Begin typing your search above and press return to search.

టోక్యో ఒలంపిక్స్.. కలవరపెడుతున్న కొత్త స్ట్రెయిన్!

By:  Tupaki Desk   |   28 May 2021 11:30 PM GMT
టోక్యో ఒలంపిక్స్.. కలవరపెడుతున్న కొత్త స్ట్రెయిన్!
X
జపాన్ దేశంలో త్వరలో జరగబోయే ఒలంపిక్స్ పెద్ద వివాదానికి దారి తీస్తోంది. ఈ క్రీడలను నిర్వహించవద్దని జపనీయులు భారీ ఎత్తున నిరసనలు చేపడుతున్నారు. ఇప్పటికే కరోనా ఉద్ధృతంగా ఉన్న నేపథ్యంలో టోక్యో ఒలంపిక్స్ వల్ల పెను ప్రమాదం సంభవిస్తుందని ఆ దేశ వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఈ క్రీడలతో కరోనా కొత్త రకం స్ట్రెయిన్ ఉద్భవించే అవకాశం ఉందని అంటున్నారు.

ఈ ఒలంపిక్స్ కోసం దాదాపు 200 దేశాల నుంచి అథ్లెట్లు వస్తారని అంతేకాకుండా కోచ్లు, మ్యాచ్ అధికారులు, వాలంటీర్లు, పాత్రికేయులు వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. ఈ క్రమంలో వైరస్ కొత్త స్ట్రెయిన్ పుట్టుకొచ్చే ప్రమాదం ఉందని జపాన్ వైద్యుల సంఘం హెచ్చరించింది. కాబట్టి ఈ ఏడాది క్రీడలు నిర్వహించకపోవడమే మంచిదని వైద్యుల సంఘం అధ్యక్షుడు నావోటో యుమేమా సూచించారు.

ప్రపంచవ్యాప్తంగా విశ్వరూపం చూపిస్తున్న కరోనా మహమ్మారి... వివిధ దేశాల నుంచి వచ్చిన వారు ఒక దగ్గర చేరితో కొత్త రకంగా రూపం మార్చుకోనుంది. ఇక ఇది అతి ప్రమాదకర స్థాయికి వెళ్లే అవకాశం ఉందని అంటున్నారు. అంతేకాకుండా టోక్యో ఒలంపిక్స్ స్ట్రెయిన్ అని పిలవాల్సి వస్తుందని అభిప్రాయపడ్డారు. క్రీడలను యథావిధిగా నిర్వహిస్తే జపాన్ లో ఆరోగ్య అత్యవసర పరిస్థితి ఏర్పడడం ఖాయమని అన్నారు.

జపాన్ లో కరోనా ప్రస్తుతం విపరీతంగా ఉంది. ఆ దేశంలో టీకా పంపిణీ మందకొడిగా సాగుతోంది. ఇప్పటివరకు 5 శాతం మాత్రమే వ్యాక్సినేషన్ కార్యక్రమం పూర్తైంనది ఆ దేశ అధికారులు వెల్లడించారు. రోజురోజుకూ కరోనా కేసులు పెరుగుతూ అక్కడి ఆస్పత్రులన్నీ రద్దీగా మారాయని తెలిపారు. అయితే కఠిన నిబంధనల నడుమ ఒలంపిక్స్ నిర్వహిస్తామని అంతర్జాతీయ ఒలంపిక్స్ సంఘం ప్రతినిధులు నొక్కి చెబుతున్నారు. క్రీడలు ప్రారంభమయ్యే నాటికి అథ్లెట్లకు 90శాతం టీకా పంపిణీ పూర్తవుతుందని అంటున్నారు. ఆ దేశ ప్రజల నుంచి మాత్రం తీవ్ర వ్యతిరేకత వస్తోంది. ఈ క్రమంలో జపాన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందా? అనే అంశం ఆసక్తిగా మారింది.