Begin typing your search above and press return to search.

టోక్యో ఒలంపిక్స్: 10వ రోజు హైలెట్స్ 'సెమీస్‌ లో భారత మహిళల హాకీ జట్టు

By:  Tupaki Desk   |   3 Aug 2021 4:32 AM GMT
టోక్యో ఒలంపిక్స్: 10వ రోజు హైలెట్స్ సెమీస్‌ లో  భారత మహిళల హాకీ జట్టు
X
టోక్యో ఒలింపిక్స్‌ లో భారత హాకీ అమ్మాయిల అద్భుత ప్రదర్శనతో సోమవారం(ఆగస్టు 2) ఘనంగా ప్రారంభమైంది. క్వార్టర్స్ లో పటిష్ట ఆస్ట్రేలియాను చిత్తు చేసిన మన అమ్మాయిలు ఒలింపిక్స్ చరిత్రలోనే తొలిసారి సెమీఫైనల్‌ చేరి చరిత్ర సృష్టించారు. కానీ మిగతా ఈవెంట్లలో మాత్రం భారత్‌ కు నిరాశే ఎదురైంది. ఫైనల్ చేరి పతక ఆశలు రేకెత్తించిన మహిళల డిస్కస్ త్రోయర్ కమల్‌ ప్రీత్ కౌర్, ఈక్వెస్ట్రెయన్ ప్లేయర్ ఫవాద్ మీర్జా కీలక ఫైనల్లో తడబడి తీవ్రంగా నిరాశపరిచారు. భారత స్టార్ స్ప్రింటర్ ద్యుతీ చంద్, షూటర్స్ సంజీవ్, ప్రతాప్ సింగ్ సైతం చేతులెత్తేసారు. ఫలితంగా భారత్ పతకం లేకుండానే 10వ రోజును ముగించింది.

లీగ్‌ దశలో వరుసగా, చిత్తుగా మ్యాచులు ఓడిన భారత హాకీ జట్టు అమ్మాయిలు ఆపై వరుస విజయాలతో దూసుకెళ్తున్నారు. సోమవారం వరల్డ్ నెంబర్ 2 ఆస్ట్రేలియాను 1-0తో మట్టికరిపించి ఒలింపిక్స్ చరిత్రలో తొలిసారి సెమీఫైనల్‌ కు చేరారు. క్వార్టర్‌ ఫైనల్లో ఇరు జట్లు హోరాహోరీగా తలపడ్డాయి. దుర్భేద్యమైన డిఫెన్స్‌ కు మారుపేరైన ఆసీస్‌ పై భారత మహిళలకు ఒకే ఒక్క పెనాల్టీ కార్నర్‌ లభించింది. 22వ నిమిషంలో దొరికిన ఈ బంగారు అవకాశాన్ని గుర్జీత్‌ కౌర్‌ అందిపుచ్చుకొని గోల్‌ గా మలిచింది. దాంతో భారత్ 1-0తో లీడ్‌ లోకి వెళ్లింది. ఇక భారత గోల్‌ కీపర్‌ సవిత గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆసీస్‌ చేసిన 9 దాడులను సహచరులతో కలిసి ఆమె నిలువరించింది. ఏడు పెనాల్టీ కార్నర్లు, రెండు ఫీల్డ్‌ గోల్స్‌ ను అడ్డుకున్న ఆమె టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించింది. బుధవారం జరిగే సెమీస్‌ లో అర్జెంటీనాతో భారత్‌ మహిళల టీమ్ తలపడనుంది.

ఇక ,ఒలింపిక్స్‌ లో భారత్‌ కు మూడో పతకం సాధిస్తుందని ఆశించిన డిస్కస్‌ త్రో అథ్లెట్‌ కమల్‌ ప్రీత్‌ కౌర్‌ ఫైనల్స్‌ లో విఫలమైంది. మొత్తం 12 మంది పోటీపడిన ఈ పోటీల్లో ఆమె ఆరో స్థానంతో సరిపెట్టుకుంది. తొలిసారి ఒలింపిక్స్‌ కు అర్హత సాధించిన కమల్‌ప్రీత్‌ శనివారం జరిగిన సెమీఫైనల్స్‌ లో 64 మీటర్లతో అత్యద్భుత ప్రదర్శన చేసింది. కానీ ఫైనల్లో మాత్రం ఆ ప్రదర్శనను కూడా అందుకోలేకపోయింది. మొత్తం ఆరుసార్లు డిస్కస్‌ విసిరిన కమల్‌ ప్రీత్‌ అత్యుత్తమంగా 63.70 మీటర్లే విసిరింది. దాంతో 6వ స్థానంతో సరిపెట్టుకుంది.

టోక్యో ఒలింపిక్స్‌లో పతకం వస్తుందని ఆశలు రేకెత్తించిన మరో ఈవెంట్‌ ఈక్వెస్ట్రియన్‌. భారత ఆటగాడు ఫవాద్‌ మీర్జా ఫైనల్‌ కు అర్హత సాధించినా చివరి పోరులో ఓడిపోయాడు. ఈ క్రీడలో భారత్‌ నుంచి వ్యక్తిగత విభాగంలో ఫైనల్‌ చేరిన మొదటి ఆటగాడు అతడే కావడం గమనార్హం. అయితే, 23వ స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఒలింపిక్స్ ఈక్వెస్ట్రియన్‌ లో రెండు దశాబ్దాలుగా భారత్‌ కు ప్రాతినిధ్యం వహిస్తున్న ఏకైక ఆటగాడు ఫవాద్‌ మాత్రమే. ఇంతియాజ్‌ అనీస్‌ (సిడ్నీ 2000), దివంగత వింగ్‌ కమాండర్‌ ఐజే లాంబా (అట్లాంటా 1996) అంతకుముందు ఒలింపిక్స్‌ లో పాల్గొన్నారు. మహిళల 200 మీటర్ల హీట్-4 పరుగుపందెంలో భారత స్టార్ స్ప్రింటర్ ద్యుతీ చంద్ నిరాశపరిచింది. కెరీర్ బెస్ట్ టైమింగ్ నమోదు చేసినా ద్యుతీ ముందంజ వేయలేకపోయింది. 23:85 టైమింగ్‌తో ఏడో స్థానంలో నిలిచింది. ఒకటిన్నర సెకెను వ్యవధిలో ద్యుతీచంద్ సెమీ ఫైనల్స్‌ లో చోటు దక్కించుకునే అవకాశాన్ని కోల్పోయింది. టోక్యోలో మెడల్ లేకుండానే భారత షూటర్ల ప్రస్థానం ముగిసింది. సోమవారం జరిగిన పురుషుల 50 మీటర్ల రైఫిల్ 3 పొజిషన్స్ ఫైనల్లో సంజీవ్, ప్రతాప్ సింగ్ తీవ్రంగా నిరాశపరిచారు. 21, 31వ స్థానాలతో సరిపెట్టుకొని ఇంటిదారిపట్టారు.

ఇక మంగళవారం హైలెట్స్ విషయానికొస్తే ...

టోక్యో ఒలింపిక్స్ పురుషుల హాకీలో ఇండియ‌న్ జ‌ట్టు సెమీస్‌ లో ఓడింది. బెల్జియం చేతిలో దారుణ‌మైన ప‌రాజయాన్ని చవిచూసింది. హోరాహోరీగా సాగిన మ్యాచ్‌ లో బెల్జియం 5-2 గోల్స్ తేడాతో భార‌త్‌పై విజ‌యం సాధించి ఫైన‌ల్లో ప్ర‌వేశించింది. ఈ మ్యాచ్‌ లో ఓడిన ఇండియా , రెండ‌వ సెమీస్‌ లో ఓడిన జ‌ట్టుతో బ్రాంజ్ మెడ‌ల్ కోసం మ‌రో మ్యాచ్ ఆడాల్సి ఉంటుంది. నిజానికి తొలి క్వార్ట‌ర్ లో ఇండియా పైచేయి సాధించింది. ఫ‌స్ట్ హాఫ్‌లో మ‌న్‌దీప్ సింగ్‌, హ‌ర్మ‌న్‌ప్రీత్ సింగ్‌లు ఇండియాకు గోల్స్ చేశారు. అయితే బెల్జియం ఆట‌గాడు అలెగ్జాండ‌ర్ హెండ్రిక్స్ ఈ మ్యాచ్‌లో హ్యాట్రిక్ గోల్స్ చేశాడు. రెండ‌వ, మూడ‌వ‌ క్వార్ట‌ర్‌ లో ఇరు జ‌ట్లు గ‌ట్టిగా పోరాడాయి. కానీ చివ‌రి క్వార్ట‌ర్‌లో మాత్రం బెల్జియం త‌న స‌త్తా చాటింది. కాంస్య ప‌త‌కం కోసం ఆగ‌స్టు 5వ తేదీన ఇండియా మ‌రో మ్యాచ్ ఆడాల్సి ఉంటుంది. నేడు సాయంత్రం ఆస్ట్రేలియా, జ‌ర్మ‌నీ మ‌ద్య జ‌రిగే మ్యాచ్‌లో ఓడిన జ‌ట్టుతో భార‌త్ పోటీప‌డుతుంది.