Begin typing your search above and press return to search.

త్రిశూలాల‌తో ఆ 75 మంది హ‌ల్‌ చ‌ల్

By:  Tupaki Desk   |   15 Jun 2017 6:55 AM GMT
త్రిశూలాల‌తో ఆ 75 మంది హ‌ల్‌ చ‌ల్
X
గ‌త ఏడాది క‌ల‌క‌లం రేకెత్తించిన ల‌వ్ జిహాద్ మ‌రోరూపంలో తెర‌మీద‌కు వ‌చ్చింది. అయితే ఈ ద‌ఫా మ‌రో రూపంలో - అది కూడా వ్య‌తిరేక గ‌ళంతో వార్త‌ల్లో నిలిచింది. గుజరాత్‌ లోని గాంధీనగర్‌ లో ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో 75 మంది యువకులకు భజరంగ్‌ దళ్‌ సభ్యులు త్రిశూలాలు పంపిణీ చేశారు. ఆవులను కాపాడటం - లవ్‌ జిహాద్‌ పై పోరాటం - రోమియో వ్యతిరేక బృందాలుగా పనిచేయడమే ఈ త్రిశూలాల పంపిణీ ఉద్దేశమట. 'గత రెండున్న రేళ్ల‌ కాలంలో ఒక్క గాంధీనగర్‌ నగరంలోనే దాదాపు నాలుగువేల త్రిశూలాలను యువతకు పంపిణీ చేశాం' అని వీహెచ్‌ పీ ప్రధాన కార్యదర్శి మహదేవ్‌ దేశారు ఓ జాతీయ వార్తా సంస్థతో చెప్పారు.

త్రిశూలాల పంపిణీపై మ‌హ‌దేవ్ ఆస‌క్తిక‌ర‌మైన వివ‌ర‌ణ ఇచ్చారు. `ఇంట్లో షోకేస్‌ లలో పెట్టుకునేందుకు మేము ఈ త్రిశూలాలను పంపిణీ చేయలేదు. వారికి స్పష్టమైన ఆదేశాలిచ్చాం. వాటిని వారు ఎప్పుడూ తమతో ఉంచుకోవాలి. ఇవి నిషేధిత ఆయుధాల కంటే ఒక సెంటీమీటరు చిన్నగా ఉంటాయి. ఆవులను కాపాడటానికి ఇది ఉపయోగించవచ్చు. గుజరాత్‌ లో అనేక ఆవులను చంపేశారు. ఈ నేరాలను ఆపడంలో పోలీసులు విఫలమయ్యారు. దీనికి వ్యతిరేకంగా హిందూ యువకులు పోరాడాల్సిన సమయం ఆసన్న మైంది. అంతేకాదు, లవ్‌ జిహాద్‌ ని నియంత్రించేందుకు కృషి చేస్తున్నాం. నగరంలో విద్యాసంస్థల చుట్టూ రోమియో వ్యతిరేక బృందాలను ఏర్పాటు చేస్తున్నాం``అని మహదేవ్‌ దేశారు చెప్పారు. దీనిపై గాంధీనగర్‌ పోలీసు సూపరింటెండెంట్‌ వీరేంద్రసిన్హా యాదవ్‌ ను వివరణ కోరగా... బహిరంగ ప్రదేశాల్లో త్రిశూలాలను పెట్టుకొని తిరిగినట్టు తమ దృష్టికి వస్తే అలాంటి వారిపై చర్య తీసుకుంటామని అన్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/