Begin typing your search above and press return to search.

టీజేఏసీ వల్ల అవుతుందా?

By:  Tupaki Desk   |   11 April 2015 4:27 AM GMT
టీజేఏసీ వల్ల అవుతుందా?
X
తెలంగాణ ఉద్యమం సమయంలో కీలక పాత్ర పోషించి తర్వాతి కాలంలో కేసీఆర్ రాజకీయ చతురతకు కనుమరుగయ్యారనే విమర్శను ఎదుక్రొంటున్న టీజేఏసీ మళ్లీ కదనరంగంలోకి దూకాలని నిర్ణయిస్తుందట! ఈ మేరకు శనివారం ఒక టీజేఏసీ స్టీరింగ్ కమిటీ సమావేశం ఏర్పాటుచేసుకుంటున్నారు. తెలంగాణ ప్రభుత్వంపై వస్తున్న విమర్శలు, మిషన్ కాకతీయ విషయంలో అవినీతి ఆరోపణలు, ఏకపక్ష నిర్ణయాలు కలిపి వీరికి కొత్త ఉత్సాహాన్ని తీసుకొచ్చాయని అంటున్నారు. కానీ ప్రస్తుత అజెండా మాత్రం మిషన్ కాకతీయ మీదే అని చెప్పొచ్చు. అయితే గతంలోనే మిషన్ కాకతీయ ప్రాజెక్ట్ కు తమ మద్దతు ప్రకటించినా... స్టీరింగ్ కమిటీలోని సంఘాల మధ్య మాత్రం ఏకాభిప్రాయం సంపాదించలేకపోయింది.
తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా ఉన్న జేఏసీది కొంత కాలంగా మౌనమే. ప్రత్యేక రాష్ట్రం వచ్చిన తర్వాత జేఏసీ సరిగా కనిపించిందీ లేదు వినిపించిందీ లేదు! చాలా రోజుల తరువాత జేఏసీ స్టీరింగ్ కమిటీ మరలా సమావేశం అవుతుంది. సార్వత్రిక ఎన్నికలు ముగిసిన తరువాత... టీఆర్‌ఎస్‌కు, జేఏసీకి మధ్య దూరం బాగా పెరిగడంతో... టీఎన్జీఓ నేతలు గతంలోలాగా ఇప్పుడు జేఏసీలో యాక్టివ్‌గా పనిచేస్తారా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి! కేసీఆర్‌ పది నెలల పాలనపై అప్పుడప్పుడూ విమర్శలు చేస్తున్న మేధావులు, నేతలు... తమ స్టాండ్‌ ఏంటో స్పష్టం చేసే సమయం వచ్చిందన్న చర్చకు టీజేఏసీ బలమైన పునాది వేయాలని మాత్రం చూస్తుంది.
ప్రభుత్వం ఏర్పాటై పది నెలలు గడిచిన నేపథ్యంలో ఇకపై తమ వైఖరేమిటో చెప్పాలని... ముఖ్యంగా రైతుల ఆత్మహత్యలు, నిరుద్యోగుల సమస్యలపై గళమెత్తాలనే ఆలోచనతో జేఏసీ ఉన్నాట్లు సమాచారం. ఇప్పటికిప్పుడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా వ్యవహరించటం కంటే సలహాలు, సూచనలు ఇచ్చే ప్రయత్నం చేయాలని వారిలో కొందరు సన్నాయి నొక్కులు నొక్కుతున్నారట. ఇలా భిన్నాభిప్రాయాల పెద్దలతో నిందిన జేఏసీ ఏ రకంగా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువస్తుందో వేచి చూడాలి.