Begin typing your search above and press return to search.

ఛత్.. చంద్రబాబు అంత ఛీప్ అయిపోయారా?

By:  Tupaki Desk   |   21 July 2015 7:52 AM GMT
ఛత్.. చంద్రబాబు అంత ఛీప్ అయిపోయారా?
X
ఛంద్రబాబును విపరీతంగా అభిమానించి.. ఆరాధించే వారు సైతం ఇప్పుడు ఆయన్ని తెగ విసుక్కుంటున్నారు. తప్పు మీద తప్పు చేస్తూ.. ఆయన అసలేం చేస్తున్నారో ఆయనకైనా అర్థం అవుతుందా?అని మండి పడుతున్న వారున్నారు. హద్దులు దాటుతున్న తమ్ముళ్లను కంట్రోల్ చేసే విషయంలో వైఫల్యం చెందుతున్న ఆయన.. పరిపాలన మీద పట్టు కోల్పోతున్నారని చెబుతున్నారు.

ఒకప్పుడు చంద్రబాబు పాలన అంటే చాలు.. అధికారులు వణికిపోయేవారని.. ఆయన నోటి నుంచి మాట వస్తే దాన్నో శిలాశాసనంలా అమలు చేసే వారని.. ఇప్పుడు అంత సీన్ లేదని చెబుతున్నారు. గతంలో బాబు చుట్టూ రాజకీయ నేతలు ఉంటే.. ఇప్పుడు మాత్రం అందుకు భిన్నంగా రాజకీయ నాయకులు హడావుడి చేస్తున్నారని.. వారి పుణ్యమా అని.. ఆయనకు ర్యాంగ్ ఫీడ్ బ్యాక్ వెళుతుందని చెబుతున్నారు.

ఇక.. అధికారుల నియామకం విషయంలోనూ తప్పులు చేస్తున్నారని.. దీంతో.. ఆయన ఏదైనా ఆదేశాలు జారీ చేస్తే లైట్ తీసుకోవటం కనిపిస్తుందన్న మాట వినిపిస్తోంది. గోదావరి పుష్కరాలకు సంబంధించి భక్తుల తాకిడి విపరీతంగా ఉన్న నేపథ్యంలో.. టోల్ గేట్ల కారణంగా విపరీతమైన రద్దీ చోటు చేసుకోవటం తెలిసింది. దీని కారణంగా కిలోమీటర్ల కొద్దీ ట్రాఫిక్ జాం అవుతున్న పరిస్థితి.

ఈ సమస్యను అధిగమించేందుకు వీలుగా..టోల్ గేట్ల వద్ద వసూళ్లు నిలిపివేయాలంటూ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. ఇలాంటి పరిస్థితే తెలంగాణలో చోటు చేసుకున్న సందర్భంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలు జారీ చేయటం.. నిమిషాల వ్యవధిలో అది అమలు కావటం జరిగిపోయింది. దీనికి భిన్నంగా.. ఏపీలో మాత్రం అలాంటి పరిస్థితి లేదు.

టోల్ గేట్ల వద్ద వసూళ్లు చేయొద్దని ముఖ్యమంత్రి ఆదేశించారని చెబితే.. తమకు రాత పూర్వకంగా ఆదేశాలు అందలేదని.. తామేం చేయలేమంటూ టోల్ గేట్ల సిబ్బంది పేర్కొనటం చూసినప్పుడు బాబు పవర్ అంతగా కుదించుకుపోయిందా? అనిపించక మానదు.శని.. ఆదివారాల్లో కొన్ని టోల్ గేట్ల దగ్గర ఇలాంటి పరిస్థితి ఏర్పడటం.. దీనిపై మీడియాలో వార్తలు రావటంతో ముఖ్యమంత్రి సీరియస్ అయినట్లు చెబుతున్నారు. అప్పుడు పరిస్థితి కాస్త అదుపులోకి వచ్చినా.. తణుకు లాంటి కొన్ని టోల్ గేట్ల దగ్గర మాత్రం బాబు మాటను లైట్ తీసుకున్నట్లుగా చెబుతున్నారు.

టోల్ గేట్ల దగ్గర కూడా బాబు మాట చెల్లుబాటు కాకపోవటంపై పలువురు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ఆదేశాల్నిపాటించని రీతిలో వ్యవస్థ ఉండటం చూసినప్పుడు బాబు ఛీప్ అయిపోయారా? లేక.. ఆయన పాలన అస్తవ్యస్తంగా మారిందా? అన్న సందేహం రాక మానదు.