Begin typing your search above and press return to search.

తమిళనాడులో ఈరోజు ఏమైందంటే..

By:  Tupaki Desk   |   10 Feb 2017 1:28 PM GMT
తమిళనాడులో ఈరోజు ఏమైందంటే..
X
-త‌మిళ‌నాడులో రాజ‌కీయ మ‌లుపులు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి. ఆపద్ధర్మ సీఎం ప‌న్నీరు సెల్వం - అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శ‌శిక‌ళ‌తో గురువారం గ‌వ‌ర్న‌ర్‌ భేటీ అయినా ఆయన ఇప్ప‌టి వ‌ర‌కు ఎట‌వంటి నివేదిక‌ను ఇవ్వ‌లేదు. దీంతో త‌మిళ ప్ర‌జ‌లు తీవ్ర ఉత్కంఠకు లోన‌వుతున్నారు. అసెంబ్లీలో బ‌లాన్ని నిరూపించేందుకు ప‌న్నీరుకు అవకాశం ఇస్తారా లేక‌ - సీఎంగా బాధ‌త్య‌లు స్వీక‌రించేందుకు శ‌శిక‌ళ‌కు ఛాన్సు ఇస్తారా అని గ‌వ‌ర్న‌ర్ రిపోర్ట్‌ కోసం అంద‌రూ ఎదురుచూస్తున్నారు.

-సాయంత్రం వ‌ర‌కు కూడా గ‌వ‌ర్న‌ర్ విద్యాసాగ‌ర్ రావు ఆ రాష్ట్ర ప‌రిస్థితిపై త‌మ‌కు ఎటువంటి నివేదిక ఇవ్వ‌లేద‌ని కేంద్ర హోంశాఖ పేర్కొంది. ఒక‌వేళ ఎమ్మెల్యేలు నిర్భందంలో ఉన్నార‌ని తెలిస్తే, కేంద్ర బ‌ల‌గాల‌ను రంగంలోకి దింపేందుకు గ‌వ‌ర్న‌ర్ ఆస‌క్తిగా ఉన్నార‌ని సీఎం ప‌న్నీరు సెల్వం తెలిపారు. మ‌రోవైపు సీనియ‌ర్ మంత్రుల‌తో శ‌శిక‌ళ కాసేప‌ట్లో పోయెస్ గార్డెన్‌ లో స‌మావేశంకానున్నారు. శ‌శిక‌ళ త‌ర‌పున మ‌ద్ద‌తు ఇస్తున్న ఎమ్మెల్యేలు అంతా ప్ర‌స్తుతం గోల్డెన్ బే రిసార్ట్స్‌లో ఉన్నారు. వాళ్ల‌ను ఆమెను ఇవాళ క‌లుసుకున్నారు.

- అన్నాడీఎంకే ఎమ్మెల్యేల‌ను శ‌శిక‌ళ నిర్భందించార‌ని వ‌చ్చిన ఆరోప‌ణ‌ల‌పై అఫిడ‌విట్ దాఖ‌లు చేయాల‌ని త‌మిళ‌నాడు పోలీసుల‌ను మ‌ద్రాసు హైకోర్టు ఆదేశించింది. ప్ర‌స్తుతం వంద‌కు మంది పైగా ఎమ్మెల్యేలు శ‌శిక‌ళ క్యాంపులో ఉన్నారు. వాళ్లంతా ఓ రిసార్ట్‌ లో ఉన్నారు. గురువారం రాత్రి గ‌వ‌ర్న‌ర్ విద్యాసాగ‌ర్ రావును శ‌శిక‌ళ క‌లిసిన త‌ర్వాత ప‌న్నీరు సెల్వం ఆ అంశంపై మాట్లాడారు. ఎమ్మెల్యేల‌ను అక్ర‌మంగా బంధించార‌ని ఆయ‌న ఆరోపించారు. ఎమ్మెల్యేల సంతకాలు కూడా ఫోర్జ‌రీ చేసిన‌వే అన్నారు. త‌న‌ను బ‌ల‌వంతంగా సీఎం ప‌ద‌వికి రాజీనామా చేయించార‌ని, అసెంబ్లీలో బ‌ల‌నిరూప‌ణ‌కు త‌న‌కు అయిదు రోజులు గ‌డువు ఇవ్వాల‌ని ప‌న్నీరు సెల్వం గ‌వ‌ర్న‌ర్‌ ను కోరిన‌ట్లు తెలుస్తున్న‌ది. ఎమ్మెల్యేలు చేసిన సంత‌కాల‌ను అన్నాడీఎంకే పార్టీ అధికారి దృవీక‌రించాల్సిన అవ‌స‌రం ఉంద‌ని గ‌వ‌ర్న‌ర్ పేర్కొన్న‌ట్లు అధికార వ‌ర్గాలు ద్వారా తెలుస్తోంది.

- సుప్రీంకోర్టులోనూ జ‌య అక్ర‌మాస్తుల కేసుపై త్వ‌ర‌గా తీర్పును వెల్ల‌డించాల‌ని వేసిన పిటీష‌న్‌ ను అత్యున్న‌త న్యాయ‌స్థానం తిర‌స్క‌రించింది.

--రాష్ట్రంలోని శాంతిభ‌ద్ర‌త‌ల అంశంపై కొద్దిసేప‌టి క్రితం గ‌వ‌ర్న‌ర్‌తో డీజీపీ రాజేంద్ర‌న్ భేటీ అయ్యారు. ఎమ్మెల్యేలను నిర్భంధించిన అంశం నిజమేనా అని డీజీపీని గవర్నర్ ప్రశ్నించారు. అయితే ఈ అంశాన్ని తేల్చేందుకు డీజీపీ కాసేట్లో రిసార్ట్ కు వెళ్లనున్నారు. స్వయంగా రాష్ట్ర పోలీసు అత్యున్నతాధికారి అయిన డీజీపీ టీకే రామచంద్రన్ నేతృత్వంలో ప్రత్యేక పోలీసు బృందం గోల్డెన్ బే రిసార్టుల వద్దకు బయల్దేరింది. కాంచీపురం జిల్లాలోని మహాబలిపురం సమీపంలో సముద్రంలో గల ఒక దీవిలో ఉన్న ఈ రిసార్టులోనే అన్నాడీఎంకే ఎమ్మెల్యేలందరినీ దాచిపెట్టారని భావిస్తున్నారు.

- గోల్డెన్ బే రిసార్ట్స్‌లో ఉంచిన ఏఐఏడీఎంకే ఎమ్మెల్యేలను బయటి వ్యక్తులతో మాట్లాడకుండా మొబైల్ జామర్లను ఏర్పాటు చేసిన శశికళ వర్గం... లోపలికి ఎవరినీ అనుమతించడం లేదు. కొత్తగా రూమ్స్ బుక్ చేసుకునేందుక కూడా ఎవరినీ రానివ్వడం లేదు. దీంతో మీడియా ప్రతినిధులు పెద్ద ఎత్తున రిసార్ట్స్ బయట నిలబడాల్సిన పరిస్థితి నెలకొంది.

-అన్నాడీఎంకే కీల‌క నేత మ‌ధుసూద‌న‌న్‌ను ఆ పార్టీ నుంచి తొలిగించారు. అన్నాడీఎంకే ప్రిసీడియం చైర్మ‌న్‌ గా ఉన్న మ‌ధుసూద‌న‌న్‌ ను తొలిగిస్తున్న‌ట్లు శ‌శిక‌ళ వ‌ర్గం పేర్కొంది. అత‌న్ని పార్టీ ప్రాథ‌మిక స‌భ్య‌త్వం నుంచి కూడా త‌ప్పిస్తూ అత‌ని స్థానంలో కేఏ సెంగొట్ట‌యాన్‌ ను నియ‌మించారు. సీఎం ప‌న్నీరు సెల్వంకు మ‌ద్ద‌తుగా మ‌ధుసూద‌న‌న్ ప్ర‌క‌ట‌న చేయ‌డంతో ఆయ‌న‌పై వేటు ప‌డిన‌ట్లు తెలుస్తోంది. మరికాసేప‌ట్లో గ‌వ‌ర్న‌ర్ విద్యాసాగ‌ర్ రావు ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసే అవ‌కాశాలున్నాయి.

--‍ ఇదే స‌మ‌యంలో ఎమ్మెల్యేలను రహస్య స్థావరాల్లో దాచి గవర్నర్ పిలుపు ఎప్పుడు వస్తుందా? ముఖ్యమంత్రి పీఠం ఎప్పుడు అధిరోహిద్దామా? అని ఎదురుచూస్తున్న శశికళపై నెటిజన్ల దాడి అంతకంతకూ తీవ్రమవుతోంది. మరోవైపు ఆపద్ధర్మ సీఎం పన్నీర్‌ సెల్వం శిబిరం వైపు మళ్లుతున్న అన్నాడీఎంకే సభ్యుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో సీనియర్ తమిళ నటుడు అరవిందస్వామి ఆన్‌ లైన్లో కాల్ యువర్ లామేకర్ (ఎమ్మెల్యేలకు ఫోన్ చేయడం) ప్రచారోద్యమాన్ని చేపట్టారు. ఆయన ఎమ్మెల్యేల పేర్లు - ఫోన్ నంబర్లు ట్విట్టర్లో పెట్టారు. అయితే పలువురు ఆ నంబర్లకు ఫోన్ చేస్తే స్విచ్ఛాఫ్ అనో, కాల్‌ డైవర్ట్ అనో రావడం గమనార్హం. అరవిందస్వామి తరహాలో ఇతరులు కూడా ఆన్‌ లైన్ ప్రచారాన్ని చేపట్టారు. సెల్వంకు మద్దతుగా నిలిచినందుకు శశికళ ఉద్వాసన పలికిన అన్నాడీఎంకే ఐటీ సెల్ బృందం సభ్యులూ కాల్ యువర్ లామేకర్ ప్రచారంలో పాల్గొంటున్నారు.

- 'సీఎంవో తమిళనాడు' వేదికగా జరిగిన ట్విట్టర్ వార్ లో తమిళనాడుకు నాయకత్వం వహించడానికి పన్నీర్ సెల్వం కొనసాగాలని 95 శాతం నెటిజన్లు తమ మద్ధతు తెలుపుతూ ఓటేశారు. కేవలం 5శాతం మంది మాత్రమే పన్నీర్ కు వ్యతిరేకంగా పోల్ సర్వేలో ఓటేశారు. త‌ద్వారా ఐదు శాతం మంది మాత్రమే శశికళ సీఎం కావాలని కోరుకుంటున్నారు. మొత్తంగా 52,876 మంది తమ అభిప్రాయాన్ని వెల్లడించి ఈ సర్వేలో పొల్గొన్నారు. .

- త‌మిళ‌నాడు సీఎంగా శ‌శిక‌ళ ప్ర‌మాణ స్వీకారం చేయ‌కుండా ఆదేశాలు జారీ చేయాలంటూ దాఖ‌లైన పిటిష‌న్‌పై అత్య‌వ‌స‌ర విచార‌ణ చేప‌ట్టేందుకు సుప్రీంకోర్టు నిరాక‌రించింది. చీఫ్ జ‌స్టిస్ జేఎస్ ఖేహార్ నేతృత్వంలోని ధ‌ర్మాస‌నం ముందు ఈ పిటిష‌న్‌ను లేవ‌నెత్తారు అడ్వొకేట్ జీఎస్ మ‌ణి. దీనిపై ధ‌ర్మాస‌నంలోని స‌హ‌చ‌ర న్యాయ‌మూర్తులు జ‌స్టిస్ ఎన్వీ ర‌మ‌ణ‌, జ‌స్టిస్ చంద్ర‌చూడ్‌ ల‌తో చ‌ర్చించిన ఖేహార్‌.. అత్య‌వ‌స‌ర విచార‌ణ‌కు స్వీక‌రించ‌డానికి నిరాక‌రించారు.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/