Begin typing your search above and press return to search.

రాజధాని తిరుపతి రాష్ట్ర విభజనకి వైఎస్ఆర్ కారణం: మాజీ ఎంపీ!

By:  Tupaki Desk   |   19 March 2021 4:30 PM GMT
రాజధాని తిరుపతి రాష్ట్ర విభజనకి వైఎస్ఆర్ కారణం: మాజీ ఎంపీ!
X
ఏపీ రాజధానిగా అమరావతిని ఖరారు చేశారు మాజీ సీఎం చంద్రబాబు. ఆ తరువాత ముఖ్యమంత్రి అయిన వైఎస్ జగన్.. అమరావతిని రాజధానిగా కొనసాగిస్తూనే, కీలకమైన పరిపాలన రాజధానిగా విశాఖను మారుస్తామని ప్రకటించారు. ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. న్యాయ రాజధానిగా కర్నూలు ఉంటుందని ప్రకటించారు. మొత్తంగా ఇప్పుడు మూడు రాజధానుల పంచాయతీ నడుస్తుంది. అయితే , అసలు ఈ మూడు ఏపీ రాజధానులు కాదు అని , ఏపీకి అసలైన రాజధాని మరొకటి ఉంది అంటున్నారు తిరుపతి మాజీ ఎంపీ, కాంగ్రెస్ సీనియర్ నేత చింతా మోహన్ అన్నారు.

ఈ మేరకు తిరుపతిలో శుక్రవారం చింతా మోహన్ మీడియాతో మాట్లాడుతూ.. తిరుపతి రాజధాని అవుతుందని బ్రహ్మంగారు ఎప్పుడో చెప్పారన్నారు. అలాగే, దేశం, రాష్ట్రం నాశనం అవుతోందని, మౌనంగా ఉండటం ఇష్టం లేక నోరు విప్పుతున్నానని వ్యాఖ్యానించారు. రాష్ట్ర విభజనకు ప్రధాన కారకుడు తన మిత్రుడు, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి అని సంచలనం రేపారు. అప్పట్లో కోట్ల విజయభాస్కర రెడ్డిని గద్దె దించేందుకు తెలంగాణ ఉద్యమానికి నాంది పలికింది వైఎస్సార్ అని చెప్పుకొచ్చారు. మరి చెన్నారెడ్డితో మెదలైన తెలంగాణ ఉద్యమం ఉస్మానియా యూనివర్సిటీకి చేరిందన్నారు. తర్వాత ఉద్యమానికి కేసీఆర్ సారథ్యం వహించారని, సీపీఎం తప్ప అన్ని పార్టీలు రాష్ట్ర విభజన కోసం ఉత్తరాలు ఇచ్చాయని గుర్తు చేశారు. తిరుపతి చూట్టూ లక్ష ఎకరాల ప్రభుత్వ భూమి ఉందన్నారు. తిరుపతి రాజధాని అవుతుందని పోతులూరి వీరబ్రహ్మంగారి కాల జ్ఞానంలో కూడా ఉందని వివరించారు.

తుళ్లూరు రాజధానిగా సాధ్యం కాదని చింతా మోహన్ అన్నారు. అది శపించబడిన స్థలమని తాను చంద్రబాబుకు ముందే చెప్పానని తెలిపారు. ఆ స్థలంలో చంద్రబాబు అడుగు పెట్టి మటాస్ అయ్యారని అన్నారు. మాజీ ముఖ్యమంత్రులు అంజయ్య, భవనం వెంకట్రామ్, ఎన్టీఆర్ పదవులు సైతం పోయాయని చెప్పారు. తుళ్లూరులో అడుగుపెడితే పదవి గండం తప్పదని తెలిపారు. ఇక, చంద్రబాబు 14 ఏళ్లు సీఎంగా ఉండి.. తిరుపతికి 14 రూపాయలు కూడా ఇవ్వలేదని చింతా మోహన్ విమర్శించారు. టీడీపీ మునిగిపోయే నావ అని, చంద్రబాబు చల్లని రూపాయని ఎద్దేవా చేశారు. తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నిక చరిత్రలో నిలబడిపోతుందని చింతా మోహన్ అన్నారు. దేశ భవిష్యత్తుకు ఇది ఒక టర్నింగ్ పాయింట్ అవుతుందని అభిప్రాయపడ్డారు. అజ్ఞానంతో ప్రధాని మోదీ పరిపాలన చేస్తున్నారని ఆరోపించారు. తిరుపతి ఉప ఎన్నిక చంద్రబాబు, జగన్ భవిష్యత్తు నిర్ణయించే ఎన్నిక కాదని, దేశ భవిష్యత్తు నిర్ణయించే ఎన్నిక అని వ్యాఖ్యానించారు