Begin typing your search above and press return to search.

మెగాస్టార్ రూట్ : అన్నయ్యకు అటూ ఇటూ...?

By:  Tupaki Desk   |   24 May 2022 2:30 PM GMT
మెగాస్టార్ రూట్  :  అన్నయ్యకు అటూ ఇటూ...?
X
మెగాస్టార్ చిరంజీవిని తెలుగు వారు అంతా ప్రేమగా అన్నయ్య అని పిలుచుకుంటారు. అన్నయ్య అంటేనే చాలు ఆయన పులకించిపోతారు. సౌమ్యుడిగా అందరివాడిగా చిరంజీవి జనం గుండెల్లో కొలువు తీరారు. ఆయన సాఫ్ట్ నెస్ రాజకీయాలకు పనికిరాదు అని ప్రజారాజ్యం పార్టీ తరువాత తేలిపోవడంతో ఆయన మళ్లీ ఈ వైపుగా తొంగి చూడలేదు. ఇక ఆ మధ్యన‌ ఆయన అనేక ఇంటర్వ్యూలలో కూడా అడిగిన వారికి ఆయన ఇచ్చిన జవాబు ఒక్కటే. తాను మళ్ళీ రాజకీయాల్లోకి వచ్చే ప్రసక్తి లేదని.

ఇక తన ఇంట్లో సోదరుడు పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టి రాజకీయం చేస్తున్నారు అని అయినా తనకు ఆసక్తి లేదని తేల్చేసారు మెగాస్టారు. కానీ ఇపుడు చూస్తే మెగా ఫ్యామిలీలోనే పొలిటికల్ సీన్ సీన్ మెల్లగా మారుతోంది. ఈ మధ్యనే మెగాభిమానులు అంతా విజయవాడలో సమావేశం అయ్యారు. వారందరి జెండా అజెండా ఒక్కటే అయింది. ఎలాగైనా పవన్ కళ్యాణ్ ని ఈసారి సీఎం గా చేసుకోవాలి. ఈ విషయంలో అంతా ఒక్కటిగా ఉండాలని.

అంటే మెగాస్టార్ అఖిల భారత అభిమాన సంఘం అధ్యక్షుడు స్వామినాయుడు ఈ మెగా మీటింగుకు నాయకత్వం వహించారు. ఆయన సూచనలు సలహాలతోనే ఈ సమావేశం జరిగింది. స్వామినాయుడు అంటే 2007 నాటి సన్నివేశాలు గుర్తుకువస్తాయి. నాడు ప్రజారాజ్యం పార్టీ వెనక ఆయన హడావుడి చాలానే ఉంది. మెగాస్టార్ కి అసలైన వీర భక్త హనుమాన్ లాంటి వారు స్వామినాయుడు.

ఆయన ఏ పని చేసినా అన్నయ్య ఆశీస్సులు లేకుండా చేయరు అని అంటారు. అలాంటి స్వామినాయుడు ఇపుడు మెగా మీటింగ్ పెట్టారు అంటే వెనక మెగాస్టార్ బ్లెస్సింగ్ లేకుండా చేస్తారా అన్నది పెద్ద డౌట్. అంతే కాదు ఇంతటి కీలకమైన మీటింగ్ పెడుతున్నారు అంటే మెగాస్టార్ కి చెప్పకుండా చేయగలరా. అలా కనుక చేస్తే అది దుస్సాహసం అవుతుంది కదా. ఇవన్నీ కూడా ప్రశ్నలే.

అంటే లాజిక్ గా ఆలోచిస్తే మెగాస్టార్ తో సూచనాప్రాయంగా అయినా చెప్పే ఈ మీటింగ్ జరిపిఉంటారు అని అంటున్నారు. ఇక మెగాస్టార్ విషయానికి వస్తే ఆయన తన సినిమాలు ఏంటో తాను ఏంటో అన్నట్లుగానే ఉన్నారు. ఒక విధంగా ఆయన రాజకీయాలకు స్వస్తివాచకం పలికేశారు అని చెబుతారు. కానీ ఎపుడు ఏమి జరుగుతుందో ఎవరికి తెలుసు అన్న మాట కూడా ఉంది.

మెగాభిమానులు ఈసారి చావో రేవో అంటున్నరు. ఇజ్జత్ కా సవాల్ అని కూడా అంటున్నారు. మరి ఫ్యాన్స్ వీర భక్తి ఆ రేంజిలో ఉంటే మెగా హీరోలు కూడా రాజకీయ తెర ముందుకు రావాల్సిందే కదా అన్న చర్చ కూడా ఉంది. ఇప్పటికైతే మెగాస్టార్ ఒక్క మాట అయినా రాజకీయాల గురించి మాట్లాడలేదు. పైగా ఆయన న్యూట్రల్ గా ఉంటున్నారు. అటు తెలంగాణాలోని టీయారెస్ తో పాటు ఇటు ఆంధ్రాలోని వైసీపీ సర్కార్ పెద్దలతోనూ మంచి రిలేషన్స్ ని మెయిన్ టెయిన్ చేస్తున్నారు

ఈ రోజుకీ టాలీవుడ్ సినీ పెద్దగానే ఆయన ఉంటున్నారు. అలాగే ఉండాలని కోరుకుంటున్నారు. అయితే మెగా ఫ్యాన్స్ మీటింగ్ పెట్టుకుంటామంటే మెగాస్టార్ ఓకే చెప్పి ఉంటారని అంత మాత్రం చేస్త ఆయన గతంలో మాదిరిగా బయటకు వచ్చి జనసేనకు ప్రచారం చేసి పెట్టేది ఉండదని అంటున్నారు. అయితే జనసేనకు తన మద్దతు ఉందని సందేశం ఇచ్చేలా మెగాస్టార్ వైఖరి ఉన్నా చాలు అదే పదివేలు అని కూడా జనసైనికులు అంటున్నారు. ఇక కీలకమైన ఎన్నికల వేళ మెగాస్టార్ తన పరోక్ష సందేశాన్ని సంకేతాలను కనుక పంపించడం ద్వారా జనసేనకు తన సపోర్ట్ అని చెప్పే అవకాశం ఉంది అని అంటున్నారు. మొత్తానికి మెగా ఫ్యాన్స్ మెగాస్టార్ ని పొలిటికల్ ముగ్గులోకి లాగేస్తున్నారా అన్న చర్చ అయితే జోరుగా సాగుతోంది.