Begin typing your search above and press return to search.

తిరుపతి ఫలితమే సోమువీర్రాజు భవిష్యత్ ను నిర్ధేశిస్తుందా?

By:  Tupaki Desk   |   14 April 2021 6:31 AM GMT
తిరుపతి ఫలితమే సోమువీర్రాజు భవిష్యత్ ను నిర్ధేశిస్తుందా?
X
తెలంగాణలో బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ నిరూపించుకున్నారు. దుబ్బాక, జీహెచ్ఎంసీలో బీజేపీని గెలిపించి సత్తా చాటాడు. బండి సంజయ్ తోపాటు ఏపీలో అధ్యక్ష పీఠం దక్కించుకున్న సోము వీర్రాజుకు ఇప్పుడు టైం వచ్చింది. తిరుపతి ఎంపీస్థానానికి జరుగుతున్న ఉప ఎన్నికల్లో ఆయన ఏం మేరకు సత్తా చాటుతాడనే దానిపైనే ఆయన భవితవ్యం ఆధారపడి ఉంది.

ఇప్పుడు రాష్ట్ర బీజేపీ మెడకు కత్తి వేలాడుతోంది. ఈ ఎన్నికలో సత్తా చాటకపోతే సోము వీర్రాజు అండ్ టీంకు భవిష్యత్తులో అందలం దక్కేది అనుమానమే. గతంతో పోలిస్తే ఏపీలో బూత్ స్థాయి వరకు కమిటీలు వేసి ఓటు బ్యాంకును పెంచడంలో సోము వీర్రాజు సక్సెస్ అయ్యాయి. అయితే కేంద్రంలోని బీజేపీ తీసుకున్న నిర్ణయాలు, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ, ప్రత్యేక హోదా ఇవ్వకపోవడం వంటి విషయాలు ఏపీ ప్రజల దృష్టిలో బీజేపీని విలన్ ను చేశాయి.

ఏపీ బీజేపీలోని దిగ్గజ నేతలంతా ఇప్పుడు రాజ్యాంగ పదువులకు పోవడంతో సోము వీర్రాజు లాంటి కొత్త నేతలు బీజేపీని ఏపీలో లీడ్ చేస్తున్నారు. ఒక సామాజికవర్గాన్ని గంపగుత్తగా ఓన్ చేసుకున్నారు. ఆ ఓటు బ్యాంకును సమీకరించే దిశగా ప్రయత్నాలు చేస్తున్నారు.

జాతీయ భావాలు, హిందుత్వ పేరుతో వెళుతున్న బీజేపీకి ఏపీలో అంత సానుకూల వాతావరణం.. ఆ సెంటిమెంట్ కనిపించడం లేదు. ఇప్పుడు సోము వీర్రాజుకు ఏపీలోని కేంద్రం నిర్ణయాలే శరాఘాతంగా మారాయి. ఓటు బ్యాంకును పెంచుకోవడం తప్పితే.. ఉన్న ఓటు బ్యాంకు కూడా కేంద్రం నిర్ణయాలతో గల్లంతవుతోంది.

2019 అసెంబ్లీ ఎన్నికల్లో 4.2 శాతంగా ఉన్న బీజేపీ ఓటు బ్యాంకు.. పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో మరింత దిగజారింది.ఇప్పుడు బీజేపీకి కనీసం తిరుపతిలో డిపాజిట్ వస్తుందా? లేదా అన్నది కూడా అనుమానంగా ఉందని రాజకీయవిశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

మొన్నటివరకు టీడీపీని తొక్కేసి రెండోస్థానానికి చేరుకుంటామని అన్న బీజేపీ ఇప్పుడు పరువు కాపాడుకుంటుందా? అన్న చర్చ తిరుపతిలో సాగుతోంది. సోము వీర్రాజు ఏపీ బీజేపీ అధ్యక్షుడయ్యాక జరుగుతున్న తొలి ఎన్నికలు కావడంతో ఇది ఆయనకు ఇజ్జత్ కా సవాల్ గా మారింది. మరి ఆయన నిలబడుతాడా? ప్రతిపక్షాలతో కలబడుతాడా? సత్తా చాటుతాడా? అన్నది వేచిచూడాలని అంటున్నారు విశ్లేషకులు.