Begin typing your search above and press return to search.

మోడీ టార్గెట్‌ గా టీడీపీ తిరుప‌తి రాజ‌కీయం.. వ‌ర్కవుట్ అయ్యేనా?

By:  Tupaki Desk   |   30 March 2021 5:30 PM GMT
మోడీ టార్గెట్‌ గా టీడీపీ తిరుప‌తి రాజ‌కీయం.. వ‌ర్కవుట్ అయ్యేనా?
X
తిరుప‌తి పార్ల‌మెంటు ఉప ఎన్నిక‌లో విజ‌యం సాధించాల‌ని గ‌ట్టి ప‌ట్టుద‌ల‌పై ఉన్న టీడీపీ.. ఈ క్ర‌మంలో ఒక‌వైపు సెంటిమెంటును ర‌గిలిస్తూనే.. మ‌రోవైపు ప్ర‌భుత్వ విధానాల‌ను కూడా ఎండ‌గ‌డుతోంది. ఈ క్ర‌మం లో ప్ర‌ధాని న‌రేంద్ర మోడీని కూడా టీడీపీ నేత‌లు వ‌దిలి పెట్ట‌లేదు. ఎందుకంటే.. ప్ర‌భుత్వ వ్య‌తిరేక ఓటు బ్యాంకును బీజేపీ చీల్చే అవ‌కాశం ఎక్కువ‌గా ఉంద‌ని భావిస్తున్న టీడీపీ మోడీ విష‌యాన్ని కూడా ఎన్నిక‌ల ప్రచారంలో ప్ర‌ధానంగా ప్ర‌స్తావిస్తుండ‌డం గ‌మ‌నార్హం. ఏపీ అంటే.. మోడీకి చుల‌క‌న‌ని.. రాజ‌ధానికి భూమి పూజ చేసిన‌.. ఆయ‌న రాజ‌ధానిని ర‌క్షించాల‌నే విజ్ఞ‌త‌ను వ‌దిలేశార‌ని నాయ‌కులు విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు.

అయితే.. టీడీపీ అనుస‌రిస్తున్న ఈ స్ట్రాట‌జీ ఏమేరకు వ‌ర్క‌వుట్ అవుతుంది? అనేది ప్ర‌ధానంగా ప్ర‌శ్న‌. అయితే.. దీనికి సీనియ‌ర్లు మంచి రెస్పాన్స్ వ‌స్తుంద‌ని అంటున్నారు. ప్ర‌స్తుతం అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌లు కూడా పెట్రోల్ ధ‌ర‌లు పెరిగి, నిత్యావ‌స‌ర ధ‌ర‌లు పెరిగి.. తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేప‌థ్యంలో ప్ర‌తి ఒక్క‌రిలోనూ కేంద్రంపై ఆగ్ర‌హం ఉంది. అదేస‌మ‌యంలో విశాఖ ఉక్కు, రాజ‌ధాని అమ‌రావ‌తి వంటి విష‌యాల్లో మొండిగా వ్య‌వ‌హ‌రించ‌డాన్ని కూడా త‌ప్పుప‌డుతున్నారు.

ఈ స‌మ‌యంలో అధికార‌ వైసీపీ నేత‌లు ఎలాగూ... త‌మ‌పై ఉన్న కేసుల నేప‌థ్యంలోను, కేంద్రం నుంచి రాష్ట్రానికి అందాల్సిన సాయం విష‌యంలోనూ వెనక్కిత‌గ్గి ఉన్న నేప‌థ్యంలో మోడీపై ఒక్క‌మాట అనే ఛాన్స్ లేదు. ఈ నేప‌థ్యంలో ఈ త‌ర‌హా వ్యూహాన్ని టీడీపీ తీసుకోవ‌డం ఒకింత వ‌ర్క‌వుట్ అవుతుంద‌నేది టీడీపీ సీనియ‌ర్లు - అదేవిధంగా మెజారిటీ వ‌ర్గం కూడా భావిస్తోంది. అయితే... దీనిని మ‌రింత‌గా ప్ర‌జ‌ల్లోకి తీసుకువెళ్లాలి త‌ప్ప‌.. ఏదో ట‌చ్ చేశామంటే.. చేశామ‌నే ధోరణి కాకుండా.. కేంద్రంతో రాష్ట్ర ప్ర‌భుత్వం లాలూచీ ప‌డుతున్న‌తీరు - మోడీకి భ‌య‌ప‌డుతున్న విధాన‌నం వంటివి కూడా ప్ర‌జ‌ల్లోకి బ‌లంగా తీసుకువెళ్లాల‌ని సూచిస్తున్నారు. అప్పుడు బీజేపీ ఓటు బ్యాంకు కూడా టీడీపీ వైపు మొగ్గు చూప‌డం ఖాయ‌మ‌ని అంటున్నారు.