Begin typing your search above and press return to search.

కేసీఆర్ కు స‌వాల్‌..ఆర్టీసీ మాకివ్వండి లాభాల్లో తెస్తాం

By:  Tupaki Desk   |   9 Jun 2018 5:23 AM GMT
కేసీఆర్ కు స‌వాల్‌..ఆర్టీసీ మాకివ్వండి లాభాల్లో తెస్తాం
X
ఎన్నిక‌ల‌కు ఏడాది కంటే త‌క్కువ ఉన్న వేళ‌.. ఆర్టీసీ లాంటి పెద్ద సంస్థ స‌మ్మెకు వెళతానంటే.. ఏ ముఖ్య‌మంత్రి అయినా ఏం చేస్తారు? చ‌ర్చ‌ల‌తో సామర‌స్యం ఇష్యూ సెటిల్ కావాల‌ని భావిస్తారు. కానీ.. కేసీఆర్ రూటు స‌ప‌రేటు. ఏ ముఖ్య‌మంత్రి అన‌ని రీతిలో ఆయ‌న రియాక్ట్ కావ‌ట‌మే కాదు.. స‌మ్మె చేస్తే.. సంస్థ‌ను మూసివేస్తామ‌ని.. ఆర్టీసీ ఇదే చివ‌రి స‌మ్మె అవుతుందంటూ దిమ్మ తిరిగేలా షాకింగ్ వ్యాఖ్య‌లు చేశారు.

కేసీఆర్ వ్యాఖ్య‌లు పెను సంచ‌ల‌నంగా మారాయి. ఆర్టీసీ న‌ష్టాల్లో ఉంద‌ని.. గ‌తంలో తాను జీతాలు పెంపు స‌మ‌యంలోనూ క‌ష్ట‌ప‌డి ప‌ని చేసి లాభాల్లోకి తీసుకురావాల‌ని చెప్పామ‌ని.. కానీ అలాంటిదేమీ జ‌ర‌గ‌లేద‌న్న అసంతృప్తిని కేసీఆర్ వ్య‌క్తం చేయ‌టం తెలిసిందే. కేసీఆర్ వ్యాఖ్య‌ల‌పై ప‌లువురు స్పందించారు. మిగిలిన వారితో పోలిస్తే ఆర్టీసీ కార్మిక సంఘ‌మైన టీఎంయూ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి అశ్వ‌త్థామ‌రెడ్డి చేసిన వ్యాఖ్య‌లు కీల‌కంగానే కాదు ఆస‌క్తిక‌రంగా మారాయి.

సీఎం చేసిన వ్యాఖ్య‌లపై సూటిగా స్పందించ‌టం ఒక ఎత్తు అయితే.. మ‌రో ఆస‌క్తిక‌ర స‌వాల్‌ ను విసిరారు. ఆర్టీసీ న‌ష్టాల పైనా ప్ర‌భుత్వ వైఖ‌రిని ప్ర‌శ్నించారు. న‌ష్టాల వెనుక ఉన్న కార‌ణాన్ని విప్పి చెప్పే క్ర‌మంలో ప్ర‌భుత్వం అనుస‌రిస్తున్న వైఖ‌రిని వేలెత్తి చూపించారు. సీఎం కోరిన‌ట్లే ఆర్టీసీలో ఇదే చివ‌రి స‌మ్మె కావాల‌ని.. కార్మికుల స‌మ‌స్య‌ల‌పై ప్ర‌భుత్వం సానుకూలంగా స్పందిస్తే.. స‌మ్మె చేయాల్సిన అవ‌స‌ర‌మే ఉండ‌ద‌న్నారు.

కార్మికుల కార‌ణంగా ఆర్టీసీ న‌ష్టాలు రావ‌టం లేద‌న్న ఆయ‌న రీయింబ‌ర్స్ మెంట్ నిధులు.. న‌గ‌ర ర‌వాణా చ‌ట్టం ప్ర‌కారం జీహెచ్ ఎంసీకి రావాల్సిన నిధులు ఇస్తే న‌ష్టాలు ఉండ‌వ‌న్నారు. ఆర్టీసీని నాలుగేళ్ల పాటు త‌మ‌కు అప్ప‌గిస్తే లాభాల్లోకి తీసుకొస్తామంటూ స‌వాలు విసిరిన ఆయ‌న‌.. ఒక‌వేళ అప్ప‌టికి న‌ష్టాలు వ‌స్తే.. తాము జీతాలు పెంచాల‌ని అడ‌గ‌మ‌ని స్ప‌ష్టం చేశారు.

ఆర్టీసీ బోర్డులో డైరెక్ట‌ర్ ప‌ద‌వుల కోస‌మే స‌మ్మెల‌కు ఉసిగొల్పుతున్నామ‌ని అంటున్నార‌ని.. డైరెక్ట‌ర్ పోస్టులు త‌మ‌కు టిష్యూ పేప‌ర్ల‌తో స‌మానంగా వ్యాఖ్యానించారు. స‌మ్మెల‌పై నిషేధం ఉన్న‌ప్పుడు స‌మ్మెలు చేస్తారా? అని అడుగుతున్నార‌ని తెలంగాణ కోసం చేప‌ట్టిన స‌క‌ల జ‌నుల స‌మ్మె కాలంలోనూ ఆర్టీసీలో స‌మ్మెల‌పై నిషేధం ఉంద‌న్న విష‌యాన్ని గుర్తు చేశారు. స‌మ్మెలు చేయ‌టం ఆర్టీసీ కార్మికుల‌కు కొత్త కాద‌ని.. స‌మ్మెలు చేసే కొత్త వేత‌నాలు సాధించుకున్నామ‌న్న విష‌యాన్ని మ‌ర్చిపోకూడ‌ద‌న్నారు. ఆర్టీసీకి న‌ష్టాలంటూ చెబుతున్న ముఖ్య‌మంత్రి.. మ‌రి ఈ స‌వాల్‌ను స్వీక‌రిస్తారా?