Begin typing your search above and press return to search.

తిరుపతి రిజల్టు ఓ ట్రయలర్ మాత్రమేనా ?

By:  Tupaki Desk   |   17 March 2021 2:30 AM GMT
తిరుపతి రిజల్టు ఓ ట్రయలర్ మాత్రమేనా ?
X
తొందరలో జరగబోయే తిరుపతి లోక్ సభ ఉపఎన్నికలు కమలంపార్టీకి ఓ హెచ్చరికేనా ? అవుననే అంటున్నారు పరిశీలకులు. తాజాగా వెల్లడైన మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ కానీ దాని మిత్రపక్షం జనసేన కానీ ఎక్కడా అడ్రస్ కనబడలేదు. అసలు బలమే లేని రెండు పార్టీల మధ్య పోటీ విషయమై చాలా కాలం వివాదాలు రేగాయి. అయితే చివరకు పవన్ ఏమి ఆలోచించారో కానీ పోటీ అవకాశాన్ని బీజేపీకి వదిలేశారు.

తిరుపతిలో పోటీ చేయాలని కమలంపార్టీ డిసైడ్ అయిపోయిన తర్వాత మున్సిపల్ ఫలితాలు వచ్చాయి. దాంతో బీజేపీ నేతల మీద ఒక్కసారిగా పెద్ద బండపడినట్లయ్యింది. ఎందుకంటే లోక్ సభ పరిధిలోని మున్సిపాలిటిలతో పాటు తిరుపతి కార్పొరేషన్లో కూడా వైసీపీనే అఖండ విజయం సాధించింది. తిరుపతి లోక్ సభ సీటు చిత్తూరు, నెల్లూరు జిల్లాల పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో ఉంది.

తిరుపతి కార్పొరేషన్ను వైసీపీ స్వీప్ చేసేసింది. అలాగే శ్రీకాళహస్తిలో కూడా వైసీపీనే గెలిచింది. ఇక నెల్లూరు జిల్లాలోని సూళ్ళూరుపేట, వెంకటగిరి, ఆత్మకూరు, గూడూరు మున్సిపాలిటిల్లో కూడా క్లాన్ స్వీప్ చేసేసింది. ఈ మున్సిపాలిటిల్లో కనీసం నాలుగు వార్డుల్లో కూడా బీజేపీ అభ్యర్ధులు గెలవలేదు. అన్నీ మున్సిపాలిటీల్లోను బీజేపీ+జనసేన కలిసే పోటీచేసినా ఏమాత్రం ఉపయోగం లేకపోయింది.

రేపటి లోక్ సభ ఎన్నికల ఫలితం కూడా దాదాపు ఇలాగే ఉండే అవకాశం ఉంది. ఉపఎన్నిక పోటీ విషయంలో బీజేపీకి జనసేనకు మధ్య అంతరం పెరిగిపోయిన మాట వాస్తవం. ప్రతి విషయంలోను పవన్ను కార్నర్ కు నెట్టేసి బీజేపీ నేతలు తమ మాటే నెగ్గించుకుంటున్నారు. ఇపుడు కూడా ఇలాగే జరుగుంటుందని అనుమానిస్తున్నారు. సరే లోక్ సభ ఎన్నికకు ముందు ట్రైలర్ లాగ వచ్చిన మున్సిపల్ ఎన్నికల ఫలితం తర్వాత బీజేపీ నేతలు పోటీ విషయంలో ఏమి చేస్తారో చూడాలి.