Begin typing your search above and press return to search.

షాకింగ్ విషయాల్ని చెప్పిన చింతా.. తిరుపతి ఉప ఎన్నికల్లో అలా జరిగిందట

By:  Tupaki Desk   |   27 April 2021 4:30 AM GMT
షాకింగ్ విషయాల్ని చెప్పిన చింతా.. తిరుపతి ఉప ఎన్నికల్లో అలా జరిగిందట
X
ఇటీవల జరిగిన తిరుపతి ఉప ఎన్నికపై సంచలన వ్యాఖ్యలు చేశారు కాంగ్రెస్ అభ్యర్థి కమ్ సీనియర్ నేత చింతామోహన్. పలుమార్లు తిరుపతి ఎంపీ స్థానానికి ప్రాతినిధ్యం వహించిన ఆయన.. తిరుగులేని నేతగా గుర్తింపు పొందారు. అలాంటి ఆయన తాజాగా జరిగిన ఎన్నికల్లో డిపాజిట్ వస్తుందా? అన్నది ప్రశ్నగా మారింది. ఒకప్పుడు అంత బలమైన నేత.. ఇప్పుడింత బలహీనంగా మారటానికి కారణం ఆయన ప్రాతినిధ్యం ఉన్న పార్టీ ఒక కారణమని చెప్పాలి.

ఇదిలా ఉంటే.. ఇటీవల జరిగిన తిరుపతి ఉప ఎన్నిక పోలింగ్ లో భారీ ఎత్తున మోసాలు జరిగాయని ఆయన మండిపడుతున్నారు. వ్యూహాత్మకంగా దొంగ ఓటరు కార్డుల్ని క్రియేట్ చేయటమే కాదు పోలింగ్ మొత్తం అక్రమాల మయంగా మారిందని చెప్పారు. పోలింగ్ రోజున ఉదయం ఏడు గంటల నుంచి రాత్రి ఏడు గంటల వరకు ప్రతి బూత్ లోనూ 300 - 400 వరకు దొంగ ఓట్లు వేసుకున్నారన్నారు.

తిరుపతి పట్టణంలోనే దాదాపు 70 వేల దొంగ ఓట్లు పడ్డాయని ఆరోపించారు. అదే సమయంలో శ్రీకాళహస్తి.. గూడూరు.. సూళ్లూరుపేటలో 50వేల చొప్పున దొంగ ఓట్లు వేశారని.. ఎన్నికకు ఒక రోజు ముందు రాత్రి పోలింగ్ అధికారికి రూ.20వేలు.. కానిస్టేబుల్ కు రూ.10వేలు.. ప్రతి వాలంటీర్ కు ముక్కుపుడక లేదంటే రూ.5వేలు ఇచ్చినట్లుగా తీవ్ర ఆరోపణలు చేశారు.

ఏపీలో ఐఏఎస్.. ఐపీఎస్ అధికారులు నిద్రపోతున్నారని.. అధికారపక్ష నేతల తీరుపై జాతీయ నేతల ముందు పెడతానని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్ర ఎన్నికల కమిషన్ విధివిధానాల్ని మారుస్తామని.. పదవీ విరమణ చేసిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని ఎన్నికల కమిషనర్ గా నియమిస్తామని చెప్పారు. 2019లో జరిగి ఎన్నికల్లో వైసీపీకి 151 సీట్లు.. 22 ఎంపీ స్థానాలు రావటం వెనుక ఎలక్టోరల్ మోసాలు జరిగినట్లుగా ఆరోపించారు. 2019 లోక్ సభ ఎన్నికల్లో మోడీకి 303 లోక్ సభ సీట్లు రావటం కూడా మోసమేనని ఆయన మండిపడ్డారు. సంచలనంగా మారిన చింతా మోహన్ వ్యాఖ్యలపై వైసీపీ నేతలు ఎలా రియాక్టు అవుతారన్నది ప్రశ్నగా మారింది.