Begin typing your search above and press return to search.

అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్ళాలట

By:  Tupaki Desk   |   6 July 2021 7:30 AM GMT
అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్ళాలట
X
ఒకవైపు కృష్ణా జలాలను తెలంగాణా ప్రభుత్వం అక్రమంగా వాడేసుకుంటోందని ఏపి ప్రభుత్వం గోల చేస్తుంటే అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్ళాలని చంద్రబాబునాయుడు డిమాండ్ చేయటం విచిత్రంగా ఉంది. శ్రీశైలం ప్రాజెక్టు నుండి తెలంగాణా ప్రభుత్వం అక్రమంగా విద్యుత్ ఉత్పత్తి కోసం వాడేసుకుంటోందని, మిగిలిన నీటిని సముద్రంలోకి విడిచేస్తోందని జగన్మోహన్ రెడ్డి కేంద్రప్రభుత్వానికి పదే పదే లేఖలు రాస్తున్నారు. జల వినియోగంపై తెలంగాణా ప్రభుత్వం ఏకపక్ష నిర్ణయం వల్ల వివాదం రోజు రోజుకు పెరిగిపోతోంది.

నిబంధలనకు విరుద్ధంగా, గతంలో జరిగిన నిర్ణయాలను తుంగలోతొక్కుతున్న కేసీయార్ ను చంద్రబాబు కానీ టీడీపీ నేతలు కానీ ఒక్కమాట కూడా మాట్లాడటంలేదు. ఏపి అన్యాయం చేస్తున్న కేసీయార్ ను నిలదీసే ధైర్యం చేయటంలేదు. పైగా జగన్ పైనే నోటికొచ్చింది మాట్లాడుతున్నారు. ఇక్కడ జగన్ చేతకానితనం కన్నా కేసీయార్ తెంపరితనమే ఎక్కువుంది.

ఇదే సమయంలో గతంలో చంద్రబాబు చొరవవల్లే గతంలో పెంచాలని అనుకున్న ఆల్మట్టి ప్రాజెక్టు ఎత్తును కర్నాటక ప్రభుత్వం ఆపేసిందని టీడీపీ నేతలు చెప్పటం విచిత్రంగా ఉంది. ఈ విషయంలో టీడీపీ నేతలు చెప్పింది పూర్తిగా అబద్ధం. దేవేగౌడ ప్రధానమంత్రిగా ఉన్నపుడు కర్నాటక ప్రభుత్వం ఆల్ మట్టి ప్రాజెక్టు ఎత్తు పెంచుతుంటే చంద్రబాబు పట్టించుకోలేదు. దాంతోనే కృష్ణా జలాల వినియోగంలో ఏపికి సమస్యలు మొదలయ్యాయి.

అంతర్రాష్ట్ర సమస్యలపై కేసీయార్ ను నిలదీసే ధైర్యంలేక జగన్నే తప్పుపడుతున్న చంద్రబాబు మళ్ళీ ఢిల్లీకి అఖిలపక్షాన్ని తీసుకెళ్ళాలని డిమాండ్ చేయటంలో అర్ధమేలేదు. ఏ అవకాశం దొరికినా జగన్ పై బురదచల్లాలని మాత్రమే చూస్తున్న చంద్రబాబు ఢిల్లీకి వెళితే మాత్రం కేసీయార్ కు వ్యతిరేకంగా మాట్లాడుతారా ?

తాను సీఎంగా ఉన్నరోజుల్లో ప్రతిపక్షాలు అఖిలపక్ష సమావేశాల కోసం చేసిన డిమాండ్లను చంద్రబాబు ఏనాడైనా పట్టించుకున్నారా ? అధికారంలో ఉన్నపుడు తాను చేయని పనులను ప్రతిపక్షంలోకి రాగానే కావాలని ఎలా కోరుకుంటున్నారో ? పోనీ ప్రస్తుత సమస్యలో కేసీయార్ ను తప్పుపడుతు మాట్లాడినా, లేకపోతే జగన్ కు మద్దతుగా నిలబడినా ఢిల్లీకి అఖిలపక్షాన్ని తీసుకెళ్ళమని అడిగే అవకాశం ఉంది. అదేమీ లేకుండా ఒకవైపు జగన్నే తప్పుపడుతు మరోవైపు అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్ళాలని డిమాండ్ చేయటం టీడీపీకే చెల్లింది.