Begin typing your search above and press return to search.

టీడీపీ కి 100 నియోజకవర్గాల్లో 'టులెట్' బోర్డు!

By:  Tupaki Desk   |   1 July 2021 3:00 PM GMT
టీడీపీ కి 100 నియోజకవర్గాల్లో టులెట్ బోర్డు!
X
మొన్నటి ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయిన తర్వాత తెలుగుదేశంపార్టీ పరిస్ధితి మరీ దారుణంగా తయారైంది. జగన్మోహన్ రెడ్డి దెబ్బకు పార్టీకి ఇక్కడా అక్కడా అన్న తేడా లేకుండా మొత్తం 13 జిల్లాల్లోను కూసాలు కదలిపోయాయి. గెలిచిన దగ్గర నుండి జగన్ సంక్షేమ పథకాల అమలుతో జనాల్లో దూసుకుపోతున్న కారణంగా చాలా నియోజకవర్గాల్లో టీడీపీకి నేతలు కూడా కరువయ్యారు.

జగన్ ప్రభుత్వంపై నిరసనగా కార్యక్రమాలు నిర్వహించాలని చంద్రబాబునాయుడు పిలుపిస్తే స్పందించిన నేతలు చాలా తక్కువమందే. గడచిన రెండేళ్ళలో చంద్రబాబు ఎన్నిసార్లు పిలిపిచ్చినా నేతల్లో పెద్దగా కదలిక రాలేదన్నది వాస్తవం. దీనికి కారణం ఏమిటంటే ప్రధానంగా చాలా నియోజకవర్గాల్లో పార్టీ క్యాడర్ ను సమాయత్త పరిచేవారు లేకపోవటమే. పార్టీ వర్గాల అంచనా ప్రచారం సుమారు 100 నియోజకవర్గాల్లో గట్టి నేతలే లేరట.

పార్టీని ముందుండి నడిపించే గట్టి నేతలు లేకపోవటంతో చాలా నియోజకవర్గాల్లో పార్టీకి ఏకంగా టులెట్ బోర్డులు పెట్టేసినట్లే అని పార్టీ నేతలే వ్యంగ్యంగా మాట్లాడుకుంటున్నారు. పార్లమెంటరీ నియోజకవర్గాలకు అధ్యక్షులని కొందరిని చంద్రబాబు నియమించిన విషయం తెలిసిందే. పై స్ధాయిలో కొందరు నేతలు మాత్రం యాక్టివ్ గా ఉన్నా అసెంబ్లీ నియోజకవర్గాల్లోకి వెళితే నేతల లేని లోటు బాగా తెలుస్తుంది.

చాలా నియోజకవర్గాల్లో టీడీపీ తరపున నియోజకవర్గ ఇన్చార్జీలే లేరన్నది వాస్తవం. అందుకనే చాలా నియోజకవర్గాల్లో ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలే జరగటంలేదు. ఈ విషయంపై దృష్టి పెట్టాల్సిన చంద్రబాబు పట్టించుకోకపోవటంతో చుక్కాని లేని నావలాగ తయారైపోయింది పార్టీ పరిస్ధితి. క్షేత్రస్ధాయిలో ఇంత బలహీనంగా ఉన్న టీడీపీ వచ్చే ఎన్నికల్లో వైసీపీకి ఏమి పోటీ ఇస్తుందో ఎవరికీ అర్ధం కావటంలేదు.