Begin typing your search above and press return to search.

ఐపీఎస్ భార్య స్టేడియంకు వెళితే..ఎవ‌రూ ఉండ‌కూద‌ట‌

By:  Tupaki Desk   |   29 Oct 2017 10:00 AM GMT
ఐపీఎస్ భార్య స్టేడియంకు వెళితే..ఎవ‌రూ ఉండ‌కూద‌ట‌
X
అధికారం ఎప్పుడూ ఆభ‌ర‌ణం ఎంత మాత్రం కాదు. ఒక‌వేళ అలా ఫీలైతే ఎలా ఉంటుంద‌న‌టానికి తాజా ఉదంతం నిలువెత్తు నిద‌ర్శ‌నంగా చెప్పాలి. చేతికి ద‌క్కిన అవ‌కాశాన్ని ఎంత‌లా దుర్వినియోగం చేసుకుంటారో తెలియ‌జేసే వైనంగా చెప్పాలి. కీల‌క‌స్థానాల్లో ఉన్న వారు మ‌రింత బాధ్య‌త‌గా వ్య‌వ‌హ‌రించాల్సింది పోయి.. త‌మ ప‌వ‌ర్ చూపించే ప్ర‌య‌త్నం చేయ‌టం గ‌మ‌నార్హం.

ఇలాంటి తీరును ప్ర‌ద‌ర్శించిన క‌ర్ణాట‌క‌కు చెందిన ఐపీఎస్ అధికారిపై పెద్ద ఎత్తున విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. క‌ర్ణాట‌క‌కు చెందిన ఐపీఎస్ అధికారి పెట్టిన కొత్త రూల్ వింటే అవాక్కు అవ్వాల్సిందే. క‌ర్ణాట‌క‌లోని కంఠీర‌వ స్టేడియంకు ఎప్ప‌టి మాదిరి ప్రాక్టీస్ చేయ‌టానికి జాతీయ అథ్లెట్లు చేరుకున్నారు. అదే స‌మ‌యానికి కంఠీర‌వ స్టేడియం డైరెక్ట‌ర్‌.. క‌మ్ ఐపీఎస్ అధికారి అనుప‌మ్ అగ‌ర్వాల్ స‌తీమ‌ణి స్టేడియంలో ప్రాక్టీస్ చేస్తున్నారు.

దీంతో ఆమెకు ఇబ్బంది క‌లుగ‌కుండా ఉండేందుకు మిగిలిన వారిని స్టేడియం బ‌య‌ట‌కు పంపేశారు. దీంతో మాట్లాడ‌లేని క్రీడాకారులు స్టేడియం బ‌య‌ట‌కు వ‌చ్చేసి.. ద‌గ్గ‌ర్లోని క‌బ్బ‌న్ పార్కులో ప్రాక్టీస్ చేశారు. ఈ తీరుపై తీవ్ర విమ‌ర్శ‌లు వెల్లువెత్తున్నాయి.

దీనిపై పోలీసుల‌కు కంప్లైంట్ ఇవ్వ‌టానికి ఎవ‌రైనా పోలీస్ స్టేష‌న్ కు వ‌స్తే ఫిర్యాదులు తీసుకోవ‌ద్దంటూ పోలీసుల‌కు చెప్పిన‌ట్లుగా చెబుతున్నారు. ఈ ఉదంతం ఇప్పుడు సంచ‌ల‌నంగా మారింది. ఎంత ఐపీఎస్ అధికారి స‌తీమ‌ణి అయితే మాత్రం పార్కుకు వ‌స్తే ఎవ‌రూ ఉండ‌కూద‌నుకోవ‌టం ఏమిటో?

ఈ ఉదంతం మీడియాలో ప్ర‌ముఖంగా రావ‌టంతో క‌ర్ణాట‌క క్రీడా శాఖ‌మంత్రి ప్ర‌మోద్ మ‌ధ్య‌రాజ్ స్పందించారు. స్టేడియం ఎవ‌రి సొత్తు కాద‌ని.. అన్నింటికి మించిన ఐపీఎస్ అధికారి అనుప‌మ్ సొత్తు అంత‌కంటే కాదంటూ ఘాటుగా రియాక్ట్ అయ్యారు. స్టేడియం ప్ర‌జ‌ల‌ద‌ని.. ఇలాంటి తీరును స‌హించ‌మ‌ని.. విచార‌ణ జ‌రిపిస్తామ‌ని చెబుతున్నారు.