Begin typing your search above and press return to search.

‘చింత’ చచ్చినా... పులుపు చావట్లేదే!

By:  Tupaki Desk   |   11 Sep 2019 1:30 AM GMT
‘చింత’ చచ్చినా... పులుపు చావట్లేదే!
X
చింతా మోహన్... ఇప్పటి తరానికి పెద్దగా తెలియని నేతే గానీ... కాస్తంత వెనక్కు వెళితే... కాంగ్రెస్ పార్టీలో ఓ వెలుగు వెలిగిన నేతే. టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు సొంత జిల్లా చిత్తూరులోని ప్రముఖ పుణ్యక్షేత్రం, తిరుమల వెంకన్న పాదాల చెంత ఉన్న తిరుపతి కేంద్రంగా రాజకీయాలు నడిపిన చింతా... తిరుపతి పార్లమెంటు నియోజకవర్గం నుంచి ఏకంగా ఆరు పర్యాయాలు లోక్ సభకు ఎన్నికైన నేతగా ఘన చరిత్ర కలిగిన నేతే. అయితే కాలం మారింది కదా. కాంగ్రెస్ పార్టీ పరిస్థితి లాగే చింతా మోహన్ పరిస్థితి కూడా ఇప్పుడు ఎందుకూ కొరగాకుండా పోయింది. అయితేనేం... కాంగ్రెస్ పార్టీ నేతగా - మాజీ ఎంపీ హోదాలో ఇటీవల పదే పదే మీడియా ముందుకు వస్తున్న చింతా... తనదైన శైలి వ్యాఖ్యలు చేస్తూ లైమ్ లైట్ లోనే ఉండేందుకు యత్నిస్తున్నారు.

తాను నిత్యం జనం నోళ్లలో నానేందుకు యత్నించడంలో తప్పు లేదు గానీ... ఇప్పటి ఆధునిక యుగంలో ఇంకా మూఢ నమ్మకాలను నమ్మే వ్యక్తిగా - అవే భావనలను జనంలో నూరిపోసేలా మాట్లాడటం ద్వారా జనం నోళ్లలో నానేందుకు యత్నించడం మాత్రం కరెక్ట్ కాదన్న మాట అయితే వినిపిప్తోంది. అయినా ఇప్పుడు చింతా మోహన్ ఏం చేశారని ఆయనపై అంత అభాండాలు వేస్తున్నారంటారా? అయితే నవ్యాంధ్ర నూతన రాజదాని అమరావతిని రాజకీయ నేతల జయాపజయాలపై ఆయన చేసిన కామెంట్లను మనం వినాల్సిందే.

ఏపీ రాజధానిని అమరావతి నుంచి తరలిస్తున్నారంటూ ప్రస్తుతం జరుగుతున్న ప్రచారంలోకి తాను కూడా దిగేసిన చింతా... మంగళవారం సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ దిశగా ఆయన ఏమన్నారంటే... రాజధాని అమరావతిలోని తుళ్లూరు శాపగ్రస్త ప్రాంతమని ఆయన అన్నారు. అది దళితుల రక్తంతో తడిసిన ప్రాంతమని కూడా చింతా తేల్చేశారు. చంద్రబాబు ఓటమికి రాజధాని అమరావతే కారణమని - రాజధానిగా అమరావతి ఉన్నంతవరకు జగన్ కూడా సక్సెస్ కాలేరని చింతా అభిప్రాయపడ్డారు. తుళ్లూరు ప్రాంతంలో రాజధాని నిర్మించే ప్రయత్నం చేయడం వల్లే చంద్రబాబు జారిపడ్డారని, అదే సమయంలో జగన్ కు కూడా పెద్దగా కలిసిరాకపోవచ్చని ఆయన ఓ బాంబు పేల్చారు. ఏపీ రాజధానిగా తిరుపతి అన్ని విధాలా సరైన ప్రాంతం అని స్పష్టం చేశారు. మరి ఈ మాటలు వింటుంటే చింత చచ్చినా పులుపు చావలేదని చెప్పక తప్పదు కదా.