Begin typing your search above and press return to search.

టాలీవుడ్ హీరోయిన్ల గుట్టు ర‌ట్టు చేస్తున్న క్యాసినో.. ఎవరెవరికి ఎంత..?

By:  Tupaki Desk   |   29 July 2022 9:30 AM GMT
టాలీవుడ్ హీరోయిన్ల గుట్టు ర‌ట్టు చేస్తున్న క్యాసినో.. ఎవరెవరికి ఎంత..?
X
టాలీవుడ్ లో ఇప్పుడు క్యాసినో వివాదం కలకలం రేపుతోంది. ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారుల (ఈడీ) దాడులతో హీరోయిన్ల గుట్టు రట్టవుతోంది. క్యాసినో సెంటర్లకు లోకల్ ఏజెంట్లుగా పనిచేస్తున్నట్లు భావిస్తున్న చీకోటి ప్రవీణ్ - మాధవరెడ్డి అనే వ్యక్తుల ఇళ్లతో పాటు మొత్తం 8 చోట్ల ఈడీ అధికారులు ఇటీవల సోదాలు నిర్వహించడంతో క్యాసినో వ్యవహారం బయటకు వచ్చింది.

నివేదికల ప్రకారం, మాధవ రెడ్డి మరియు చికోటి ప్రవీణ్ గోవాలో కాసినోలను నడుపుతున్నారు. నేపాల్ - శ్రీలంక - థాయ్‌ లాండ్ వంటి పలు దేశాలోని కాసినోలకు ప్రముఖులను తీసుకెళ్లడమే కాదు.. దేశంలోని ధనవంతుల కోసం ప్రత్యేక టూర్లు నిర్వహించారని నివేదికలు చెబుతున్నాయి. అక్కడ జూదంలో గెలుపొందిన సొమ్మును అక్రమంగా భారత్‌ లోకి అక్రమంగా తరలిస్తున్నారని ఈడీ అనుమానించింది.

పక్కా సమాచారంతో మాధవ రెడ్డి మరియు చికోటి ప్రవీణ్ లను పట్టుకున్న అధికారులు.. ఫారిన్ ఎక్స్ఛేంజ్ మేనేజ్‌మెంట్ యాక్ట్ (ఫెమా) నిబంధనల ఉల్లంఘనపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఈడీ విచార‌ణ‌లో అనేక ఆసక్తికరమైన విషయాలు వెల్లడైనట్లు వార్తలు వస్తున్నాయి.

దాదాపు 10 మంది టాలీవుడ్ సెలబ్రిటీలను నేపాల్‌ లోని క్యాసినోకు తీసువెళ్లి అక్కడ ప్రమోషన్ వీడియోలు చేయించినట్లు ఈడీ గుర్తించినట్లు తెలుస్తోంది. క్యాసినోకి వెళ్లిన వారెవరు? ఎవ‌రెవ‌రికి ఎంతెంత అందింది? వంటి వివ‌రాల‌పై అధికారులు ఆరా తీయగా.. పలువురు టాలీవుడ్‌ - బాలీవుడ్‌ హీరోయిన్ల పేర్లు వెల్లడించినట్లు నివేదికలు చెబుతున్నాయి.

ప్రముఖ మీడియా ఛానల్స్ లో వస్తున్న కథనాల ప్రకారం, నేపాల్ లో క్యాసినోను ప్రమోట్ చేయడానికి మల్లికా షెరావత్‌ - అమిషా పటేల్‌ - ఈషా రెబ్బా - ముమైత్ ఖాన్ - డింపుల్ హయాతీ వంటి పలువురు సెలబ్రిటీలతో చీకోటి ప్రవీణ్ ఒప్పందం చేసుకున్నాడు. మల్లికా షెరావత్‌ కు రూ.కోటి - అమిషా పటేల్‌ రూ.80 లక్షలు - ఇషా రెబ్బకు రూ.40 లక్షలు - డింపుల్‌ హయాతీ రూ.40 లక్షలు - గోవింద 50 లక్షలు - గణేశ్‌ ఆచార్య రూ.20 లక్షలు - ముమైత్‌ ఖాన్‌ రూ.15 లక్షల రూపాయలు తీసుకునట్లు నెట్టింట వైరల్ అవుతోంది. ఈ క్రమంలో సినీ తారలకు ఈడీ నోటీసులను జారీ చేసే అవకాశం ఉందని అంటున్నారు.

ఇకపోతే చీకోటి ప్రవీణ్ జూన్ 10 నుంచి జూన్ 13 వరకు ఇండో-నేపాల్ సరిహద్దులో క్యాసినో నిర్వహించినట్లు ఈడీ గుర్తించిందని తెలుస్తోంది. అలానే పలువురు టాలీవుడ్ హీరోయిన్లు టచ్‌ లో ఉన్నట్లు కీలక ఆధారాలను సేకరించారు. రానున్న రోజుల్లో ఈ వ్యవహారంలో మరిన్ని షాకింగ్ విషయాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.

ఈడీ సోదాల విషయంపై చీకోటి ప్రవీణ్ స్పందించారు. మనదేశంలోని గోవాలో.. నేపాల్ - ఇండోనేషియా దేశాల్లో క్యాసినో చట్టబద్ధమేనని.. తాను చట్టవిరుద్ధం కాని వ్యాపారం చేయలేదని పేర్కొన్నాడు. తానొక సామాన్య వ్యక్తిని అని.. ఈడీ అధికారులకు సందేహాలు ఉండడంతో వివరణ అడిగారని చెప్పాడు. అయితే హవాలా మార్గాల ద్వారా నగదు బదిలీ జరుగుతోందని ఈడీ గుర్తించినట్లు నివేదికలు చెబుతున్నాయి.