Begin typing your search above and press return to search.
వాళ్లముందు నువ్వెంత కేసీఆర్ః కోదండరాం
By: Tupaki Desk | 4 Dec 2017 4:09 PM GMTహైదరాబాద్ నగర పరిధిలో గల సరూర్ నగర్ స్టేడియంలో కొలువుల కొట్లాట సభ తెలంగాణ జేఏసీలో కొత్త ఉత్సాహాన్ని నింపింది. సర్కార్ తో కొట్లాడైనా సరే ఉద్యోగాలను తెచ్చుకుందామనే నినాదంతో నిరుద్యోగుల కోసం తెలంగాణ జేఏసీ నిర్వహించిన కొలువులకై కొట్లాట హైదరాబాద్ సరూర్ నగర్ స్టేడియంలో విజయవంతంగా కొనసాగిందనే భావన జేఏసీ వర్గాల నుంచి వ్యక్తమవుతోంది. ఈ సభకు టీడీపీ నేతలు ఎల్. రమణ - బీజేపీ నేత రామచందర్ రావు - కాంగ్రెస్ నేతలు జీవన్ రెడ్డి - దాసోజు శ్రావణ్ - సీపీఐ నేత చాడ వెంకటరెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఓయూలో పోలీసుల లాఠీచార్జ్ ని జేఏసీ ఖండించింది. కొలువులకై కొట్లాట సభలో పాల్గొన్న కోదండరాం మాట్లాడుతూ.. కేసీఆర్ సర్కార్ అధికారంలోకి వచ్చిన వెంటనే ఉద్యోగాలు ఇచ్చి ఉండాల్సిందన్నారు. కొంతకాలం ఓపిక పట్టి చూశాం - అప్పటికీ సర్ది చెప్పాం అయినా.. క్యాలెండర్ విడుదల చేయకుండా ఉద్యోగాలు ఇస్తామంటే ఎలా నమ్మాలని కోదండరాం ప్రశ్నించారు.
`తెలంగాణను మేమే తెచ్చాం.. మేమే తెచ్చాం అని చెప్పుకుంటున్న వారు రాష్ట్రం కోసం ప్రాణత్యాగం చేసిన వారి ముందు ఎంత?` అంటూ టీఆర్ ఎస్ ప్రభుత్వంపై తెలంగాణ జేఏసీ ఛైర్మన్ కోదండరాం ఫైరయ్యారు. భవిష్యత్తు మీద యువత నిరాశకు గురైతే దేశానికే మంచిది కాదని తెలంగాణ జేఏసీ ఛైర్మన్ కోదండరాం అన్నారు. నిరుద్యోగుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కొలువులకై కొట్లాట సభ నిర్వహణ కోసం కోర్టు అనుమతి ఇచ్చినా ప్రభుత్వం మాత్రం సభ నిర్వహణకు అడ్డంకులు సృష్టించిందని ఆయన మండిపడ్డారు. నిరుద్యోగ సమస్య పరిష్కారం కోసం ఇక్కడికి వచ్చామన్నారు. అందరూ సంఘటితంగా పోరాడేందుకే వేదిక ఏర్పాటు చేశామని, కొలువులకై కొట్లాట సభను అందరూ విజయవంతం చేయాలని ఆయన కోరారు.
జాయింట్ యాక్షన్ కమిటీ (జేఏసీ)ని గ్రామస్థాయి నుంచి బలోపేతం చేయాలని ప్రజా కళాకారుడు గద్దర్ పేర్కొన్నారు. ఈ సభలో పాల్గొన్న గద్దర్ మాట్లాడుతూ..సర్కార్ తో కొట్లాడైనా సరే ఉద్యోగాలను తెచ్చుకుందామని పిలుపునిచ్చారు. కొట్లాడి తెలంగాణ తెచ్చుకున్నాం అలాగే, కొట్లాడి ఉద్యోగాలు తెచ్చుకుందామని గద్దర్ అన్నారు. ఎన్నో పోరాటాల నడుమ వచ్చిన తెలంగాణ రాష్ట్రంలో ఫ్యూడల్ సిస్టం రావడం దారుణమని గద్దర్ వ్యాఖ్యానించారు. గ్రామస్థాయిలో జేఏసీని ఏర్పాటు చేయడంతోపాటు విద్యార్థులు డ్రైవింగ్ ఫోర్స్‌గా ఉండాలన్నారు. విద్యార్థులు రాజకీయ శక్తిగా మారాలని ప్రజా కళాకారుడు గద్దర్ పిలుపునిచ్చారు. అమరులు కలలు కన్న తెలంగాణ ఇంకా రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. గడిచిన మూడున్నర ఏళ్లలో తాను కన్నీరు కార్చని రోజు లేదని, అలాగే ప్రజల కష్టాలే తన కష్టాలుగా భావించిన కోదండరాంను ఇబ్బందులకు గురి చేస్తున్నారని గద్దర్ అన్నారు .
మాజీ ఎమ్మెల్సీ చుక్కా రామయ్య మాట్లాడుతూ చదువుకున్న వారికి ఉద్యోగాలు చూపించే బాధ్యత ప్రభుత్వానిదేనని అన్నారు. అన్ని పార్టీలు నిరుద్యోగ సమస్యకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. అలాగే, ప్రభుత్వ జీవోలో లోపాలు, ఉదాసీనత వల్లే కోర్టులకు వెళ్లాల్సి వస్తోందని చుక్కా రామయ్య అన్నారు. అయితే, ఈ సభకు పలువురు ప్రజా ప్రతినిధులతోపాటు.. నిరుద్యోగులు భారీ సంఖ్యలో హాజరుకావడంతో పోలీసు ఉన్నతాధికారులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.