Begin typing your search above and press return to search.

ఈరోజు సూర్యగ్రహణం.. ఏ రాశివారికి ఎలాంటి ఫలితాన్ని ఇవ్వనుందా?

By:  Tupaki Desk   |   25 Oct 2022 4:06 AM GMT
ఈరోజు సూర్యగ్రహణం.. ఏ రాశివారికి ఎలాంటి ఫలితాన్ని ఇవ్వనుందా?
X
సూర్య గ్రహణం.. చంద్రగ్రహణం.. ఈ రెండు ఎప్పుడు వచ్చినా.. వాటి మీద జరిగే చర్చ అంతా ఇంతా కాదు. గ్రహణం వేళ తీసుకోవాల్సిన జాగ్రత్తలతో పాటు.. కొన్ని రాశుల వారికి సదరు గ్రహణం ఏ మాత్రం సరిగా ఉండదని.. అందుకుతగ్గ శాంతులు.. పూజలు చేయాలన్న మాటలు వినిపిస్తూ ఉంటాయి. ఈ రోజు (మంగళవారం) సాయంత్రం చోటు చేసుకునే సూర్య గ్రహణం కారణంగా.. దీపావళి పండుగే మారిపోయిన సంగతి తెలిసిందే.

లెక్క ప్రకారం చూస్తే.. మంగళవారం దీపావళి పర్వదినాన్ని జరుపుకోవాల్సి ఉంది. అయితే.. మంగళవారం సూర్య గ్రహణం కావటంతో ఒక రోజు ముందుగానే పండుగను నిర్వహించుకోవాల్సిన అవసరం ఉందన్న విషయాన్ని పండితులు తేల్చేయటంతో సోమవారమే అందరూ పండుగను నిర్వహించుకున్నారు.

అందుకు తగ్గట్లే సెలవు సైతం మారిపోయింది. ఇక.. గ్రహణం విషయానికి వస్తే.. ఈ రోజు సాయంత్రం 5.01 గంటలకు మొదలయ్యే గ్రహణం 6.26 గంటల వరకు సాగనుంది. ప్రాంతాలకు అనుగుణంగా కొంత సమయంలో మార్పు ఉంటుందనుకోండి.

గ్రహణ మధ్య కాలం సాయంత్రం 5.29 గంటలు కాగా.. గ్రహణ పుణ్యకాలం 1.25 గంటలు. ఈసారి గ్రహణం స్వాతి నక్షత్రం వేళలో సంభవించటం కారణంగా తులరాశి వారు ఈ గ్రహణాన్ని చూడకుండా ఉండటమే మంచిదన్న విషయాన్ని పండితులు చెబుతున్నారు. ఎప్పటిలానే గ్రహణానికి రెండు మూడు గంటల ముందు.. తర్వాత ఆహారాన్ని తినకూడదన్న నియమానికి తగ్గట్లే.. మధ్యాహ్నం 3 గంటల నుంచి 10 గంటల మధ్యలో ఏమీ తినకుండా ఉండటం చాలా మంచిదన్న విషయాన్ని స్పష్టం చేస్తున్నారు.

ఈసారి సూర్యగ్రహణం సందర్భంగా సింహ.. వ్రషభ.. మకర.. ధనస్సు రాశుల వారికి శుభ ఫలితాన్ని ఇస్తుందని.. కన్య.. మేషం.. కుంభం.. మిథునం.. రాశుల వారికి మధ్యస్త ఫలితాలు ఉంటాయని చెబుతున్నారు.

తుల.. కర్కాటక.. మీన.. వ్రశ్చిక రాశుల వారికి మాత్రం కీడు జరిగే అవకాశం ఉంటుందని స్పష్టం చేస్తున్నారు. మిగిలిన రాశుల వారితో పోలిస్తే.. ఆశుభానికి అవకాశం ఉన్న తుల.. కర్కాటక.. మీన.. వ్రశ్చిక రాశుల వారు మాత్రం పట్టువిడుపు స్నానాలతోపాు.. సూర్య ఆరాధన చేసుకోవటం.. రాహు జపం.. దూర్గాదేవి ఆరాధన చేయటం లాంటివి చేయటం ద్వారా దోష నివారణ జరుగుతుందని చెబుతున్నారు. మరిన్ని సందేహాలు ఉన్న వారు వారికి నమ్మకం ఉన్న పండితులను అడిగిన డౌట్లను తీర్చుకోవటం మంచిది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.