Begin typing your search above and press return to search.

తిరుమల చరిత్రలో రికార్డుస్థాయి హుండీ ఆదాయం!

By:  Tupaki Desk   |   5 July 2022 9:43 AM GMT
తిరుమల చరిత్రలో రికార్డుస్థాయి హుండీ ఆదాయం!
X
ఏదైనా ఒక క్షేత్రానికి వెళ్లి వద్దాం అనుకునేవారికి ముందుగా గుర్తుకు వచ్చేది 'తిరుమల'నే. శ్రీనివాసుడుగా వైకుంఠం నుంచి స్వామివారు దిగినచ్చిన క్షేత్రం ఇది.ఈ ప్రాంతమంతా వైకుంఠం నుంచి తరలివచ్చిందే అనేది ఆధ్యాత్మిక గ్రంథాలు చెబుతున్న మాట. గిరి .. శిఖర .. శిలాతోరణాల సన్నిధిలో స్వామివారు ఇక్కడ ఆ ఆవిర్భవించారు. ఇక్కడ ఎన్నో పుణ్య తీర్థాలు దర్శనమిస్తాయి. ప్రతి తీర్థం వెనుక ఒక ప్రత్యేకత .. విశిష్టత కనిపిస్తాయి. ఇంద్రాది దేవతలు స్వామివారిని సేవిస్తూ ఉంటారనేది పురాణాలు చెబుతున్న మాట. సాలిగ్రామ మాయమైన ఈ కొండపై అడుగు పెట్టడంతోనే కష్టాలన్నీ కొవ్వొత్తిలా కరిగిపోతాయనేది మహర్షుల మాట.

కొండపై స్వామివారు .. కొండక్రింద అమ్మవారు భక్తులను అనుగ్రహిస్తూ ఉంటారు. ఆ స్వామి దర్శనం చేసుకోవడానికిగాను భక్తులు వివిధ ప్రాంతాల నుంచి తిరుమల చేరుకుంటూ ఉంటారు. తిరుమల శ్రీనివాసుడికి ఆపద మొక్కులవాడని పేరు.

ఆపదలో ఉన్నప్పుడు మొక్కుకుంటే గట్టెక్కిస్తాడు .. ఆ తరువాత ఆ విషయాన్ని మరిచిపోతే వడ్డీతో సహా వసూలు చేస్తాడు. అందువలన ఆయనను వడ్డికాసులవాడు అని కూడా పిలుచుకుంటూ ఉంటారు. భక్తులు తమ మొక్కులు హుండీ ద్వారా స్వామివారికి సమర్పించుకుంటూ ఉంటారు.

అలా సాధారణ రోజుల్లో స్వామివారి హుండీ ఆదాయం 3 కోట్లకి పైగా ఉంటుంది. విశేషమైన పర్వదినాల్లో 4 కోట్లకి పైగా వస్తుంటాయి. కానీ సోమవారం రోజున స్వామివారికి హుండీ రూపేణా వచ్చిన ఆదాయం 6.18 కోట్లు.

స్వామివారికి ఒక రోజులో ఇంతమొత్తం రావడం తిరుమల చరిత్రలో ఇది రెండోసారి అని చెబుతున్నారు. 2018 జులై 26వ తేదీన 6.28 కోట్లు హుండీ ఆదాయంగా వచ్చింది. అప్పటి రికార్డు స్థాయి ఆదాయానికి నిన్నటి ఆదాయం దగ్గరగా వెళ్లడం విశేషం. భక్తుల రాక పెరగడమే ఇందుకు కారణమని ప్రత్యేకంగా చెప్పుకోవలసిన పనిలేదు.

గత రెండేళ్లుగా కోవిడ్ నిబంధనల కారణంగా చాలామంది తిరుమల రాలేకపోయారు. నిన్నమొన్నటి వరకూ విపరీతమైన ఎండల కారణంగా ఇల్లు కదలలేకపోయారు. ఇక ఇప్పుడు స్కూల్స్ తెరుస్తున్నవేళ వెళ్లి వద్దామని భావించేవారు ఎక్కువగా ఉంటారు. నిన్నమొన్నటి వరకూ పెళ్లిళ్లు విపరీతంగా జరిగాయి. అందువలన కొత్త దంపతులతో తిరుమలను దర్శించుకునేవారి సంఖ్య ఎక్కువ. ఈ కారణాలుగా రద్దీ పెరిగింది .. స్వామివారికి సమర్పించే కానుకలు పెరిగాయి అనుకోవచ్చు.