటి ఎన్నికల్లో జనసేన ఉపయోగించిన ఎన్నికల గుర్తు గాజుగ్లాసు ఇఫుడు నవతరం పార్టీ అభ్యర్ధికి కేంద్ర ఎన్నికల కమీషన్ కేటాయించింది. అసలే అంతంత మాత్రంగా ఉన్న పార్టీ పరిస్ధితి ఎన్నికల గుర్తు కేటాయింపుతో మరింత గందరగోళంలో పడింది. నవతరం పార్టీకి కేటాయించిన గాజుగ్లాసు గుర్తును కేటాయించాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే సాంకేతికంగా అది సాధ్యం కాదని అర్ధమైపోయింది. అందుకనే ఏకమొత్తంగా ఉపఎన్నికనే రద్దు చేయాలనే కొత్త పల్లవి అందుకున్నారు. మిత్రపక్షాల తాజా డిమాండ్ తో ఎన్నికల్లో చేతులెత్తేసిన విషయం అర్ధమైపోయింది.