Begin typing your search above and press return to search.

జాతీయ నేత‌లా? జాతీయ హామీలా? బీజేపీని వెంటాడుతున్న‌వి ఇవే!?

By:  Tupaki Desk   |   7 April 2021 3:06 AM GMT
జాతీయ నేత‌లా?  జాతీయ హామీలా?  బీజేపీని వెంటాడుతున్న‌వి ఇవే!?
X
తిరుప‌తి పార్ల‌మెంటు ఉప ఎన్నిక‌లో గెలిచి తీరాల‌ని ప‌ట్టుద‌ల‌తో ఉన్న బీజేపీ నాయ‌కులు.. మ‌రో ప‌ది రోజుల్లో ముగియ‌నున్న ఎన్నికల ప్ర‌చారాన్ని ప‌రుగులు పెట్టించాల‌ని నిర్ణ‌యించారు. ఈ క్ర‌మంలో స్థానిక నేత‌ల‌తోపాటు.. జాతీయ‌స్థాయి నుంచి కూడా నేత‌ల‌ను ఇక్క‌డ‌కు తీసుకువ‌చ్చి.. తిరుప‌తి ఓటర్ల‌ను ఆకర్షించాల‌ని ఇప్ప‌టికే నిర్ణ‌యించారు. ఈ నేప‌థ్యంలో కేంద్రంలో చ‌క్రం తిప్పుతున్న‌వారితోపాటు.. బీజేపీకి గ‌ట్టి వాయిస్‌గా ఉన్న ఉత్త‌ర‌ప్ర‌దేశ్ సీఎం.. యోగి ఆదిత్య‌నాథ్ వంటివారిని కూడా తిరుప‌తిలో ప్ర‌చారానికి దింపుతున్నారు. స్థానిక నేత‌ల‌కు దీనిపై ఇప్ప‌టికే ప‌క్కా స‌మాచారం అందింది. దీంతో ఇక్క‌డి వారు.. ఆయా నేత‌ల‌కు సంబంధించి ప్రొగ్రామ్‌ను కూడా రెడీ చేస్తున్నారు.

బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు జేపీ న‌డ్డా తిరుప‌తికి ఈ రోజో రేపో వ‌స్తార‌ని స‌మాచారం. ఇక‌, యూపీ సీఎం యోగి కూడా ఎన్నిక ‌ల‌కు మూడు రోజుల ముందు వ‌చ్చి.. ఇక్క‌డ ప్ర‌చారం చేస్తార‌ని తెలిసింది. అదే స‌మ‌యంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా కూడా ఇక్క‌డ ప్ర‌చారం చేసేందుకు వ‌స్తార‌ని ప్ర‌చారం సాగుతున్నా.. బిజీ షెడ్యూల్ కార‌ణంగా.. ఆయ‌న ప‌ర్య‌ట‌న ఉండ‌క‌పోవ‌చ్చ‌ని టాక్‌.. అయితే.. ఆయ‌న బ‌దులు మ‌రో ఇద్ద‌రు కేంద్ర మంత్రులు వ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తోంది. ఇలా మొత్తానికి తిరుప‌తి బైపోల్‌ను సీరియ‌స్‌గా తీసుకున్న బీజేపీ.. జాతీయ‌స్థాయి నేత‌ల‌ను ఇక్క‌డ‌కు ఇంపోర్టు చేసి.. ప్ర‌చార ప‌ర్వాన్ని వేడెక్కించాల‌ని నిర్ణ‌యించుకుంది. ఇంత‌వ‌ర‌కు బాగానే ఉన్నా.. అస‌లు విష‌యం ఇప్పుడే మొద‌లైంది.

జాతీయ నేత‌లు కాదు.. జాతీయ స్థాయిలో ఏపీకి ఇచ్చిన హామీలు నెర‌వేరిస్తే.. చాల‌ని.. సోష‌ల్ మీడియాలో పెద్ద ఎత్తున వైర‌ల్ అవుతున్న కామెంట్లు. వారు వీరు అని తేడా లేకుండా అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌లు, యువ‌కులు, మ‌హిళ‌లు, పురుషులు.. ప్రాంతాల‌కు అతీతంగా ఇదే నినాదం అందుకున్నారు. ``జాతీయ నేత‌లు వ‌చ్చి ఏం చేస్తారు? జ‌గ‌న్‌ను తిడ‌తారు. లేదా అది చేశాం.. ఇది చేశాం.. అని చెబుతారు. ఇక్క‌డి నేత‌లు చెప్పేదే చెబుతారు. ఇంక వ‌చ్చి ఏం లాభం. జాతీయ నేత‌లు కాదు.. ఇప్పుడున్న ఏపీకి.. ఆర్థికంగా ఇబ్బందులు ప‌డుతున్న రాష్ట్రానికి, హోదాలేని రాష్ట్రానికి జాతీయ స్థాయిలో గ‌తంలో ఇచ్చిన హామీల‌ను నెర‌వేరిస్తే.. చాలు`` అని సోష‌ల్ మీడియాలో బీజేపీని ఉద్దేశించి కామెంట్లు దుమ్మురేపుతున్నాయి. అయితే.. బీజేపీ నేత‌లు ఈ కామెంట్ల‌ను వైసీపీ, టీడీపీలు చేయిస్తున్నాయ‌ని.. వ్య‌తిరేక ప్ర‌చారం ప్రారంభించారు. ఈ ప‌రిణామాల‌ను గ‌మ‌నిస్తున్న విశ్లేష‌కులు.. వాస్త‌వాల‌కు దూరంగా విన్యాసం చేసినంత కాలం.. బీజేపీని ర‌క్షించేవారు ఎవ‌రూ లేర‌ని అంటుండ‌డం గ‌మ‌నార్హం.