Begin typing your search above and press return to search.

పసుపు బోర్డు హామీ లాంటిదేనా సోము వీర్రాజు

By:  Tupaki Desk   |   12 April 2021 4:36 AM GMT
పసుపు బోర్డు హామీ లాంటిదేనా సోము వీర్రాజు
X
బీజేపీ - జనసేన పడుతున్న అవస్థలు అన్ని ఇన్ని కావు. హామీలు ఇవ్వటమే తప్పించి అమలు చేసే చరిత్ర లేని బీజేపీ.. తాజా ఉప ఎన్నికల్లో విజయం సాధిస్తే.. తామేం చేస్తామన్న చిట్టాను ఎన్నికల మేనిఫెస్టో పేరుతో సిద్ధం చేయటం ఆసక్తికరంగా మారింది. ఎన్నికల్లో విజయం కోసం ఆ పార్టీ ఎంతలా తహతహలాడుతుందన్నది ఈ మేనిఫెస్టోను చూస్తే అర్థమవుతుంది.

తెలంగాణలోని నిజామాబాద్ ఎంపీ స్థానంలో తాము విజయం సాధిస్తే వారంలో పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామని చెప్పటం.. అందుకు తగ్గట్లే అక్కడ గెలిచిన బీజేపీ.. రెండేళ్లు గడుస్తున్న పసుపు బోర్డు రావటం తర్వాత.. భవిష్యత్తులో కూడా రావటం సాధ్యం కాదని కేంద్రం తేల్చేసింది. అంతదాకా ఎందుకు.. ఇదే తిరుపతిలో 2014 సార్వత్రిక ఎన్నికల ప్రచారానికి వచ్చిన నాటి ప్రధాని అభ్యర్థి మోడీ స్వయంగా ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి.. తర్వాత తూచ్ ఎలా అన్నది అందరికి తెలిసిందే.

అలాంటి ఘన చరిత్ర ఉన్న బీజేపీ.. తాజాగా మాత్రం తిరుపతిలో గెలిస్తే.. తిరుమల శ్రీవారి ఆలయ పవిత్రతను పరిరక్షించేలా చేస్తామన్న హామీతో పాటు.. ఏపీ వ్యాప్తంగా ప్రభుత్వ అధీనం నుంచి దేవాలయాల్ని తొలగిస్తామని పేర్కొన్నారు. తిరుపతి లోక్ సభ నియోజకవర్గ పరిధిలో మెగా ఇన్వెస్ట్ మెంట్ టెక్స్ టైల్ పార్కును ఏర్పాటు చేస్తామని చెప్పారు.

ఇవి సరిపోవన్నట్లుగా రూ.48 కోట్ల కేంద్ర నిధులతో తిరుపతి నియోజకవర్గంలో భక్త కన్నప్ప పాఠశాలలు.. ప్రతి ఇంటికి తాగునీటి సరఫరా చేసేలా జలమే జీవనం పథకం.. కిసాన్ క్రెడిట్ కార్డుల ద్వారా రుణాలు.. పులికాట్ సరస్సులో మత్స్యకారుల సంక్షేం కోసం ఆంధ్రా - తమిళనాడు మధ్య సరిహద్దుల రీ సర్వే.. పూడికతీత పనులు లాంటి చిట్టాను చేర్చారు. మరి.. బీజేపీ ఇస్తున్న హామీలకు తిరుపతి ఓటర్లు ఎంతమేర నమ్ముతారో చూడాలి.