Begin typing your search above and press return to search.

తిరుపతి రైతుల సభకు... తెలుగుదేశం పిలుపు

By:  Tupaki Desk   |   16 Dec 2021 9:09 AM GMT
తిరుపతి రైతుల సభకు...  తెలుగుదేశం పిలుపు
X
తిరుప‌తి వేదిక‌గా శుక్ర‌వారం నిర్వ‌హించ‌నున్న అమ‌రాతి రైతుల మ‌హాస‌భ‌కు ప్ర‌జానీకం త‌ర‌లి రావాల‌ని.. ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీ ప్ర‌జ‌ల‌కు పిలుపునిచ్చింది. అమ‌రావ‌తి అంద‌రిదీ అని.. కేవ‌లం రైతుల‌కు మాత్ర‌మే చెందిన న‌గ‌రం కాద‌ని.. పార్టీ ఒక ప్ర‌క‌ట‌న‌లో పేర్కొంది. ప్ర‌తి ఒక్క‌రూ ఈ స‌భ‌కు హాజ‌రు కావాల‌ని కోరింది. తిరుపతిలో తలపెట్టిన రాజధాని అమరావతి పరిరక్షణ మహోధ్యమ సభకు రాష్ట్ర ప్రజానీకం అంతా కదలి రాజధాని అమరావతికి మద్ధతు తెలపాలని కోరింది. ముఖ్యంగా టీడీపీ శ్రేణులు కూడా ఈసభను విజయవంతంచేయడంలో భాగం కావాలని పార్టీ కోరింది.

ప్రాంతీయ విధ్వేషాలు రెచ్చగొట్టే రాష్ట్ర ద్రోహులకు ఈ సభతో ప్రజలు గుణపాఠం చెప్పాలని ప్ర‌జ‌ల‌కు పిలునివ్వ‌డం గ‌మ‌నార్హం. అమరావతిలో ఉన్న రూ.2 లక్షల కోట్ల సంపదను వైసీపీ ప్రభుత్వం బూడిదపాలు చేసిందని విమ‌ర్శించింది. రాష్ట్ర భవిష్యత్ ను నాశనం చేసిన ఈ ప్రభుత్వాన్ని గద్దె దింపితేనే ప్రజలకు భవిష్యత్ ఉంటుందని పేర్కొంది. అభివృద్ధి చేయడం చేతకాక ప్రాంతాల మధ్య చిచ్చుపెట్టి పబ్బం గడుపుకోవాలని పాలకపక్షం ప్రయత్నాలు చేస్తోందని టీడీపీ నిప్పులు చెరిగింది.

రాజధానికి 30 వేల ఎకరాలు కావాలని చెప్పిన మొదటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టడం ఇష్టంలేక రాజధానిని మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నామని అసెంబ్లీలో చెప్పారు. రాజధాని మార్పు భూములు దోచుకున్నవారికే కావాలని, తమకు కాదని, రాజధానిగా అమరావతి ఉంటుందని ఎన్నికల ముందు ప్రచారం చేసి రాష్ట్ర ప్రజలతో ఓట్లు వేయించుకున్నారు. చెప్పిన మాటపై జగన్ నిలబడరని రాజధాని విషయంలోనే తేలిపోయింది. రోడ్లు వేయడానికి డబ్బులు లేవన్న వ్యక్తి మూడు రాజధానులు ఎలా కడతారో ప్రజలకు సమాధానం చెప్పాలి?`` అని టీడీపీ అదినేత చంద్ర‌బాబు ప్ర‌శ్నించారు.

మేథావుల ముసుగు వేసుకుని కొందరు వైసీపీ సానుభూతిపరులు రాష్ట్రంలో అల్లర్లు సృష్టించాలని చూస్తున్నారని మండిప‌డ్డారు. వైసీపీలో కూడా మూడు రాజధానులపై కొందరు మదనపడుతున్నారని తెలిపారు. అన్ని పార్టీలు అమరావతిని ఏకైక రాజధానిగా కోరుతున్నాయని చెప్పారు. రాష్ట్రంలోని పరిశ్రమలను తరిమేసి నిరుద్యోగుల నోట్లో మట్టికొట్టిన ఈ ప్రభుత్వాన్ని యువత నిలదీయాలని పిలుపునిచ్చారు. రెండున్నరేళ్లలో ఒక్క పరిశ్రమ కూడా రాష్ట్రానికి రాలేదని, త‌మ ప్ర‌భుత్వ హ‌యాంలో తెచ్చిన పరిశ్రమలు తప్ప కొత్తవి లేవని బాబు గుర్తు చేశారు.

వచ్చిన వాటిని కమీషన్ల కోసం తరిమేస్తున్నారు. రాష్ట్ర ప్రజలు కోరుకునేది అభివృద్ధి వికేంద్రీకరణ తప్ప..అధికార వికేంద్రీకరణ కాదు. సాగునీటి ప్రాజెక్టులు నిర్మిస్తే రాష్ట్రాభివృద్ధికి అడుగులు పడతాయి. జగన్ రెడ్డి సీఎం అయ్యాక రాష్ట్రంలోని నీటి ప్రాజెక్టులను నిర్వీర్యం చేసి వ్యవసాయాన్ని కుదేలు చేశారు. రెండున్నరేళ్లలో రాష్ట్రానికి వైసీపీ ఏం చేసిందో ప్రజలు నిలదీయాలి`` అని ఓ ప్ర‌క‌ట‌న‌లో కోరారు.