Begin typing your search above and press return to search.

ఉక్కు పోరుకు జూనియ‌ర్స్ సై.. సీనియ‌ర్స్ నై..!

By:  Tupaki Desk   |   13 March 2021 10:30 AM GMT
ఉక్కు పోరుకు జూనియ‌ర్స్ సై.. సీనియ‌ర్స్ నై..!
X
విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీక‌ర‌ణ‌ను వ్య‌తిరేకిస్తూ రాష్ట్ర‌వ్యాప్తంగా ఆందోళ‌న‌లు కొన‌సాగుతున్నాయి. చ‌ట్ట‌ప‌రంగా ఇవ్వాల్సిన వాటిని తొక్కిపెట్టిందేగాక‌.. ఉన్న‌వాటిని కూడా అమ్మేస్తున్నార‌ని ప్ర‌జ‌లు న‌రేంద్ర మోడీ ప్ర‌భుత్వంపై తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తంచేస్తున్నారు. ఈ విష‌యంలో అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌లూ ఏక‌తాటిపైకి వ‌చ్చారు. రాజ‌కీయ పార్టీలు కూడా కలిసికట్టుగా కేంద్రం తీరుపై మండిప‌డుతున్నాయి. ఈ విధంగా విశాఖ ఉక్కు ఉద్య‌మం రోజు రోజుకూ ఉధృత‌మ‌వుతోంది.

అయితే.. ఇంత జ‌రుగుతున్నా, చిత్ర ప‌రిశ్ర‌మ‌లో టాప్ హీరోలం అని చెప్పుకునే వారు క‌నీసం ఒక్క మాటైనా మాట్లాడ‌క‌పోవ‌డం విస్మ‌యం క‌లిగిస్తోంది. జూనియ‌ర్ హీరోలు, ఇత‌ర టెక్నీషియ‌న్లు ఉద్య‌మానికి మ‌ద్ద‌తు ప్ర‌క‌టిస్తున్నప్పటికీ.. సీనియర్లు మౌనవ్రతం చేస్తుండడం గమనార్హం. సీనియ‌ర్ల‌లో మెగాస్టార్ చిరంజీవి మాత్ర‌మే ఇప్ప‌టి వ‌ర‌కూ ఉద్యమానికి మద్దతు తెలిపారు. మిగిలిన ఏ ఒక్క పెద్ద‌ హీరో కూడా వైజాగ్ స్టీల్ ఫ్యాక్ట‌రీ ఆందోళ‌న‌పై మాట్లాడ‌క‌పోవ‌డంతో జ‌నాల నుంచి తీవ్రస్థాయిలో ఆగ్ర‌హం వెల్లువెత్తుతోంది.

విశాఖ ఉద్య‌మానికి మ‌ద్ద‌తు తెలుపుతూ మొట్ట‌మొద‌ట‌గా నారా రోహిత్ సోష‌ల్ మీడియా వేదిక‌గా స్పందించారు. ఆ త‌ర్వాత కొన్ని రోజుల‌కు మెగాస్టార్ చిరంజీవి ఫ్యాక్ట‌రీ ప్రైవేటీక‌ర‌ణను వ్య‌తిరేకిస్తూ ట్వీట్ చేశారు. విశాఖ ఉక్కు ఫ్యాక్ట‌రీ కోసం ప్రాణాలు కోల్పోయిన కార్మికుల‌ను స్మ‌రిస్తూ.. పెద్ద పోస్టు రాశారు. వారి స్ఫూర్తితో పోరాటం చేసి, విశాఖ ఉక్కును ర‌క్షించుకుందామ‌ని పిలుపునిచ్చారు.

ఆ త‌ర్వాత కొన్ని రోజులకు ఒక్కొక్క‌రుగా స్టీల్ ఫ్యాక్ట‌రీ పోరాటానికి చిత్ర ప‌రిశ్ర‌మ ‌నుంచి మ‌ద్ద‌తు తెలుపుతూ వ‌చ్చారు. మంచు విష్ణు, మ‌నోజ్ తోపాటు రైట‌ర్లు వెంక‌ట్ శిద్దారెడ్డి, పెద్దింటి అశోక్ కుమార్‌, బ‌మ్మిడి జ‌గ‌దీశ్వ‌ర‌రావు కార్మికుల‌కు బాస‌ట‌గా నిలిచారు. బీజేపీ ప్ర‌భుత్వం తీసుకున్న ప్రైవేటీక‌ర‌ణ నిర్ణ‌యాన్ని త‌ప్పు బ‌ట్టారు. వీరితోపాటు న‌టులు జోగి బ్ర‌ద‌ర్ కృష్ణంరాజు, క‌త్తిమ‌హేష్‌, తిరువీర్, గేయ ర‌చ‌యిత పింగ‌ళి చైత‌న్య‌, ద‌ర్శ‌కుడు వేణు ఊడుగుల ఇలా.. ఒక్కొక్క‌రుగా కార్మిక పోరాటానికి అండ‌గా నిలుస్తున్నారు.

కానీ.. సీనియ‌ర్ హీరోలం అని చెప్పుకునే వారు మాత్రం ఇప్ప‌టి వ‌ర‌కూ నోరు మెదప‌‌క‌పోవ‌డంప‌ట్ల ప్ర‌జ‌లు, కార్మికులు మండిప‌డుతున్నారు. ఇత‌ర ఇండ‌స్ట్రీల‌కు చెందినవారు ప్ర‌జాస‌మ‌స్య‌ల ప‌ట్ల తమ గ‌ళం వినిపిస్తున్న‌ప్ప‌టికీ.. ఇక్క‌డి హీరోలు మాత్రం మౌనంగా ఉండ‌డం ఏంట‌ని ప్ర‌శ్నిస్తున్నారు. ఇప్ప‌టికైనా స్పందించి, ప్రత్య‌క్షంగా ఉద్య‌మంలో పాల్గొనాల‌నే డిమాండ్లు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. మ‌రి, సీనియ‌ర్ హీరోలు ఇక‌నైనా స్పందిస్తారో లేదో చూడాలి.