Begin typing your search above and press return to search.

తిరుపతి ఉప ఎన్నిక: బీజేపీకి తిరుమల జీఎస్టీ ఉచ్చు

By:  Tupaki Desk   |   24 March 2021 6:30 AM GMT
తిరుపతి ఉప ఎన్నిక: బీజేపీకి తిరుమల జీఎస్టీ ఉచ్చు
X
తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికల వేళ బీజేపీకి చిక్కులు వచ్చిపడ్డాయి. పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమలలో శ్రీవారి సేవలను జీఎస్టీ పరిధిలోకి తీసుకొచ్చిన అంశాన్ని వైసీపీ తెరమీదకు తీసుకురావడంతో బీజేపీ ఇరుకునపడింది.

తిరుమల తిరుపతి దేవస్థానం ఏటా 120 కోట్ల రూపాయలను జీఎస్టీ కింద కేంద్రప్రభుత్వానికి చెల్లిస్తోంది.కాటేజీల అద్దె మొదలుకొని భక్తులకు కల్పించే సౌకర్యాలను జీఎస్టీ కిందకు కేంద్రప్రభుత్వం తీసుకురావడం దుమారం రేపింది. లడ్డూనే జీఎస్టీ నుంచి మినహాయించారు. కానీ ఆప్రసాదాన్ని తయారు చేయడానికి అవసరమైన వస్తువులపై జీఎస్టీని చెల్లిస్తోంది. టీటీడీ పరిధిలోని అన్ని ఆర్థిక కార్యకలాపాలు, క్రయవిక్రయాలపై జీఎస్టీని కేంద్రం వసూలు చేస్తోంది. ఇప్పుడు ఇదే వైసీపీకి ప్రచారాస్త్రంగా.. బీజేపీని ఇరుకున పెట్టేలా తయారైంది.

హిందువులు, హిందూయిజానికి తాము మాత్రమే ప్రతినిధులమని చెప్పుకుంటున్న బీజేపీ నాయకులు అదే హిందువుల మనోభావాలతో ముడిపడి ఉన్న శ్రీవారి సేవలపై జీఎస్టీ వడ్డించడం సరికాదని.. దీన్ని ఉపసంహరించుకోవాలనే డిమాండ్ ను వినిపిస్తోంది. కాటేజీలకు హోటళ్ల మాదిరిగా జీఎస్టీ వసూలు చేయడం ఏందని వైసీపీ ప్రశ్నిస్తోంది.

తిరుపతి ఉప ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తున్న బీజేపీ నాయకులకు ఈ జీఎస్టీ తలనొప్పి ఇప్పుడు శరాఘాతంగా మారింది. దీనిపై ప్రజలు నిలదీస్తుండడంతో వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడినట్లైంది.