Begin typing your search above and press return to search.

తిరుప‌తి లో టీడీపీకి అభ్య‌ర్థి ఎవరు?

By:  Tupaki Desk   |   18 March 2021 12:30 PM GMT
తిరుప‌తి లో టీడీపీకి అభ్య‌ర్థి ఎవరు?
X
అదేంటీ.. ఊరు లేక‌వ‌క‌ముందే ఉప ఎన్నిక అభ్య‌ర్థిని ప్ర‌క‌టించిన పార్టీ ఏదైనా ఉందంటే.. అది టీడీపీనే క‌దా అంటారా..? నిజమే.. అధినేత ప్రకటించారు. కానీ.. అభ్యర్థి మాటేమిటి అన్న‌ది క‌దా అస‌లు సంగ‌తి. అప్పుడెప్పుడో త‌మ పార్టీ త‌ర‌పున తిరుప‌తిలో ప‌నబాక ల‌క్ష్మి బ‌రిలో నిలుస్తార‌ని ప్ర‌క‌టించింది టీడీపీ. కానీ.. ఇప్ప‌టి వ‌ర‌కూ అభ్య‌ర్థి ఆ దిశ‌గా అడుగులు వేస్తున్న‌ట్టు క‌నిపించ‌క‌పోవ‌డం అనేక అనుమానాల‌కు తావిస్తోంది. అప్పుడే.. మౌనంగా ఉన్న ప‌న‌బాక‌.. ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో మ‌రింత వెన‌క్కు వెళ్లిపోయార‌నే వార్త‌లు వినిపిస్తున్నాయి.

అసెంబ్లీ ఎన్నిక‌ల్లో జ‌గ‌న్ తిరుగులేని విజ‌యం సాధించారు. ఆ త‌ర్వాత గ‌డిచిన ఏడాది కాలంలో వైసీపీ బ‌లం త‌గ్గింద‌ని, ఇప్ప‌టికిప్పుడు ఎన్నిక‌లు జ‌రిగితే.. వైసీపీ నేత‌ల‌కు డిపాజిట్లు కూడా ద‌క్క‌వ‌ని చెప్పుకొచ్చారు టీడీపీ నేత‌లు. నిజంగానే జ‌నాల్లో వైసీపీ బ‌లం ఎలా ఉందో తేల్చి చెప్పాయి స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌లు. పంచాయ‌తీ పోరులో ప‌ల్లె ప్ర‌జ‌లు 80 శాతానికిపైగా స్థానాల్లో ప‌ట్టం క‌ట్ట‌గా.. మునిసిప‌ల్ పోరులో ప‌ట్నం జ‌నం కూడా జ‌గ‌న్ వెంట‌నేన‌ని చాటిచెప్పారు. ఈ పోరులో ఏకంగా 90 శాతానికిపైగా వైసీపీ విజ‌య‌దుందుభి మోగించింది. ప‌రిష‌త్ పోరు జ‌రిగితే అది కూడా లాంఛ‌న‌మే అని అంటున్నారు.

ఇలాంటి ప‌రిస్థితుల్లో తిరుప‌తి ఉప ఎన్నిక బ‌రిలో నిల‌వాలంటేనే ప్ర‌త్య‌ర్థుల్లో గుబులో రేగుతోంద‌నే అభిప్రాయం వినిపిస్తోంది. వైసీపీ ఫ్యాన్ గాలికి నిలిచే అవ‌కాశం లేద‌ని, ఆ హోరులో కొట్టుకుపోవ‌డం ఖాయ‌మ‌ని భావిస్తున్నార‌ట విప‌క్ష పార్టీల నేత‌లు. ప‌వ‌న్ తిరుప‌తి పోటీ నుంచి స్వయంగా త‌ప్పుకోవ‌డంలో కూడా వ్యూహం ఇదేన‌ని చెబుతున్నారు. ఇలాంటి ప‌రిస్థితుల్లో ఎప్పుడో టీడీపీ అభ్య‌ర్థిగా ప్ర‌క‌టించ‌బ‌డిన ప‌నబాక మ‌రింత‌గా ఆలోచిస్తున్నార‌నే వార్త‌లు వినిపిస్తున్నాయి.

నిజానికి.. చంద్ర‌బాబు అభ్య‌ర్థిగా ప్ర‌క‌టించిన‌ప్పుడు కూడా ఆమెలో ప్ర‌త్యేక‌మైన ఆనంద‌మేమీ క‌నిపించ‌లేదు. అస‌లు ప‌న‌బాక గ‌తంలో పార్టీ మారే అవ‌కాశం ఉంద‌ని, ఆమె చేజార‌కుండా ఉండేందుకే ఈ సీటులో నిల‌బెట్టార‌నే ప్ర‌చారం కూడా సాగింది. ఈ కార‌ణంగానే ఆమె వ‌ద్ద‌న‌లేక‌, ఔన‌న‌లేక వేచి చూసే ధోర‌ణిలో ఉండిపోయార‌ని చెప్పుకుంటున్నారు. ఇప్పుడు వైసీపీ ప్ర‌భంజ‌నం చూసిన త‌ర్వాత వెన‌క‌డుగు వేసే అవ‌కాశాలు లేక‌పోలేద‌ని అంటున్నారు. మ‌రి, ఏం జ‌రుగుతుంది? ఫైనల్ గా పనబాక పోటీలో ఉన్నారా? ఉంటారా? అన్న‌ది తేలాల్సి ఉంది. ఒక వేళ ప‌నాబ‌క నో అంటే మాత్రం.. టీడీపీ నుంచి పోటీలో నిల‌వ‌డానికి ఎవ‌రు సాహ‌సిస్తారు అన్న‌దే క్వ‌శ్చ‌న్‌.