Begin typing your search above and press return to search.

మరద్దే సినిమావోళ్లతో పెట్టుకుంటే అలాగే ఉంటది!

By:  Tupaki Desk   |   24 July 2017 5:47 AM GMT
మరద్దే సినిమావోళ్లతో పెట్టుకుంటే అలాగే ఉంటది!
X
ఇవాళ అయిదో రోజు. ఇప్పటికి నాలుగురోజుల పాటూ సినిమా సెలబ్రిటీలను డ్రగ్స్ వ్యవహారంలో ఎక్సయిజ్ ఉన్నతాధికారులు, సిట్ అధికారులు విచారించడం జరిగింది. సాధారణంగా ఉదయం 10.30 గంటలకు విచారణ మొదలు కావాలి. కానీ ఈ నాలుగు రోజుల్లో ఏ ఒక్కరోజు కూడా ఏ ఒక్క సినిమా సెలబ్రిటీ కూడా విచారణకు ఆలస్యంగా రాలేదు. వారందరూ డ్రగ్స్ వాడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న వారే కావచ్చు గాక.. కానీ.. నిర్ణీతసమయానికంటె ఒక్కరు కూడా ఆలస్యంగా రాలేదు. నిజానికి తరుణ్, శ్యాం కె.నాయుడు వంటి వారు.. నిర్ణీతసమయానికంటె చాలా ముందుగానే వచ్చేశారు. ఇతర రంగాల్లో అరుదుగాను, సినిమా ఇండస్ట్రీలో అలవాటుగాను కనిపించే సమయపాలన క్రమశిక్షణ అది. అందుకే సినిమావోళ్లతో పెట్టుకుంటే అలాగే ఉంటుంది.

ఒక రాజకీయ నాయకుడి కార్యక్రమం సాయంత్రం ఆరు గంటలకు ప్రారంభం కావాల్సి ఉంటే , ఆయన ఏడు గంటలకు వచ్చినా.. ఆయన సమయపాలన వైఫల్యం గురించి పెద్దగా చర్చ జరగదు. కానీ సినిమా ఇండస్ట్రీలో నటులు షూటింగ్ కు గంట లేటుగా వస్తే.. ఆ హీరో మీద క్రమశిక్షణ లేదంటూ ఒక ముద్ర పడిపోతుంది. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీలో సమయపాలన క్రమశిక్షణ అందరికీ ఒక అలవాటుగా ఉంటుంది. అందరూ దానిని ఖచ్చితంగా పాటిస్తారు. నందమూరి తారక రామారావు - మోహన్ బాబు లాగా సదరు క్రమశిక్షణకు పేరుమోసిన ప్రముఖులు కూడా కొందరుంటారు.

ఏది ఏమైనప్పటికీ సినిమా ఇండస్ట్రీ వాళ్ల వ్యసనాల గురించి ఇప్పుడు విపరీతంగా చర్చ జరుగుతోంది. డ్రగ్స్ కూడా సమాజంలో వారు మాత్రమే వాడుతున్నట్లుగా అభిప్రాయాలు ఏర్పడుతున్నాయి. అయితే.. సినిమావాళ్లకు ఉండే కొన్ని పాజిటివ్ అంశాలను కూడా గమనించండి. మరో రంగానికి చెందిన వారితో ఇదే తరహా విచారణ పర్వం జరుగుతూ ఉంటే.. ప్రతిరోజూ ఇలా నిర్ణీత సమయానికంటె ముందుగా నిందితులు వచ్చి వెయిట్ చేస్తూ కూర్చోవడం జరిగేదేనా? సినిమా ఇండస్ట్రీ వారికి ఉండే ఈ క్రమశిక్షణను అభినందించండి. ప్రస్తుత పరిస్థితుల్లో అందరూ వారిని వేలెత్తి చూపిస్తోంటే.. ఆ రంగంలో ఈ వ్యవహారంతో నిమిత్తం లేని వారు కూడా ఎంతగా కుమిలిపోతారో కదా..! మరి సినిమా వాళ్లు పాటిస్తున్న డిసిప్లయిన్ కోణం కూడా చూడండి.. వారు సంతోషిస్తారు. ఏమంటారు?