Begin typing your search above and press return to search.

'తార‌ల' డ్ర‌గ్స్ కేసు సుప్రీంకు చేరుకుంది

By:  Tupaki Desk   |   19 Sep 2017 4:44 AM GMT
తార‌ల డ్ర‌గ్స్ కేసు సుప్రీంకు చేరుకుంది
X
సంచ‌ల‌న సృష్టించిన డ్ర‌గ్స్ కేసుకు సంబంధించి తాజాగా ఆస‌క్తిక‌ర ప‌రిణామం ఒక‌టి చోటు చేసుకుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ.. దేశ వ్యాప్తంగా తీవ్ర చ‌ర్చ‌కు కార‌ణ‌మైన డ్ర‌గ్స్ కేసులో టాలీవుడ్ కు చెందిన ప‌లువురు ప్ర‌ముఖుల‌కు లింకులు ఉన్న‌ట్లుగా ఆరోప‌ణ‌లు ఉన్నాయి. వారాల త‌ర‌బ‌డి హాట్ టాపిక్ గా మారిన ఈ డ్ర‌గ్స్ వ్య‌వ‌హారం మిగిలిన అంశాల మాదిరే నీరు కారిపోయింద‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది.

సినీ సెల‌బ్రిటీల‌ను సిట్ అధికారులు విచారించ‌టం.. వారి విచార‌ణ త‌ర్వాత ఛార్జ్ షీట్ దాఖ‌లు చేస్తున్న‌ట్లు చెప్పినా.. అందుకు సంబంధించిన స‌రైన అడుగు ఇప్ప‌టివ‌ర‌కూ ప‌డ‌లేద‌ని చెబుతున్నారు. ఇదిలా ఉంటే.. ఈ డ్ర‌గ్స్ వ్య‌వ‌హారాన్ని సీబీఐకి అప్ప‌గించాలంటూ త‌మిళ‌నాడు తెలుగు యువ‌శ‌క్తి అధ్య‌క్షుడు కేతిరెడ్డి జ‌గ‌దీశ్వ‌ర్ రెడ్డి సుప్రీంకోర్టులో ఒక ప్ర‌జా ప్ర‌యోజ‌న వ్యాజ్యాన్ని దాఖ‌లు చేశారు.

దీన్ని విచార‌ణ‌కు స్వీక‌రించిన ప్ర‌ధాన న్యాయ‌మూర్తి జ‌స్టిస్ దీప‌క్ మిశ్రా నేతృత్వంలోని ధ‌ర్మాస‌నం ఈ పిటిష‌న్ పై తాజాగా ఆదేశాలు జారీ చేసింది. కేంద్రంతో స‌హా 18 మందిని ప్ర‌తివాదులుగా చేర్చిన ఈ కేసులో డ్ర‌గ్స్‌ ను అరిక‌ట్టేలా స‌రైన విధానాన్ని కేంద్రం అమ‌లు చేయ‌లేద‌న్నారు.

డ్ర‌గ్స్‌ను అరిక‌ట్టేందుకు త‌గిన విధానం అమ‌లు చేయాల‌ని సుప్రీం ఆదేశించిన‌ప్ప‌టికీ కేంద్రం చ‌ర్య‌లు తీసుకోలేద‌ని పిటిష‌న‌ర్ వాదించారు. ఈ కార‌ణంతోనే తెలంగాణ‌.. ఏపీ.. త‌మిళ‌నాడు.. గోవా.. పుదుచ్చేరి.. పంజాబ్‌.. మ‌హారాష్ట్ర.. ఈశాన్య రాష్ట్రాల్లో డ్ర‌గ్స్ వినియోగం పెరిగిపోయింద‌న్నారు. డ్ర‌గ్స్ కార‌ణంగా ఎక్కువ‌మంది ఆత్మ‌హ‌త్య చేసుకున్న రాష్ట్రాల్లో తెలంగాణ 2014 దేశంలో నాలుగో స్థానంలో.. ఏపీ ఐదో స్థానంలో నిలిచింద‌న్నారు.

వంద‌లాది మంది చిన్నారుల‌తో స‌హా.. సినీ ప్ర‌ముఖులు సైతం డ్ర‌గ్స్ బారిన ప‌డ్డార‌ని.. ఈ వ్య‌వ‌హారంపై తెలంగాణ పోలీసు విభాగం విచార‌ణ జ‌రుపుతోంద‌న్న విష‌యాన్ని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఈ కేసును విచారిస్తున్న సిట్ ద‌ర్యాఫ్తులో పార‌ద‌ర్శ‌క‌త లేద‌ని.. తీవ్ర రాజ‌కీయ ఒత్తిళ్లు ఉన్న‌ట్లుగా పిటిష‌న‌ర్ ఆరోపించారు. సినీ ప్ర‌ముఖులు డ్ర‌గ్స్ వ్య‌వ‌హారంలో ఉంటే వారిని బాధితులుగానే చూస్తామ‌ని ఉన్న‌తాధికారుల స‌మ‌క్షంలో సీఎం కేసీఆర్ అన‌టంతో కేసు నీరు కారిపోయింద‌న్న విష‌యాన్ని సుప్రీం దృష్టికి తీసుకొచ్చారు. ఈ నేప‌థ్యంలో డ్ర‌గ్స్‌పై సుప్రీం ఆదేశాల అమ‌లుకు కేంద్రం.. ఇత‌ర రాష్ట్రాలు తీసుకున్న చ‌ర్య‌ల్ని చెప్పాలంటూ అత్యుత్త‌మ న్యాయ‌స్థానం ఆదేశాలు జారీ చేసింది.