Begin typing your search above and press return to search.

సీఎం ష‌ర‌తుః కట్నం తీసుకోకపోతేనే పెళ్లికి వ‌స్తా!

By:  Tupaki Desk   |   10 Oct 2017 2:10 PM GMT
సీఎం ష‌ర‌తుః కట్నం తీసుకోకపోతేనే పెళ్లికి వ‌స్తా!
X
ప్ర‌స్తుత కాలంలో వివాహాలు అంటే హంగు - ఆర్భాటాల‌కు కేరాఫ్ అడ్ర‌స్‌ గా మారిన సంగ‌తి తెలిసిందే. ఎంత అట్ట‌హాసంగా వీలైతే అంత సంబురంగా పెళ్లిని జ‌రుపుకోవాల‌ని చాలా మంది ఆశిస్తున్నారు. ఈ క్ర‌మంలో గెస్టుల‌ను పిలిచే సంస్కృతి కూడా బాగానే పెరిగింది. ఓ ఎమ్మెల్యే లేదా ఎంపీ స్థాయి వ్య‌క్తి వ‌స్తే ఆ వివాహం జ‌రిగే వారి ఇంట్లో ఉండే సంతోష‌మే వేరు. అదే స‌మ‌యంలో ముఖ్య‌మంత్రే వివాహానికి వ‌స్తానంటే..నిజంగా చాలా తీపి క‌బురు క‌దా? అలా వివాహానికి వ‌చ్చేందుకు ఓ సీఎం ఒప్పుకున్నారు. అయితే అందుకు త‌న‌దైన శైలిలో ఓ ష‌ర‌తు పెట్టారు. ఆయ‌నే బీహార్ ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్.

ప్రతి వారం నిర్వహించే లోక్‌ సంవాద్ కార్యక్రమంలో పాల్గొన్న బీహార్ ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్ అనంత‌రం మీడియాతో మాట్లాడారు. త‌న‌ను ఎంతో మంది వివాహాల‌కు ఆహ్వానిస్తున్నార‌ని...వాటికి వెళ్లేందుకు తాను కూడా సిద్ధంగా ఉన్నాన‌ని తెలిపారు. అయితే...త‌న‌ను పెళ్లికి పిలిచేవారు వరకట్నం తీసుకోలేదని అందరిముందు ప్రకటించాలని బీహార్ ముఖ్యమంత్రి ష‌ర‌తు పెట్టారు. కట్నం తీసుకుంటున్న వారి పెళ్లిళ్లకు హాజరుకావద్దని ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ ప్రచారానికి మద్దతుగా వచ్చే జనవరి 21న మానవహారం నిర్మించనున్నట్టు బీహార్ ముఖ్య‌మంత్రి తెలుప‌డం గ‌మ‌నార్హం. అక్టోబ‌ర్ 2వ తేదీన నితీశ్‌ వ‌ర‌క‌ట్నం - బాల్య‌వివాహాల‌కు వ్య‌తిరేకంగా ప్రచారం మొద‌లుపెట్టారు. దానికి కొన‌సాగింపు అన్న‌ట్లుగా ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు స‌మాచారం.

ఈ సంద‌ర్భంగా త‌న వివాహం గురించి కూడా నితీశ్ కుమార్ వెల్ల‌డించ‌డం గ‌మ‌నార్హం. తన పెళ్లి 1973లో జరిగిందని, తాను కట్నం తీసుకోలేదని ఒక ప్రశ్నకు బదులుగా నితీశ్ కుమార్‌ చెప్పారు. మహిళలపై జరుగుతున్న నేరాల్లో బీహార్ 26వ స్థానంలో ఉన్నదని - వరకట్న వేధింపులు - మరణాల్లో ఉత్తరప్రదేశ్ తర్వాత రెండోస్థానంలో ఉన్నదని వివరించారు. 2016 లో దేశవ్యాప్తంగా వరకట్న కేసులు 4,852 నమోదుకాగా.. బీహార్‌లో 987 నమోదయ్యాయని తెలిపారు. అందుకు ఈ మ‌హ‌మ్మారిని దూరం చేయాల‌ని కోరారు.