Begin typing your search above and press return to search.

తిరుపతి బై పోల్ : జనసేన కి శుభవార్త..ఆ గుర్తు వెనక్కి తీసుకున్న ఈసీ !

By:  Tupaki Desk   |   7 April 2021 5:50 AM GMT
తిరుపతి బై పోల్ : జనసేన కి శుభవార్త..ఆ గుర్తు వెనక్కి తీసుకున్న ఈసీ !
X
ప్రస్తుతం ఏపీలో ఎక్కడ చూసినా కూడా తిరుపతి బై పోల్ గురించే చర్చ. ఈ ఎన్నికల్లో అన్ని పార్టీలు కూడా సత్తా చాటాలని చుస్తూండటం తో తిరుపతిలో హైటెంక్షన్ నెలకొంది. బీజేపీ జనసేన ఓ వైపు విజయం మాదే అంటూ ప్రచారం చేసుకుంటున్నారు. మరోవైపు ప్రజా బలం మాకే ఉందని అధికార పక్షం వైసీపీ గెలుపు పై ధీమా వ్యక్తం చేస్తుంది. ఇక టీడీపీ కూడా తిరుపతి లో విజయం సాధించి , మళ్లీ తిరిగి ఫామ్ లోకి రావాలని చూస్తుంది. ఇదిలా ఉంటే ,... ఈ ఉప ఎన్నికల సమయంలో జనసేన కి ఈసీ ఊరటనిచ్చింది. జనసేన ఊరట కలిగించడం కోసం బీజేపీ పెద్దలు కూడా తీవ్రంగానే శ్రమించారు. ఎట్టకేలకి అనుకున్నది సాధించడంతో ప్రస్తుతం బీజేపీ , జనసేన శ్రేణులు కలిసి తిరుపతి విజయం కోసం వ్యూహాలు అమలు చేస్తున్నారు.

అసలేమైంది అంటే...జనసేన పార్టీకి గతంలోనే గాజు గ్లాస్ గుర్తును కేటాయించింది కేంద్ర ఎన్నికల సంఘం. అయితే ప్రస్తుతం తిరుపతి ఉప ఎన్నికలో జనసేన నేరుగా బరిలో దిగడం లేదు. మిత్ర పక్షం బీజేపీ అభ్యర్థికి మద్దతు తెలిపింది. జనసేన బరిలో లేకపోవడంతో గాజు గ్లాసు గుర్తును నవతరం అనే పార్టీకి కేటాయించింది ఎన్నికల సంఘం. దీనితో వివాదం మొదలైంది. రాష్ట్రంలో అధికార పార్టీనే ఈ కుట్ర చేసిందని.. తిరుపతి ఉప ఎన్నికలో ఓటమి భయంతో, జనసేన గుర్తును వేరే వారికి కేటాయించింది అంటూ ఇటు బీజేపీ, అటు జనసేన నేతలు, కార్యకర్తలు మండిపడ్డారు. కేవలం విమర్శలతోనే సరిపెట్టుకోకుండా పోరాటం చేసింది బీజేపీ. ఇటీవల కేంద్ర ఎన్నికల సంఘాన్ని బీజేపీ- జనసేన నేతల ప్రతినిధి బృందం కలిసింది. నవతరం పార్టీకి గాజు గ్లాసు గుర్తు కేటాయించడంపై బీజేపీ, జనసేన నేతలు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశారు. గతంలో జనసేన పార్టీకి గాజు గ్లాసు గుర్తును కేటాయించిన సంగతి గుర్తు చేశారు.

అలాగే తిరుపతి ఉప ఎన్నికలో బీజేపీ, జనసేన ఉమ్మడి అభ్యర్థి బరిలో ఉన్నప్పుడు జనసేన గుర్తును వేరే పార్టీకి కేటాయించడంపై అభ్యంతరాలు వ్యక్తం చేశారు. బీజేపీ, జనసేన ఫిర్యాదును స్వీకరించిన కేంద్ర ఎన్నికల సంఘం వెంటనే దీనిపై చర్య తీసుకుంది. నవతరం పార్టీ అభ్యర్థికి కేటాయించిన గాజు గ్లాసు గుర్తును వెంటనే రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో ఇటు బీజేపీ అటు జనసేన నేతలు, అభిమానులు తమ వాదనే నెగ్గింది. అయితే , ఎన్నికలకు ఇప్పుడు పెద్దగా సమయం లేదు. ఇప్పటికే నవతరం పార్టీ అభ్యర్థి తన గాజు గ్లాసు గుర్తుపై ఓటు వేయాలని ప్రచారం కూడా నిర్వహించారు. దీంతో అతడు కూడా ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించే అవకాశం లేకపోలేదు. ఇప్పటికైతే జనసేన , బీజేపీ కి కొంతమేర ఊరట లభించినట్టే.