Begin typing your search above and press return to search.

వైసీపీని తిరుపతి ఇపుడైనా ఆదుకుంటుందా ?

By:  Tupaki Desk   |   17 April 2021 11:30 AM GMT
వైసీపీని తిరుపతి ఇపుడైనా ఆదుకుంటుందా ?
X
తిరుపతి లోక్ సభ ఉపఎన్నికలో అందరి దృష్టి తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గంపైనే ఉంది. ఎందుకంటే పోయిన ఎన్నికల్లో పార్లమెంటు పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఒక్క తిరుపతిలో మాత్రమే వైసీపీకి మైనస్ ఓట్లుపడ్డాయి. నియోజకవర్గ పరిధిలోని శ్రీకాళహస్తి, సూళ్ళూరుపేట, సర్వేపల్లి, వెంకటగిరి, గూడూరు, సత్యేవేడు నియోజకవర్గాల్లో వైసీపీకి మెజారిటి వచ్చింది. వీటిల్లో కూడా గూడూరు, శ్రీకాళహస్తి, సూళ్ళూరుపేట, వెంకటగిరి, సత్యవేడులో వైసీపీకి బంపర్ మెజారిటి వచ్చింది.

సర్వేపల్లిలో 15,926 మెజారిటి మాత్రమే వచ్చింది. అయితే తిరుపతిలో మాత్రం టీడీపీకి 3578 ఓట్ల మెజారిటి వచ్చింది. మళ్ళీ ఇదే నియోజకవర్గంలో వైసీపీ ఎంఎల్ఏగా భూమన కరుణాకరరెడ్డి సుమారు 700 ఓట్ల మెజారిటితో గెలిచారు. అంటే ఎంఎల్ఏ అభ్యర్ధికి మెజారిటి వచ్చినా ఎంపి అభ్యర్ధికి మాత్రం సుమారు 3 వేల ఓట్లు మైనస్ అవటం గమనార్హం. దీంతోనే అర్ధమైపోతోంది వైసీపీ నుండి టీడీపీకి క్రాస్ ఓటింగ్ జరిగిందని.

నిజానికి మొన్న భూమన గెలిచిందే చాలా అదృష్టంమీద గెలిచారు. ఇంతలోనే మళ్ళీ పార్లమెంటు ఉపఎన్నికలు రావటంతో ఇపుడేమి జరుగుతుందనే ఎవరికీ అర్ధం కావటంలేదు. అయితే మొన్ననే జరిగిన మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలో వైసీపీ దాదాపు క్లీన్ స్వీప్ చేసేసింది. అదే ఊపుగనుక కంటిన్యు చేయగలిగితే ఈసారి మంచి మెజారిటి వచ్చే అవకాశం ఉంది.

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే భూమన అంటే ఇష్టంలేని వాళ్ళు చాలామంది అసెంబ్లీతో పాటు పార్లమెంటుకు కూడా టీడీపీకే ఓట్లేశారు. కాకపోతే చివరి నిముషంలో ఎలాగో భూమన బయటపడిపోయారు. భూమన అంటే పలానా అని చెప్పలేని వ్యతిరేకత జనాల్లో ఉన్నది వాస్తవం. ఈ విషయం గ్రహించే భూమన కూడా తనకన్నా తన కొడుకు అభినయ్ రెడ్డినే ఎక్కువగా ప్రొజెక్టు చేస్తున్నారు. ఒక విధంగా చెప్పాలంటే భూమన పేరుకుమాత్రమే ఎంఎల్ఏ. మొత్తం వ్యవహారాలను కొడుకు అభినయే చూసుకుంటున్నాడు.

అందుకనే ఎలాగైనా నియోజకవర్గంలో మెజారిటి సాధించి జగన్మోహన్ రెడ్డి దగ్గర శెభాష్ అనిపించుకోవాలని అభినయ్ బాగా కష్టపడుతున్నాడు. మరి అభినయ్ కష్టానికి ప్రతిఫలంగా మంచి మెజారిటి వస్తే మంచిదే. లేకపోతే మాత్రం జగన్ దృష్టిలో తండ్రి, కొడుకులకు మైనస్ తప్పదు. ఈ విషయం తెలుసుకాబట్టే ఇపుడందరి కళ్ళు తిరుపతి అసెంబ్లీ మీదే ఉంది. చూద్దాం చివరకు ఏమి జరుగుతుందో.