Begin typing your search above and press return to search.

టోక్యో ఒలంపిక్స్ : సెమీఫైనల్ కి చేరిన భారత కుస్తీ వీరులు !

By:  Tupaki Desk   |   4 Aug 2021 7:30 AM GMT
టోక్యో ఒలంపిక్స్ : సెమీఫైనల్ కి చేరిన భారత కుస్తీ వీరులు !
X
టోక్యో ఒలింపిక్స్ 2020లో భారత కుస్తీవీరులు అదరగొట్టారు. బుధవారం జరిగిన క్వార్టర్ ఫైనల్స్‌ లో భారత రెజ్లర్లు శుభారంభం చేశారు. పురుషుల విభాగంలో రవి దహియా, దీపక్ పునియా విజయాలు సాధించగా.. మహిళల విభాగంలో అన్షు మాలిక్ నిరాశ పరిచినా.. మరో ఛాన్స్ ఉన్నది. రవి దహియా క్వార్టర్ ఫైనల్‌ లో జార్జి వలెటినోవ్‌ ను 14-4 తేడాతో విజయం సాధించి సెమీస్ చేరాడు. ఇక దీపక్ పునియా చైనాకు చెందిన లిన్ జుషెన్‌ పై 6-3 తేడాతో విజయం సాధించి సెమీ ఫైనల్ చేరాడు. ఇక అన్షు మాలిక్ తొలి రౌండ్‌లో ఇర్యానా కురచికినాపై ఓడిపోయింది. అయితే ఇర్యానా కురచికినా సెమీస్ చేరడంతో రిపిచేజ్ రూల్ కారణంగా మూడో స్థానం కోసం పోరాడే అవకాశం వచ్చింది.

23 ఏళ్ల ర‌వికుమార్ తొలిసారి ఒలింపిక్స్‌లో బ‌రిలోకి దిగాడు. మొద‌టి మ్యాచ్‌లో ప్ర‌తి రౌండ్‌లోనూ ర‌వికుమార్ ఆధిప‌త్యాన్ని ప్ర‌ద‌ర్శించాడు. బౌట్‌ను 13-2 స్కోర్ తేడాతో ద‌హియా మ్యాచ్‌ ను గెలిచాడు. 57 కేజీల పురుషుల రెజ్లింగ్‌ లో ర‌వికుమార్‌, ఆసియా చాంపియ‌న్‌. వ‌ర‌ల్డ్ చాంపియ‌న్‌ షిప్‌ లో బ్రాంజ్ మెడ‌ల్ కూడా గెలుచుకున్నాడు. ఆది నుంచి దూకుడు ప్ర‌ద‌ర్శించిన ద‌హియా, కొలంబియా రెజ్ల‌ర్‌ ను వ‌త్తిడిలో పెట్టాడు. సెకండ్ పీరియ‌డ్‌ లో టెక్నిక‌ల్ సుపీరియార్టీతో మ్యాచ్‌ ను 13-2 తేడాతో కైవ‌సం చేసుకున్నాడు. సెమీస్‌ లో క‌జికిస్తాన్‌ కు చెందిన నూర్ ఇస్లామ్ స‌నియోతో ర‌వికుమార్ త‌ల‌ప‌డ‌నున్నాడు. ఈ మ్యాచ్ మ‌ధ్యాహ్నం 2.45కు జ‌రుగుతుంది.

86 కిలోల ఫ్రీస్ట‌యిల్ రెజ్లింగ్‌లో దీప‌క్ పూనియా సెమీస్‌లోకి ప్ర‌వేశించాడు. క్వార్ట‌ర్స్‌లో అత‌ను చైనాకు చెందిన రెజ్ల‌ర్ సుషెన్ లిన్‌పై 6-3 స్కోర్‌తో దీప‌క్ గెలిచాడు. అంత‌కుముందు ఇవాళ ఉద‌యం ప్రీ క్వార్ట‌ర్స్‌లో నైజీరియా రెజ్ల‌ర్ ఎకెరికెమి అగియోమోర్‌ను ఓడించాడు. టెక్నిక‌ల్ సుపీరియార్టీ ప‌ద్ధ‌తిలో 12-1 స్కోర్ తేడాతో బౌట్‌ను దీప‌క్ గెలుచుకున్నాడు. మ‌హుహ‌రి మెస్సి స్టేడియంలో జ‌రిగిన రెజ్లింగ్ పోటీలో.. దీపక్ పూనియా పూర్తి ఆధిపత్యాన్ని ప్ర‌ద‌ర్శించాడు. ప్ర‌త్య‌ర్థికి ఎటువంటి ఛాన్స్ ఇవ్వ‌లేదు. టోక్యో ఒలింపిక్స్ ప్రారంభానికి ముందు మోచేతి గాయానికి లోనైన దీప‌క్ పూనియా, తొలి మ్యాచ్‌ లో కాస్త నెమ్మ‌దిగా ఆరంభించినా,ఆ త‌ర్వాత త‌న జోరును ప్ర‌ద‌ర్శించాడు. సెమీస్‌లో డేవిస్ మోరిస్‌ తో దీప‌క్ త‌ల‌ప‌డ‌నున్నాడు.

టోక్యో ఒలింపిక్స్ 2020 మహిళల బాక్సింగ్ 69 కేజీల విభాగంలో భారత బాక్సర్ లవ్లీనా బోర్గహైన్ సెమీఫైనల్‌ లో ఓడిపోయింది. దీంతో లవ్లీనాకు కాంస్య పతకం దక్కింది. బుధవారం సెమీఫైనల్‌ లో టర్కీకి చెందిన బుసెనాజ్ సుర్మెనెలితో తలపడింది. ప్రపంచ చాంపియన్ అయిన బుసెనాజ్ మొదటి నుంచి లవ్లీనా పై ఆధిపత్యం చెలాయించింది. మూడు బౌట్లలో బుసెనాజ్ 5-0 గెలిచినట్లు ప్రకటించారు.